Sunil Gavaskar Slams Virat Kohli Over Strike Rate: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై భారత జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఫైర్ అయ్యాడు. ఓ ప్లేయర్ ఆటతీరును బట్టే తాము వ్యాఖ్యానిస్తామని, ప్రత్యేక ఎజెండా అంటూ ఏమీ ఉండన్నాడు. 14-15 ఓవర్ వరుకు క్రీజులో ఉండి.. 118 స్ట్రైక్‌రేటుతో బ్యాటింగ్ చేస్తే స్లో ఇన్నింగ్స్ అంటారన్నాడు. బయట నుంచి వచ్చే విమర్శలకు ఎందుకు బదులిస్తున్నారు? అని సన్నీ ప్రశ్నించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.
ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 43 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌పై సునీల్ గవాస్కర్‌తో పాటు మాజీ క్రికెటర్లు కొందరు కీలక వ్యాఖ్యలు చేశారు. విరాట్ స్లో ఇన్నింగ్స్ ఆడాడని, ఆర్సీబీ ఇలాంటి ప్రదర్శను ఆశించట్లేదని గవాస్కర్ విమర్శించాడు. తనపై వచ్చిన కామెంట్లపై గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం కోహ్లీ స్పందించాడు. స్ట్రైక్‌రేట్ తక్కువగా ఉందని కామెంట్లు చేసేవారికి ఆటపై పెద్దగా అవగాహన ఉండి ఉండదని ఎద్దేవా చేశాడు. బాక్స్‌లో కూర్చొని కామెంటరీ చేయడం చాలా సులువే అని, బయట కూర్చొని కామెంట్లు చేసే చాలా మందికి మ్యాచ్ పరిస్థితి తెలియదని విరాట్ మండిపడ్డాడు.
Also Read: Virat Kohli: ఏకైక ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డు!
విరాట్ కోహ్లీ వ్యాఖ్యలపై శనివారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ సందర్భంగా సునీల్ గవాస్కర్ స్పందించాడు. ‘బయట నుంచి వచ్చే విమర్శలను పట్టించుకోమని చెప్పే ప్లేయర్స్.. ఎందుకు బదులిస్తున్నారు?. మేం కొంచెమే క్రికెట్ ఆడాం. మీలా ఎక్కువగా ఆడలేదు. మేం చూసే దాని గురించే మాట్లాడతాం. మాకు ఇష్టాలు, అయిష్టాలు అంటూ ఉండవు. ఆట గురించే విశ్లేషిస్తాం. ప్రత్యేక ఎజెండా అంటూ ఏమీ ఉండదు. స్ట్రైక్‌రేటు 118గా ఉన్నప్పుడు వ్యాఖ్యాతలు ప్రశ్నలు లేవనెత్తుతారు. నేను ఎక్కువగా మ్యాచ్‌లు చూడను కాబట్టి ఇతర వ్యాఖ్యాతలు ఏమన్నారో తెలియదు. అయితే ఓపెనర్‌గా వచ్చి14-15 ఓవర్లు ఆడి.. 118 స్ట్రైక్‌రేటుతో బ్యాటింగ్ చేస్తే స్లో ఇన్నింగ్స్ అనే అంటారు. వాటికి పొగడ్తలు ఉండవు. ప్రశంసలు దక్కాలనుకుంటే ఇనింగ్స్ భిన్నంగా ఉండాలి’ అని కౌంటర్ ఇచ్చాడు.