ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలంకు సంబంధించి ఓ బిగ్ అప్డేట్ వచ్చింది. వేలం డిసెంబర్ 16న జరగనునట్లు సమాచారం. ఇండియాలో కాకుండా అబుదాబిలో వేలం నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్లాన్ చేస్తోందట. మినీ వేలం కాబట్టి ఒకే రోజులో ముగియనుంది. ఈ మేరకు ఓ క్రీడా ఛానెల్ తమ కథనంలో పేర్కొంది. ముంబైలో డిసెంబర్ 15న వేలం జరగనున్నట్లు ముందు నుంచి వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఐపీఎల్ 2026 మినీ వేలంకు సంబంధించిన తేదీని బీసీసీఐ శనివారం (నవంబర్ 15) అధికారికంగా ప్రకటించనుంది. కోల్‌కతా భారత్, దక్షిణాఫ్రికా మధ్య మొదటి టెస్ట్ రెండోరోజు అనంతరం వేలం తేదీని బీసీసీఐ అధికారులు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్ ఆక్షన్ ఇప్పటికే రెండుసార్లు విదేశాల్లో జరిగింది. ఐపీఎల్ 2024 వేలం మొదటిసారి దుబాయ్‌లో జరిగింది. 2025 సీజన్ మెగా వేలం నవంబర్ 2024లో జెడ్డాలో జరిగింది. ఇప్పుడు అబుదాబిలో జరిగితే.. వరుసగా మూడోసారి భారతదేశం వెలుపల వేలం జరుగుతుంది.
Also Read: IPL 2026-KKR: కేకేఆర్‌లోకి చెన్నై ప్లేయర్.. ట్రాక్ రికార్డు అదుర్స్!
10 ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ లిస్టును సమర్పించుకోవడానికి నవంబర్ 15 చివరి తేదీ. శనివారం మధ్యాహ్నం 3 గంటలలోపు బీసీసీఐకి ఫ్రాంచైజీలు తమ లిస్టును సమర్పించాలి. ఆ తర్వాత బోర్డు రిజిస్టర్డ్ ఆటగాళ్ల జాబితాను పంపుతుంది. ఆ జాబితా నుంచి షార్ట్‌లిస్ట్ తయారు చేయబడుతుంది. ఐపీఎల్ 2026 వేలంకు ముందు జోరుగా ట్రేడ్స్ సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక మార్చి 15 నుంచి మే 31 వరకు ఐపీఎల్ 2026 కోసం తాత్కాలిక విండోను నిర్ణయించింది. అంటే ప్రేక్షకులు వచ్చే సీజన్లో దాదాపు రెండున్నర నెలల ఉత్తేజకరమైన క్రికెట్‌ను ఆస్వాదించనున్నారు.