భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత జాతీయ జట్టు ప్లేయర్స్ అందరూ 2025 విజయ్ హజారే ట్రోఫీలో కనీసం రెండు మ్యాచ్‌లు ఆడాలని ఆదేశించింది. విజయ్ హజారే ట్రోఫీకి అందుబాటులో ఉండాలని టీమిండియా ప్లేయర్లకు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. దేశవాళీ క్రికెట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కోసమే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబరు 24 నుంచి విజయ్ హజారే ట్రోఫీ ఆరంభం కానుంది.
ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్ డిసెంబర్ 19న ముగుస్తుంది. జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ ఆడనుంది. అంటే భారత ఆటగాళ్లకు మూడు వారాల విరామం లబిస్తుంది. ఈ విరామంలో భారత ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఆదేశించింది. సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఇప్పటికే విజయ్ హజారే ట్రోఫీకి అందుబాటులో ఉంటామని సమాచారం ఇచ్చారు. ఓ ప్లేయర్ ఫిట్‌గా లేడని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రకటిస్తే.. సదరు ఆటగాడికి మినహాయింపు ఉంటుంది.
Also Read: Lionel Messi: భారత్‌కు మళ్లీ రావడం పక్కా.. మెస్సీ భావోద్వేగం!
డిసెంబర్ 24 నుంచి న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ మొదలయ్యేనాటికి విజయ్ హజారే ట్రోఫీలో ఒక్కో జట్టు ఆరు మ్యాచ్‌లు ఆడేలా బీసీసీఐ షెడ్యూల్ చేసింది. ఏ రెండు మ్యాచ్‌లు ఆడాలనుకునేది ఆటగాళ్లు, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాల క్రికెట్ సంఘాలు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. విజయ్ హజారే ట్రోఫీలో కచ్చితంగా ఆడాలని ఆటగాళ్లకు చెప్పామని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరి ఓ జాతీయ మీడియాతో చెప్పారు.