పదేళ్ల వయసు పిల్లలు సహజంగా ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు?. మైదానానికి పరుగెడతారు. ఆటపాటలతో గడిపేస్తుంటారు. లేకపోతే సెల్‌ఫోన్‌లో ఆన్‌లైన్ గేమ్స్ చూస్తూ ఎంజాయ్, టైంపాస్ చేస్తారు. విశాఖపట్నానికి చెందిన దేబోప్రియ సాహ అనే అమ్మాయి కూడా స్పోర్ట్స్ పైనే ఫోకస్ పెట్టింది. కాకపోతే కొంచెం వెరైటీగా ఆలోచించి స్కూబా డైవింగ్‌ను సెలెక్ట్ చేసుకుంది. స్విమ్మింగ్‌లో పర్‌ఫెక్ట్ అయ్యాక ఈ జలక్రీడను ఎంచుకొని అందులో తనదైన ముద్ర వేసింది. ఏకంగా వరల్డ్ రికార్డునే నెలకొల్పింది.
ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసు సర్టిఫైడ్ స్కూబా డైవర్‌గా నిలిచింది. అది కూడా తన పుట్టిన రోజు నాడే సాధించటం విశేషం. మూడు రోజుల కిందట (జూన్ 30వ తేదీన) ఈ ఘనతను సొంతం చేసుకుంది. బర్త్ డే రోజు సెలబ్రేషన్స్‌కి బదులుగా బంగాళాఖాతంలో విన్యాసాలు చేసి వినూత్న చరిత్ర సృష్టించింది. స్కూబా డైవింగ్‌లో సర్టిఫికేషన్‌తోనే ఆగిపోనని, అడ్వాన్స్‌డ్ కోర్సులు చేస్తానని తెలిపింది. దేబోప్రియ సాహ మొన్న గురువారం విశాఖ తీరంలో 35 అడుగుల డైవ్‌లను రెండింటిని పూర్తిచేసింది. అందులో ఒక సోలో డైవ్ కూడా ఉండటం గమనార్హం.
స్కూబా డైవింగ్‌లో భాగంగా నీటిలో 35 అడుగుల లోతు వరకు వెళ్లింది. రుషికొండ బీచ్‌లో ఈ ఫీట్ ప్రదర్శించింది. దీన్ని ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆఫ్ డైవింగ్ ఇన్‌స్ట్రక్టర్స్ (పీఏడీఐ-పాడి) అనే సంఘం అధికారికంగా ధ్రువీకరించింది. పాడి అనేది ఒక అంతర్జాతీయ గుర్తింపు కలిగిన డైవింగ్ సంస్థ. సర్టిఫైడ్ స్కూబా డైవర్ కావాలంటే కనీస వయసు పదేళ్లు ఉండాలి. అందుకే దేబోప్రియ ఆ వయసు వచ్చిన మరుసటి రోజే ఈ హోదాను దక్కించుకుంది. వాటర్ స్పోర్ట్స్‌లో కూతురి ఆసక్తిని చూసి ఆ దిశగా ప్రోత్సహించినట్లు ఆమె తండ్రి దీపాంకర్ సాహ చెప్పారు.
ఈయన కూడా ఒక స్కిల్డ్ డైవరే. నేవీలో 15 ఏళ్లు పనిచేసి రిటైర్ అయ్యారు. తన బిడ్డకు బాలరాం నాయుడు అనే కోచ్ దగ్గర శిక్షణ ఇప్పించారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ‘లైవ్ ఇన్ అడ్వెంచర్స్’ డైరెక్టర్. ‘చాలా మంది పిల్లలు ఏదో ఒకటీ అరా డైవింగ్ ఎక్స్‌పీరియెన్స్ కోసం నా వద్దకు వస్తుంటారు. కానీ దేబోప్రియ అలా కాదు. ప్రొఫెషనల్ డైవింగ్ పట్ల ఆమెలో సీరియస్‌నెస్ కనిపించింది. అందుకే శిష్యురాలిగా స్వీకరించి మెలకువలు నేర్పాను. అంతకన్నా ముందే స్విమ్మింగ్‌లో నైపుణ్యం ఉండటం దేబోప్రియకి ఇంకా ప్లస్ పాయింట్ అయింది’ అని బలరాం నాయుడు అన్నారు.
ఈ అఛీవ్‌మెంట్‌పై దేబోప్రియ సాహ స్పందిస్తూ ‘నేను ఈ రికార్డ్ నెలకొల్పటాన్ని మా అమ్మ ఇప్పటికీ నమ్మలేకపోతోంది’ అని వెల్లడించింది. నీళ్లు చూసి ఎవరూ భయపడొద్దని, జాగ్రత్తలు పాటిస్తూ, అవసరమైన అన్ని పరికరాలూ పెట్టుకొని దిగితే డైవింగ్ పెద్ద కష్టమేమీ కాదని, సేఫ్‌గా ఒడ్డుకు చేరొచ్చని సూచిస్తోంది. సాహో డేబోప్రియ సాహ.