Minister KTR Suggests To Indigo Staff To Respect Local Languages: ట్విటర్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మంత్రి కేటీఆర్.. సమస్యలపై స్పందిస్తూ, అప్పటికప్పుడే ఆయా పరిష్కార మార్గాల్ని సూచిస్తుంటారు. ఇప్పుడు తాజాగా ఆయన ఇండిగో తీరుపై స్పందించారు. తెలుగు తప్ప ఇంగ్లీష్, హిందీ భాషలు రావని ఓ మహిళ పట్ల వివక్ష చూపిన ఇండిగో సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంతీయ భాషల్ని కూడా గౌరవించాలన్న ఆయన.. ప్రాంతీయ మార్గాల్లో ప్రయాణించే విమానాల్లో తెలుగు, కన్నడ, తమిళం వంటి ప్రాంతీయ భాషలు మాట్లాడగలిగే సిబ్బందిని రిక్రూట్ చేసుకోవాల్సిందిగా సూచించారు. అసలేం జరిగిందంటే..
సెప్టెంబర్ 16వ తేదీన ఇండిగో 6E 7297 అనే విమానంలో ఓ తెలుగు మహిళ విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. మొదట్లో ఈమె తాను బుక్ చేసుకున్న 2A(XL seat, Exit row) సీట్‌లో కూర్చున్నారు. అయితే.. ఆ మహిళకు ఇంగ్లీష్, హిందీ భాషలు రావని తెలుసుకొని.. ఆమెను 3c సీట్లోకి మార్చారు. ఎందుకని ప్రశ్నిస్తే.. భద్రతాపరమైన ఆందోళనగా ఫ్లైట్ అటెండెంట్ పేర్కొన్నారు. పాపం.. ఆమెకు పరిస్థితి పూర్తిగా అర్థం కాక, సిబ్బంది చెప్పినట్టు తన సీట్లో నుంచి లేచి, 3c సీట్లో కూర్చుంది. ఈ మొత్తం ఉదంతం గురించి ట్విటర్‌లో పేర్కొంటూ.. దేవస్మిత అనే ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ట్వీట్ చేశారు. కేవలం హిందీ, ఇంగ్లీష్ భాషలు రావని ఓ తెలుగు మహిళ వివక్ష ప్రదర్శించారని ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఆ పోస్ట్‌ని మంత్రి కేటీఆర్ షేర్ చేస్తూ.. ఇండిగో యాజమాన్యాన్ని ట్యాగ్ చేస్తూ ఆ సంస్థకి చురకలంటించారు. ‘‘డియర్ ఇండిగో యాజమాన్యం.. ప్రాంతీయ భాషల్ని, అలాగే హిందీ/ఇంగ్లీష్ మాట్లాడలేని ప్రాంతీయ ప్రయాణికుల్ని గౌరవించడం ప్రారంభించాలని నేను కోరుకుంటున్నాను. ప్రాంతీయ మార్గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు.. తెలుగు, తమిళం, కన్నడ వంటి ప్రాంతీయ భాషలు మాట్లాడగలిగే సిబ్బందిని రిక్రూట్ చేస్తే బాగుంటుంది. అప్పుడది విన్-విన్ సొల్యూషన్ అవుతుంది’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.