Steve Jobs @ Apple: ఈ భూమ్మీద మనుషులు శాశ్వతం కాదు.. వాళ్లు సంపాదించిన పేరే చరిత్రలో కలకాలం నిలిచిపోతుంది. ప్రపంచ ప్రజలు శాశ్వతంగా గుర్తుంచుకునే అలాంటి వ్యక్తుల్లో స్టీవ్ జాబ్స్ ఒకరు. వరల్డ్ వైడ్‌గా యాపిల్ పండు ఎంత పాపులరో యాపిల్ కంపెనీ ప్రొడక్టులు కూడా ఇప్పటికీ అంతే ప్రజాదరణ పొందుతున్న సంగతి తెలిసిందే. ఆ సంస్థకు కోఫౌండర్‌గా.. సీఈఓగా.. చైర్మన్‌గా ఈ విజయంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు.
ఈ నేపథ్యంలో.. ‘‘టెక్నాలజీ దేవుడి’’గా అభిమానులు అభివర్ణించే ‘‘డిజిటల్ విప్లవ పితామహుడు’’ స్టీవ్ పాల్ జాబ్స్‌ను ఈ వారం మన డిఫైనింగ్ పర్సనాలిటీగా చెప్పుకుందాం. యాపిల్ పేరును స్టీవ్ జాబ్స్ జీవితం నుంచి వేరు చేసి చూడలేం. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో 1955లో పుట్టిన స్టీవ్ జాబ్స్.. 17వ ఏట.. అంటే.. 1972లో రీడ్ కాలేజ్‌లో స్టడీని మధ్యలోనే ఆపేశారు. తర్వాత.. నాలుగేళ్లపాటు రకరకాల ఉద్యోగాలు చేసి.. 1974లో.. తన మిత్రుడు స్టీవ్ వోజ్నియాక్‌తో కలిసి యాపిల్ కంపెనీని స్థాపించారు.
read more: Indian Stocks: రికార్డు స్థాయిలో ఇండియన్ స్టాక్స్ అమ్మేసిన ఫారన్ ఇన్వెస్టర్లు
స్టీవ్ జాబ్స్.. రోజూ.. భోజనంలో భాగంగా యాపిల్ పండు తినేవారు. తన స్నేహితుడికి యాపిల్ తోట ఉండటంతో అక్కడ చాలా సమయం గడిపేవారు. ఆ స్ఫూర్తితోనే తన సంస్థకు యాపిల్ పేరు పెట్టినట్లు చెబుతారు. 1976 నుంచి 1985 వరకు.. 9 ఏళ్లపాటు యాపిల్ సంస్థకు దాదాపు అన్నీ తానై వ్యవహరించిన స్టీవ్ జాబ్స్.. ఆ కంపెనీలో అధికారాలకు సంబంధించి తలెత్తిన అంతర్గత సమస్యల నేపథ్యంలో యాపిల్‌కి గుడ్‌బై చెప్పారు. నెక్‌స్ట్ పేరుతో కొత్తగా ఓ కంప్యూటర్ సంస్థను స్థాపించారు.
ఆ తర్వాత సంవత్సరం ‘‘గ్రాఫిక్స్’’ అనే గ్రూపును అక్వైర్ చేసుకొని దాని పేరును ‘‘పిక్సర్ యానిమేషన్ స్టూడియోస్’’గా మార్చారు. పదేళ్ల అనంతరం.. 1996లో.. నెక్‌స్ట్ కంపెనీని 400 మిలియన్ డాలర్లకు యాపిల్ కొనుగోలు చేయటంతో స్టీవ్ జాబ్స్ మళ్లీ మాతృ సంస్థలోకి సలహాదారుడిగా రీఎంట్రీ ఇచ్చారు. సంవత్సరం తిరిగే సరికి యాపిల్ సీఈఓగా తిరిగి బాధ్యతలు చేపట్టారు. బాస్ ఈజ్ బ్యాక్ అని చాటారు. నాలుగేళ్ల తర్వాత.. 2001లో.. ఐపాడ్‌ను ప్రవేశపెట్టి ఎంపీ3 ప్లేయర్స్ సెగ్మెంట్‌లో ఏకంగా కొత్త విప్లవమే తెచ్చారు.
స్టోరేజ్ స్పేస్ మరియు పర్సనలైజ్డ్ లిస్టులతో వినియోగదారులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఐదేళ్ల అనంతరం.. 2006లో పిక్సర్ యానిమేషన్ స్టూడియోస్‌ను డిస్నీ సంస్థ కొనుగోలు చేసింది. దీంతో 138 మిలియన్‌ల షేర్లతో స్టీవ్ జాబ్స్.. డిస్నీలో.. అతిపెద్ద షేర్ హోల్డర్‌గా ఎదిగారు. మరో ఏడాది కాలానికి.. అంటే.. 2007లో ఫస్ట్ ఐఫోన్‌ను లాంఛ్ చేశారు. యాపిల్ టీవీని మరియు ఐపాడ్ టచ్‌ను కూడా మార్కెట్‌లోకి తెచ్చారు.
మూడేళ్ల అనంతరం.. 2010లో.. ‘‘ఐఫోన్-4ఎస్’’కి స్టీవ్ జాబ్స్ పేరు పెట్టడం చెప్పుకోదగ్గ విషయం. ఐఫోన్-4ఎస్ అంటే.. ఐఫోన్-4 స్టీవ్ అని అర్థం. 1996లో యాపిల్ సంస్థలోకి తిరిగి ప్రవేశించిన స్టీవ్ జాబ్స్.. 15 ఏళ్లపాటు కంపెనీ గ్రోత్‌కి అహర్నిశలు శ్రమించి అనుకున్నది సాధించారు. 2011 ఆగస్టులో రాజీనామా చేసిన రెండు నెలలకే అనారోగ్యంతో అకాల మరణం పొందారు.
తిండిలేని రోజుల్లో ఒక యాపిల్ పండు మాత్రమే తిని బతికిన స్టీవ్ జాబ్స్.. తుది శ్వాస విడిచే నాటికి 10 బిలియన్ డాలర్లకు పైగా నికర సంపదను కలిగి ఉన్నారు. ఇందులో ఎక్కువ భాగం తన మొదటి సంస్థ యాపిల్ నుంచి కాకుండా డిస్నీ నుంచి రావటం ఆశ్చర్యకరం. కన్నుమూసే నాటికి కొండంత డబ్బు సంపాదించిన స్టీవ్ జాబ్స్.. యాపిల్ కంపెనీ ఉత్పత్తుల రూపంలో.. వినియోగదారుల గుండెల్లో.. ఎప్పటికీ కరిగిపోని ఎవరెస్ట్ అంత ఎత్తైన విలువైన అభిమానాన్ని సొంతం చేసుకున్నారు.