రెజ్లింగ్ పై ఆశలు గట్టిగానే ఉన్నాయి. షూటింగ్ గురి తప్పదనే నమ్మకం ఉంది..అథ్లెటిక్స్ లో అంతంత మాత్రంగానే ఉన్నా, హాకీలో అద్భుతాలు జరుగుతాయనే అంచనాలున్నాయి. ఓవరాల్ గా భారత క్రీడాకారులు గతం కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తారని భావిస్తున్నారు.
భారత్ ఖాతాలో ఎన్ని పతాకాలొస్తాయనే అంశంపై చాలా అంచనాలున్నాయి. నిజానికి ప్రతి నాలుగేళ్లకొకసారి ఈ చర్చ నడుస్తూనే ఉంటుంది. గతాన్ని పరిశీలిస్తే భారత్‌కు లభించిన పతకాల సంఖ్య వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. అయితే, టోక్యోలో భారత్ డబుల్ డిజిట్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు క్రీడా పరిశీలకులు
భారత్‌కు 19 పతకాలు వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. వీటిలో 4 స్వర్ణ, 9 రజత, 6 కాంస్య పతకాలు రావచ్చని అంచనాలున్నాయి. ఓవరాల్‌గా పతకాల పట్టికలో 18వ స్థానంలో నిలవవచ్చని లెక్కలు వేస్తోంది.
భారత ఒలింపిక్ చరిత్రలో అత్యధికంగా 2012 లండన్ గేమ్స్‌లో ఆరు పతకాలు సాధిస్తే.. 2016 రియోకు వచ్చే సరికి ఆ సంఖ్య రెండుకు పడిపోయింది. గత క్రీడలతో పోల్చుకుంటే భారత పతకాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నా.. రెండంకెలను సాధించడం కష్టమనే అభిప్రాయం కూడా కొన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.
భారత్ టోక్యోలో మెడల్స్ ఎక్కువగా అందించే ఈవెంట్ షూటింగ్ అని భావిస్తున్నారు. 10 మీ. ఎయిర్ రైఫిల్‌లో ఎలవేనిల్ వలరివన్ స్వర్ణం సాధిస్తుందని భారీగా ఆశలున్నాయి. కొత్తగా ప్రవేశపెట్టిన 10 మీ. ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో మనూ భాకర్-సౌరభ్ చౌధరి జోడీ పసిడిని షూట్ చేసే అవకాశాలున్నాయి. ఇదే ఈవెంట్ వ్యక్తిగత విభాగాల్లో భాకర్, సౌరభ్, మహిళల 25 మీ. ఎయిర్ రైఫిల్‌లో రాహి సర్నోబాత్, 10 మీ. రైఫిల్ మిక్స్‌లో దివ్యాంశ్ సింగ్ పన్వర్-వలరివన్ జోడీ రజతాలు నెగ్గే చాన్సుంది. పురుషుల 10 మీ. ఎయిర్ రైఫిల్‌లో దివ్యాంశ్, 10 మీ. ఎయిర్ పిస్టల్‌లో యశస్విని కాంస్యం సాధిస్తారనే అంచనాలు వేస్తున్నారు.
టోక్యో రెజ్లింగ్‌లో గట్టిగా వినిపిస్తున్న పేర్లు బజరంగ్ పూనియా , మహిళల్లో వినేష్ ఫొగట్. ఫ్రీస్టైల్ విభాగంలో వీరిద్దరూ బంగారు పతకాలు సాధిస్తారనే అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇక 86 కిలోల్లో దీపక్ పూనియా కాంస్యం నెగ్గుతాడని భావిస్తున్నారు. రవి దహియా కు సంచలనం సృష్టించగలిగే సత్తా ఉంది.
వెయిట్ లిఫ్టింగ్‌లో ఏకైక ఆశ మీరాబాయి చాను. మెగా ఈవెంట్‌కు నార్త్ కొరియా దూరం కావడంతో.. మీరాకు పతక అవకాశాలు భారీగా పెరిగాయి. 49 కిలోల విభాగంలో చాను రజతం సాధిస్తుందనే అంచనాలున్నాయి.
గత క్రీడల్లో రజతం సాధించిన పీవీ సింధుపై భారీ అంచనాలున్నాయి. అయితే, ఏడాదిగా ఆమె ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ఈసారి ఆమె స్వర్ణం సాధిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఇక పురుషుల సింగిల్స్‌లో సాయి ప్రణీత్, డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ జంట సంచలన విజయాలు అందుకొనే అవకాశాలు లేకపోలేదు.
అటు బాక్సింగ్‌లో తక్కువ మందే అర్హత సాధించినా.. పతకాలపై అంచనాలు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి. పురుషుల 52 కిలోల్లో అమిత్ పంగల్, మహిళల 52 కిలోల్లో మేరీ కోమ్, 69 కిలోల్లో లవ్లీనా బోర్గొహైన్‌లు ఫైనల్ చేరతారనే అంచనాలు ఉన్నాయి. పూజా రాణి , మనీష్ కౌశిక్ కాంస్యాలతో సంతృప్తిపడే అవకాశం ఉంది. వికాస్ క్రిషన్ సంచలనం సృష్టిస్తాడనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.
అటు ఆర్చరీలో మూడోసారి ఒలింపిక్ బరిలోకి దిగుతున్న టాప్ ర్యాంకర్ దీపికా కుమారి వ్యక్తిగత రజతం సాధిస్తుందని లెక్కిస్తున్నారు. మిక్స్‌డ్‌లో భార్యభర్తలు దీపిక-అతాను దాస్ అద్భుతం చేస్తారని భావిస్తున్నారు. అటు పురుషుల రికర్వ్ టీమ్ కాంస్యం వరకు వస్తుందని భావిస్తున్నానరు.
ఇక అథ్లెటిక్స్ లో భారత్ నుంచి 28 మంది పాల్గొంటున్నారు. వీరిలో జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మినహా ఎవరిపైనా పతక ఆశలు లేవు. విదేశాల్లో శిక్షణ పొందిన చోప్రా.. విశ్వ వేదికపై ఏమేరకు సత్తా చాటుతాడో చూడాలి.
ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్‌లో భారత్ నాలుగో స్థానంలో నిలిచి హాకీలో పతకంపై ఆశలు రేపింది. ఇటీవలి కాలంలో టీమిండియా ఆట కూడా ఎంతో మెరుగుపడడంతోపాటు యూరోపియన్ జట్లకు గట్టిపోటీ ఇస్తోంది. మహిళల హాకీ జట్టుపై అంచనాలు అంతగా లేకున్నా, అద్భుతాలు సాధించే అవకాశం ఉందనే నమ్మకం కూడా ఉంది.
అయితే, టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్లు పతకం తీసుకొస్తాయని రిటైర్డ్ హాకీ ఆటగాడు ధన్‌రాజ్ పిళ్లై అంటున్నాడు. అత్యంత ఫిట్‌నెస్‌తో ఉండటమే పురుషుల జట్టు బలమని పేర్కొన్నారు. ఐదేళ్లుగా రెండు జట్లూ రాణిస్తున్నాయని ప్రశంసించారు. పురుషుల జట్టు 2016, 2018 ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ లీగ్ ఫైనల్స్ 2015, 2017 ఫలితాల్లో ఆకట్టుకుందని, ఈ ఒలింపిక్స్‌లో తప్పక రాణిస్తుందని ధన్‌రాజ్ అంటున్నాడు.
ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు భారత పురుషుల, మహిళల జట్లు నవంబరు 2019లో అర్హత సాధించాయి. వరల్డ్ ర్యాంకింగ్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు నాలుగో స్థానంలో ఉంది. మహిళల జట్టు మూడో స్థానంలో ఉంది.
గ్రూప్ ఏలో భాగంగా భారత్ తొలిమ్యాచ్ లో న్యూజిలాండ్‌తో తలపడుతుంది. రెండో మ్యాచ్ ఆస్ట్రేలియాతో, మూడో మ్యాచ్ స్పెయిన్ , ఆ తర్వాత అర్జెంటీనా, చివరిగా జపాన్ లతో తలపడుతుంది.