India vs Bangladesh: టీ20 వరల్డ్‌కప్ సూపర్12లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఆడుతున్న కీలక మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. ఈ టోర్నీలో ఇంతవరకూ ఖాతా తెరువని ఓపెనర్ కేఎల్ రాహుల్(50) తొలిసారి బాగా రాణించాడు. అతనితో పాటు విరాట్ కోహ్లీ (64) కూడా తన బ్యాట్‌కి పని చెప్పడంతో.. భారత్ 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేయగలిగింది. మధ్యలో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (30) కూడా కాస్త మెరుపులు మెరిపించాడు. చివర్లో అశ్విన్ సైతం రెండు బౌండరీలు బాది, బంగ్లా బౌలర్లకి షాకిచ్చాడు. తొలుత బంగ్లా బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ వేశారు కానీ, ఆ తర్వాత భారీ పరుగులు సమర్పించుకున్నారు.
తొలుత బంగ్లాదేశ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో బ్యాటింగ్ చేసేందుకు భారత జట్టు బరిలోకి దిగింది. ఆదిలోనే టీమిండియాకు గట్టి దెబ్బ ఎదురైంది. కేవలం 2 పరుగులకే రోహిత్ శర్మ పెవిలియన్ చేరాడు. అయితే.. ఆ తర్వాత కోహ్లీ, రాహుల్ కలిసి ఆచితూచి ఆడారు. మరో వికెట్ వెంటనే పడకుండా, బంగ్లా బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. అవకాశం దొరికినప్పుడల్లా తన బ్యాట్‌కి పని చెప్పారు. వీళ్లిద్దరు కలిసి రెండో వికెట్‌కి 67 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. రాహుల్ పెవిలియన్ వెళ్లాక.. సూర్యకుమార్, కోహ్లీ కలిసి కాసేపు బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు. అయితే.. భారీ షాట్లు ఆడే క్రమంలోనే సూర్య తన వికెట్ కోల్పోయాడు. షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
ఆ తర్వాత వచ్చిన భారత బ్యాటర్లు పెద్దగా సత్తా చాటలేకపోయారు. పాండ్యా, కార్తీక్, అక్షర్‌లు సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు. ఓవైపు ఇలా వికెట్లు పడుతున్నా, మరోవైపు కోహ్లీ మాత్రం జంకకుండా పరుగుల వర్షం కురిపించాడు. చివరివరకూ క్రీజులో నిలబడి, బారత్‌కి గౌరవప్రదమైన స్కోరుని అందించాడు. చివర్లో అశ్విన్ కూడా రెండు బౌండరీలతో విజృంభించడంతో.. భారత్ స్కోరు 184/6 కి చేరింది. ఇక బంగ్లా బౌలర్ల విషయానికొస్తే.. హసన్ మహ్మూద్ 3 వికెట్లు, షకీబ్ అల్ హసన్ రెండు వికెట్లు తీశారు. తస్కిన్ అహ్మద్ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ వేశాడు. 4 ఓవర్లలో కేవలం 15 పరుగులే ఇచ్చాడు.