Indian Stocks: 2022లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు పెద్ద సంఖ్యలో ఇండియాకి గుడ్‌బై చెప్పేశారు. రూ.1.2 లక్షల కోట్ల విలువైన స్టాక్స్‌ను అమ్మేశారు. 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం సమయంలో కూడా ఇంత మంది ఫారన్ ఇన్వెస్టర్లు మన మార్కెట్‌ను వీడలేదంటే ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో అర్థంచేసుకోవచ్చు. పరాయి దేశాల పెట్టుబడిదారులు 2008లో దాదాపు 12 బిలియన్ డాలర్ల విలువైన స్టాక్స్‌ను వదిలించుకోగా ఈసారి పదహారున్నర బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసేసుకున్నారు.
ప్రతి రోజూ సగటున సుమారు 68 మిలియన్ డాలర్ల ఔట్‌ఫ్లో నెలకొనటం గమనించాల్సిన విషయం. ఈ విషయాలను నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ వెల్లడించింది. ఇతర దేశాల ఇన్వెస్టర్లు ఇండియన్ మార్కెట్‌కి టాటా చెప్పినప్పటికీ లోకల్ పెట్టుబడిదారులు మాత్రం మంచి సపోర్ట్ చేశారు. 32 పాయింట్ 9 బిలియన్ డాలర్లు మదుపు చేశారు. కరోనా మహమ్మారి టైమ్‌లో భారతదేశ ఈక్విటీలు అధిక రాబడిని ఇస్తుండటంతో ఇన్వెస్టర్లు ఇటువైపు భారీగా మొగ్గుచూపారు.
read more: Gold and Silver Markets: గోల్డ్, సిల్వర్.. 2022 కంటే బెటర్..
ఫలితంగా వివిధ దేశాల నుంచి పెట్టుబడుల ప్రవాహం కొనసాగింది. దీంతో కళ్లు తెరిచిన గ్లోబల్ సెంట్రల్ బ్యాంకులు తమ ద్రవ్య విధానాలను సడలించాయి. ఫలితంగా ఎఫ్‌ఐఐలు స్వదేశాల వైపు తిరుగుముఖం పట్టారు. గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనివిధంగా అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ 2022లో వడ్డీ రేట్లను చాలా అగ్రెసివ్‌గా పెంచిన సంగతి తెలిసిందే. దీనివల్ల కూడా ఫండ్స్ రివర్సయి స్వదేశీ స్టాక్ మార్కెట్‌కి చేరాయి.
ఫారన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు తమ డబ్బును బాండ్ల రూపంలో పెట్టుబడి పెట్టారు. నవంబర్ నాటికి విదేశీ పెట్టుబడిదారులు ఎక్కువగా ఫైనాన్షియల్ అండ్ ఐటీ సెక్టార్ల నుంచే ఇన్వెస్ట్‌మెంట్లను ఉపసంహరించుకున్నారు. ఆయా రంగాల్లో పెట్టుబడులు కూడా అధికంగా వాళ్ల యాజమాన్యంలోనే ఉండేవి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఇప్పటివరకు ఆర్థిక రంగంలో 8.42 బిలియన్ డాలర్ల స్టాక్స్‌ను అమ్మేయగా ఐటీ రంగంలో 8.83 బిలియన్ డాలర్ల ఈక్విటీలను విక్రయించినట్లు ఎన్‌ఎస్‌డీఎల్ డేటా చెబుతోంది.
అయితే.. ఫారన్ ఇన్వెస్టర్లు 2023వ సంవత్సరం ప్రారంభంలో తిరిగి ఇండియన్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం మొదలుపెడతారని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది రెండో అర్ధ భాగంలో ఈ ఇన్వెస్ట్‌మెంట్లు మరింత స్థిరంగా కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చైనా ఎకానమీ తిరిగి ప్రారంభం కానుండటం మరియు ప్రపంచ స్థూల ఆర్థిక వాతావరణం మెరుగుపడనుండటం దీనికి కారణాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో ఓవరాల్‌గా చూసినప్పుడు ప్రపంచంలోని ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోల్చితే మన దేశ స్టాక్స్ ఉత్తమ పనితీరు కనబరుస్తాయని సింగపూర్‌కి చెందిన అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ TIW Capital సీఈఓ మోహిత్ రల్‌హన్ చెప్పారు. ఇండియాలోని స్థానిక పెట్టుబడిదారుల సహకారం ఎప్పట్లాగే కొనసాగుతుందని పరిశీలకులు ధీమాగా చెప్పారు. ఇదిలాఉండగా.. మన దేశ ఆర్థిక వ్యవస్థ.. ఇప్పటివరకు.. ఇటీవలి గ్లోబల్ ఎకనమిక్ షాకులను సమర్థంగా తట్టుకొని నిలబడింది.
కానీ.. ఉక్రెయిన్-రష్యా యుద్ధం వల్ల తలెత్తే ఆర్థిక మాంద్యం ప్రమాదాలు మన దేశ ద్రవ్య విధానాల పైన కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని ముంబైకి చెందిన రీసెర్చ్ సంస్థ ఎంకే గ్లోబల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ అనలిస్టులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ కారణంగా 2023లో ఇండియన్ స్టాక్ మార్కెట్ పనితీరు కొద్దోగొప్పో దెబ్బతింటుందని ఆందోళన వెలిబుచ్చారు.