Shubman Gill breaks Virat Kohli’s Record: ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ నిర్ధేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి చివరి బంతికి ఛేదించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (72; 44 బంతుల్లో 6×4, 2×6) హాఫ్ సెంచరీతో జట్టును ముందుండి నడిపిస్తే.. ఇన్నింగ్స్ చివరలో రాహుల్ తెవాతియా (22; 11 బంతుల్లో 3×4), రషీద్ ఖాన్ (24 నాటౌట్; 11 బంతుల్లో 4×4) ఊహించని విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో గిల్ అరుదైన ఘనత సాధించాడు.
ఐపీఎల్‌లో 3000 పరుగుల మైలురాయిని అందుకున్న అత్యంత పిన్నవయస్కుడిగా శుభ్‌మన్ గిల్ రికార్డు నెలకొల్పాడు. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద గిల్ ఈ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. 24 ఏళ్ల 215 రోజుల వయసులో 3000 పరుగుల మార్కును అందుకున్నాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 26 ఏళ్ల 186 రోజుల వయసులో 3000 పరుగుల మార్కును తాకాడు. ఈ జాబితాలో సంజూ శాంసన్, సురేశ్ రైనా, రోహిత్ శర్మ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. సంజూ 26 ఏళ్ల 320 రోజుల వయసులో, రైనా 27 ఏళ్ల 161 రోజుల వయసులో, రోహిత్ 27 ఏళ్ల 343 రోజుల వయసులో 3000 పరుగుల మైలురాయిని చేరారు.
Also Read: GT vs RR: ఉత్కంఠపోరులో గుజరాత్ గెలుపు.. రాజస్థాన్కు తొలి ఓటమి
ఐపీఎల్‌లో తక్కువ ఇన్నింగ్స్‌లలో 3000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో శుభ్‌మన్ గిల్ నాలుగో స్థానంలో నిలిచాడు. గిల్ 3000 పరుగులు పూర్తి చేసేందుకు 94 ఇన్నింగ్స్‌లు ఆడాడు. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 75 ఇన్నింగ్స్‌ల్లో 3000 పరుగులు చేసి టాప్‌లో ఉన్నాడు. కేఎల్ రాహుల్ (80 ఇన్నింగ్స్‌లు), జోస్ బట్లర్ (85) 2, 3 స్థానాల్లో ఉన్నారు. గిల్, డేవిడ్ వార్నర్, ఫాఫ్ డుప్లెసిస్ 94 ఇన్నింగ్స్‌ల్లో 3000 పరుగులు చేశారు.