లార్డ్స్ వేదికగా కీలక సమరానికి టీమిండియా, ఇంగ్లండ్ సిద్ధమయ్యాయి. తొలివన్డే విజయం ఇచ్చిన ఊపులో ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకునేందుకు ఇండియా తహతహలాడుతోంది. తొలివన్డేలో బుమ్రా, షమీ సహా బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేసింది. ఆపై కెప్టెన్ రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్, శిఖర్ ధావన్ బ్యాటింగ్‌తో పది వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును మట్టికరిపించింది. రెండో వన్డేలోనూ ఇదే దూకుడైన ఆటతీరు ప్రదర్శించాలని టీమిండియా భావిస్తోంది. గాయం కారణంగా తొలివన్డేకు దూరమైన విరాట్ కోహ్లీ.. ఈ రెండో వన్డేకు కూడా దూరం కానున్నాడు. కోహ్లీ గాయం నుంచి ఇంకా కోలుకోలేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయ్. దీంతో రెండో మ్యాచ్‌లో ఆడేది అనుమానంగానే ఉంది.
Read Also: COVID 19: కోవిడ్ కల్లోలం.. 20 వేలను దాటిన కేసుల సంఖ్య
మరోవైపు టీ20 సిరీస్ ఓటమి పాలై.. తొలి వన్డేలో ఘోర పరాజయం చవిచూసిన ఇంగ్లండ్ రెండో వన్డేలో గెలిచి.. సిరీస్ సమం చేయాలనే పట్టుదలతో ఉంది. ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా నియమితుడైన బట్లర్‌కు సారథ్యం వహించిన తొలి మ్యాచ్‌లోనే దారుణ పరాజయం ఎదురైంది. దీంతో రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సమం చేయాలనే పట్టుదలతో ఇంగ్లీష్ టీమ్ ఉంది. లార్డ్స్ రికార్డును పరిశీలిస్తే ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 7 వన్డేలు జరిగాయి. రెండు జట్లు సమఉజ్జీలుగా నిలిచాయి.. రెండు జట్లు చెరో మూడు మ్యాచ్‌లు గెలవగా.. ఒక మ్యాచ్ టై అయింది.