త్వరలో టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. గత ఏడాది అర్ధంతరంగా ముగిసిన ఐదు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు ఐదో టెస్టు ఆడనున్నాయి. అయితే గతంలో ఫామ్ కోల్పోయిన పుజారా ఏకంగా జట్టులో స్థానం కోల్పోయాడు. అతడు తాజాగా ఇంగ్లండ్ పర్యటనలో దేశవాళీ మ్యాచ్‌లు ఆడుతూ ఫామ్ అందుకున్నాడు. వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్‌లో పుజారా స్థానంలో విహారి మంచి ప్రదర్శన చేశాడు. దీంతో తుది జట్టులో స్థానం కోసం పుజారా, హనుమా విహారి మధ్య గట్టి పోటీ నెలకొంది.
ఈ నేపథ్యంలో హనుమా విహారిపై మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హనుమా విహారి ఓ అసాధారణ ఆటగాడు అని… టీమిండియా తరుపున సుదీర్ఘ కాలం ఆడగల సత్తా ఉన్న ఆటగాడు అని అజారుద్దీన్ అభిప్రాయపడ్డాడు. అయితే జట్టులో స్థిరమైన చోటు దక్కించుకోవాలంటే అతడు 30, 40 పరుగులు చేస్తే సరిపోదని.. భారీ ఇన్నింగ్స్‌లు ఆడాల్సి ఉంటుందని హితవు పలికాడు. ఈ విషయం హనుమ విహారి ఇప్పటికే గ్రహించి ఉంటాడని భావిస్తున్నట్లు అజారుద్దీన్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆజింక్యా రహానె గాయపడడంతో ఇంగ్లండ్‌తో జరిగే ఐదో టెస్టుకు ఎంపిక చేసిన జట్టులో హనుమ విహారికి చోటు దక్కింది. జూలై 1 నుంచి భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్ట్ జరగనుంది.
మరోవైపు ఐదు టీ20ల సిరీస్ కోసం దక్షిణాఫ్రికా భారత్ చేరుకుంది. ఈనెల 9న ఢిల్లీలో ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. త్వరలో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ ఉండటంతో టీమిండియా ఈ సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా వంటి కీలక ఆటగాళ్ల గైర్హాజరీలో భారత్ ఎలా ఆడుతుందనే విషయం ఆసక్తికరంగా మారింది.