టీమిండియా సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను విమర్శిస్తాడనే ఆరోపణలు ఉన్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రో-కోల అనుభవం భారత జట్టుకు ఎంతో అవసరమని పేర్కొన్నాడు. వన్డే ఫార్మాట్లో ఇద్దరూ ఇలాగే స్థిరంగా రాణించాలని తాను కోరుకుంటున్నానని చెప్పాడు. రోహిత్-కోహ్లీలు ప్రపంచ స్థాయి బ్యాటర్లు అని, ఈ విషయాన్ని తాను చాలాసార్లు చెప్పానన్నాడు. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లో ఒకే రకమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉండాలనే అభిప్రాయంను తాను ఏకీభవించను అని గంభీర్ చెప్పుకొచ్చాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో రో-కోలు రాణించిన విషయం తెలిసిందే.
హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ… ‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ప్రపంచ స్థాయి బ్యాటర్లు. ఈ విషయాన్ని నెను చాలా సార్లు చెప్పా. రో-కోలు వన్డేలలో జట్టుకు ఎంతో అవసరం. సుదీర్ఘ కాలంగా ఇద్దరూ సత్తా చాటుతున్నారు. ఇదే స్థిరత్వాన్ని వన్డే ఫార్మాట్లో కొనసాగించాలని కోరుకుంటున్నా. ఇది డ్రెస్సింగ్ రూమ్‌కు ఎంతో మేలు చేస్తుంది’ అని అన్నాడు. రో-కోలు టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్ కావడానికి గౌతీనే కారణం అని సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గంభీర్ ఒత్తిడి కారణంగానే రో-కోలు వీడ్కోలు చెప్పారని వదంతులు ఉన్నాయి. ఇప్పుడు ఇద్దరు దిగ్గజాలపై గౌతీ ప్రశంసలు కురిపించడంతో అందరూ షాక్ అవుతున్నారు.