Yuvraj Singh: సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే రోజు టీమిండియా స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ సంచలనం సృష్టించాడు. 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై ఆకాశమే హద్దుగా యువరాజ్ చెలరేగిపోయాడు. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు. పురుషులు టీ20 మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించిన తొలి ఆటగాడిగా యువీ రికార్డులకెక్కాడు. అతడి వీర బాదుడుకు బ్రాడ్ బిక్కమొహం వేశాడు. అంతకుముందు ఓవర్‌లో ఫ్లింటాఫ్‌తో గొడవ కారణంగా కోపంలో ఉన్న యువరాజ్ ఇంగ్లీష్ జట్టుకు చుక్కలు చూపించాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టడమే కాకుండా 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేశాడు.
Read Also:Minister KTR: ఇండిగో తీరుపై కేటీఆర్ ట్వీట్.. పద్ధతి మార్చుకోమని సూచన
ఈ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ సందర్భంగా 19వ ఓవర్‌ను ఇంగ్లండ్ బౌలర్ బ్రాడ్ వేశాడు. తొలి సిక్స్ కౌ కార్నర్ మీదుగా, రెండో సిక్స్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా, మూడో బంతిని ఎక్స్‌ట్రా కవర్ మీదుగా, నాలుగో సిక్స్ బ్యాక్‌వర్డ్ పాయింట్ మీదుగా, ఐదోది మిడ్‌వికెట్ మీదుగా, ఆరోది మిడ్ ఆన్ మీదుగా బాదాడు. యువరాజ్ ఆరు బంతులకు ఆరు సిక్సర్లు బాదడంతో అప్పటివరకు 171గా ఉన్న టీమిండియా స్కోరు ఒక్కసారిగా 207కి చేరింది. ఓవరాల్‌గా 20 ఓవర్లకు 4 వికెట్లు నష్టపోయి 218 పరుగులు చేసింది. కాగా ఈ ఘట్టానికి నేటితో 15 ఏళ్లు నిండిన సందర్భంగా యువరాజ్ ఈ మూమెంట్‌ను తన కుమారుడు ఓరియన్‌తో కలిసి జరుపుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ మళ్లీ చూసేందుకు తనకు ఇంతకంటే మంచి పార్ట్‌నర్ దొరకడని యువరాజ్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Couldn’t have found a better partner to watch this together with after 15 years 👶 🏏 #15YearsOfSixSixes #ThisDayThatYear #Throwback #MotivationalMonday #GetUpAndDoItAgain #SixSixes #OnThisDay pic.twitter.com/jlU3RR0TmQ
— Yuvraj Singh (@YUVSTRONG12) September 19, 2022