India vs Australia 2nd Test: భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ఇవాళ ప్రారంభం కానుంది. నాలుగు టెస్టుల బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో…భారత్ తొలి టెస్టుల విజయం సాధించింది. ఢిల్లీలోనూ విజయం సాధించి.. ఆధిక్యతను కంటిన్యూ చేయాలని రోహిత్ సేన వ్యూహాలు రచిస్తోంది. మొదటి టెస్టులోని జట్టును.. రెండో టెస్టులోనూ కంటిన్యూ చేయనుంది. బ్యాటర్లు, బౌలర్లు ఫామ్‌లో ఉండటంతో.. టీమిండియా రెట్టించిన ఉత్సాహంలో బరిలోకి దిగుతోంది. ఐదేళ్ల తర్వాత ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో టెస్టు మ్యాచ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మైదానంలో భారత్‌ను ఓడించడం.. పర్యాటక జట్టుకు అంత సులువైన విషయం కాదు. 1959లో చివరిసారి ఇక్కడ గెలిచిన ఆసీస్.. మళ్లీ విజయం సాధించలేకపోయింది. ఛతేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అశ్విన్, నాథన్ లయన్, స్టీవ్ స్మిత్‌లు అరుదైన రికార్డులను సొంతం చేసుకునే ఛాన్స్ లభించింది.
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
వందో టెస్టు ఆడుతున్న ఛతేశ్వర్ పుజారా…13వ భారతీయ క్రికెటర్‌గా రికార్డు సృష్టించనున్నాడు. మరో వంద పరుగులు చేస్తే.. ఆసీస్‌పై 2వేల పరుగులు చేసిన బ్యాటర్‌గానూ పుజారా రికార్డు సృష్టిస్తాడు. జడేజా ఒక వికెట్ తీస్తే టెస్టుల్లో 250 మార్క్‌ను తాకుతాడు. 2వేల 500 పరుగులు, 250 వికెట్లు తీసిన రెండో వేగవంతమైన ఇండియన్ ప్లేయర్‌గా ఘనత దక్కించుకోనున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు తీస్తే.. ఆస్ట్రేలియాపై వంద వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డు సృష్టించనున్నాడు. అయితే, దాదాపు 20 ఏళ్ల క్రితం 2004- 2005లో ఆస్ట్రేలియా జట్టు భారత గడ్డపై టెస్ట్ సిరీస్ గెలుచుకుంది. ఆ తర్వాత చాలా సిరీసులు జరిగినప్పటికీ మళ్లీ మన దేశంలో ఆ జట్టు టెస్ట్ సిరీస్ విజయం సాధించలేదు. గత 2 పర్యాయాల్లో ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీని టీమిండియానే చేజిక్కించుకుంది. అందుకే ఈసారి ఎలాగైనా సిరీస్ గెలవాలనే లక్ష్యంతో భారత్ లో అడుగుపెట్టింది ఆసీస్ జట్టు. టీమిండియా స్పిన్నర్ల ముందు ఆసీస్ బ్యాటర్లు తలవంచక తప్పలేదు. ఫలితం నాగ్ పూర్ వేదికగా జరిగిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో భారత్ ఘనవిజయం సాధించింది. ఇప్పుడిక పోరు ఢిల్లీకి మారింది. భారత్- ఆస్ట్రేలియా రెండో టెస్ట్ మ్యాచ్. మరి ఈ మ్యాచులోనూ గెలిచి భారత్ ఆధిక్యాన్ని పెంచుకుంటుందా.. లేదా ఇందులో విజయం సాధించి ఆసీస్ సిరీస్ ను సమం చేస్తుందా! చూడాలి. ఇవాళ మ్యాచ్ ఉదయం 9.30 గంటలకు ప్రారంభంకానుంది.
Read Also: Tax Survey on BBC: బీబీసీ ఐటీ రైడ్స్‌పై పాక్ జర్నలిస్ట్ ప్రశ్న.. అమెరికా ఇచ్చిన సమాధానం ఇదే..
భారత్ తుది జట్టు (అంచనా) రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ అవకాశం ఉండగా.. డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబూషేన్, స్టీవెన్ స్మిత్, మాట్ రెన్ షా, పీటర్ హ్యాండ్స్ కాంబ్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), టాడ్ మర్ఫీ, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్‌తో ఆస్ట్రేలియా బరిలోకి దిగనుంది.