Asia Cup 2025: ఆసియా కప్ 2025 నిర్వహణ పైనా అనిశ్చితి నెలకొంది. ఈ నెల (జూలై) చివరి వారంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉంది. ఈ మీటింగ్ కు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వేదికగా మారింది. అయితే, ఇప్పుడు ఇదే ప్రధాన సమస్యగా అయింది. ఇక్కడ జరగబోయే ఏసీసీ మీటింగ్‌కు తాము హాజరుకావడం లేదని ఇప్పటికే భారత్, శ్రీలంక దేశాలకు చెందిన క్రికెట్ బోర్డులు సమాచారం ఇచ్చాయని క్రికెట్ వర్గాలు తెలిపాయి. బంగ్లాలో రాజకీయ అనిశ్చితి కారణంగా ప్లేయర్స్ భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక, షెడ్యూల్ ప్రకారం ఏసీసీ మీటింగ్ కొనసాగుతుందని పాక్ క్రికెట్ బోర్డు సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇంకా రెండు వారాల గడువు ఉంది.. అన్ని సభ్య దేశాలు ఏర్పాట్లు టోర్నీ కోసం చేసుకుంటున్నాయి. ఎవరైనా ఢాకాకు రాకూడదని అనుకుంటే.. వారు వర్చువల్ గా పాల్గొనే ఛాన్స్ ఉందన్నారు. ఢాకాలో ఈ మీటింగ్ మాత్రం తప్పకుండా జరుగుతుందని వెల్లడించారు.
Read Also: Himachal Floods: హిమాచల్‌ను ముంచెత్తిన వరదలు.. 150 కి.మీ దూరంలో మృతదేహాలు లభ్యం
అయితే, జూలై 20 – 24 మధ్య బంగ్లాదేశ్ – పాక్ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ జరగబోతుంది. కాబట్టి, ఏసీసీ మీటింగ్ కూడా ఇక్కడ నిర్వహించడానికి రెడీ అయ్యారు. కాగా, ఇప్పటి వరకు ఒక్క సమావేశం కూడా ఢాకాలో జరగలేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతినిధి ఒకరు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ లో ఆసియా కప్ జరగాల్సి ఉంది.. ఈ టోర్నమెంట్ నిర్వహించే హక్కులు భారత్‌దే. కానీ, టోర్నీని మరో చోటుకు మార్చాలని ఏసీసీని బీసీసీఐ అడిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే, భారత్‌లోకి పాక్ జట్టుకు పర్మిషన్ ఇవ్వడం కష్టం.. అందుచేత, పాక్ ఆడే మ్యాచులను శ్రీలంక, లేదా బంగ్లాలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు టాక్. మరోవైపు అసలు ఆసియా కప్ టోర్నీని నిర్వహించేందుకు సిద్ధమేనా? అని బీసీసీఐని ఏసీసీ అడిగినట్లూ పలు కథనాలు వస్తున్నాయి. టోర్నమెంట్ నుంచి తాము వైదొలగడం లేదని ఇప్పటికే బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. కానీ, పోటీలను భారత్‌లో కాకుండా యూఏఈ వేదికగా నిర్వహించడానికి బీసీసీఐ ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం.