దక్షిణాఫ్రికా పర్యటనలో విఫలమైన టీమిండియా టెస్ట్ ఆటగాళ్లు పుజారా, రహానెలు జట్టులో స్థానానికే ఎసరు తెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల్లో డిమోషన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నారు. ఇప్పటివరకు గ్రేడ్-ఏలో ఉన్న పుజారా, రహానెలను గ్రేడ్-బి కాంట్రాక్ట్‌కు బీసీసీఐ డిమోషన్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న కాంట్రాక్ట్ 2021 అక్టోబర్ నుంచి 2022 సెప్టెంబర్ వరకు మాత్రమే కొనసాగనుంది. ఈ క్రమంలో 2022 అక్టోబర్ నుంచి 2023 సెప్టెంబర్ వరకు కాంట్రాక్టులను బీసీసీఐ సిద్ధం చేస్తోంది. త్వరలోనే సెంట్రల్ కాంట్రాక్టులను బీసీసీఐ అధికారికంగా ప్రకటించే అవకాశముంది.
Read Also: వెస్టిండీస్ సిరీస్‌కు రోహిత్ శర్మ వచ్చేస్తున్నాడు
ఇటీవల మూడు ఫార్మాట్లలో విశేషంగా రాణిస్తున్న కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌లకు బీసీసీఐ కాంట్రాక్టుల్లో ప్రమోషన్ దక్కే అవకాశాలున్నాయి. ప్రస్తుతం గ్రేడ్-ఏ కాంట్రాక్టులో ఉన్న వీరికి గ్రేడ్-ఏ ప్లస్ కేటగిరీలో చోటు దక్కనుంది. ఇప్పటివరకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, బుమ్రా మాత్రమే గ్రేడ్-ఏ ప్లస్ కేటగిరిలో ఉన్నారు. అటు పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు కూడా ప్రమోషన్ దక్కనుందని ప్రచారం జరుగుతోంది. దీంతో అతడు గ్రేడ్ సి నుంచి గ్రేడ్ బికి ప్రమోషన్ పొందనున్నాడు. అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, హనుమా విహారి, మహ్మద్ షమీలకు కూడా ప్రమోషన్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇటీవల పేలవంగా ఆడుతున్న ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మలకు డిమోషన్ తప్పేలా లేదు.