విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం లైలా. ఈ సినిమాలో విశ్వక్సేన్ లేడీ గెటప్ వేసుకోవడం, అందరికీ దాన్నే ప్రధానంగా హైలైట్ చేయడంతో సినిమా మీద ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది.. రామ్ నారాయణ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కామాక్షి భాస్కరాల కీలక పాత్రలో నటించింది. ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం.
లైలా కథ:
హైదారాబాద్ పాతబస్తీలో సోను మోడల్(విశ్వక్ సేన్) ఓ మేకప్ ఆర్టిస్ట్. సీత బ్యూటీ పార్లర్ అంటే ఓల్డ్ సిటీ మొత్తం మీద సూపర్ ఫేమస్. అలాంటి సోను ఒకరోజు తన దగ్గరకు వచ్చే ఓ కష్టమర్ బాధపడడం చూసి ఆమెకు ఆర్థిక సాయం చేయడమే కాదు ఆమె బిజినెస్ కి తన ఫోటో వాడుకోమని కూడా సలహా ఇస్తాడు. మరో పక్క ఆ ప్రాంతంలో మేకల బిజినెస్ చేసిన రుస్తుమ్(అభిమన్యు సింగ్) పెళ్లి కాక సరైన పిల్ల కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. అదే సమయంలో సోనూ మోడల్ మేకప్ చేసిన ఓ అమ్మాయి(కామాక్షి)ని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడి భయపెట్టి, బెదిరించి పెళ్లి చేసుకుంటాడు. అయితే శోభనం జరిగిన తెల్లారే రుస్తుంకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. దానికి తోడు రుస్తుం పెళ్ళిలో వాడిన వంట నూనె వలన ఫుడ్ పాయిజన్ అయి ఎమ్మెల్యే సహా చాలా మంది ఆసుపత్రి పాలవుతారు. సోను పేరుతో ప్రమోట్ చేస్తున్న వంట నూనె కావడంతో సోనూ కోసం పోలీసులు గాలింపు మొదలు పెడతారు. దీంతో సోనూ మోడల్ లేడీ గెటప్ లోకి మారి లైలా అవతారం ఎత్తుతాడు. రస్తుంకి తెలిసిన షాకింగ్ విషయం ఏమిటి? అసలు లైలా అవతారం ఎత్తిన సోను మోడల్ ఏం చేశాడు? తనకు సంబంధం లేకుండా ఇరుక్కున్న కల్తీ నూనె కేసు నుంచి సోను బయట పడ్డాడా? లాంటి విషయాలు తెలియాలి అంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ :
విశ్వక్సేన్ లేడీ గెటప్ లోకి సినిమా చేస్తున్నాడు అని అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి అసలు ఈ సినిమా ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు. అయితే ఆ ఎదురు చూపులు చూసే అభిమానులు సినిమా ఏ మాత్రం ఆకట్టుకునేలా అనిపించలేదు. ఒక పురుషుడు లేడీ గెటప్ వేశాడు అంటే దాని వెనుక ఎంతో సంఘర్షణ ఉంటుంది. కానీ ఈ సినిమాలో దాన్ని చాలా ఈజీగా ప్రేక్షకులు కనీసం కన్విన్స్ అవుతారా లేదా అనే విషయాన్ని కూడా ఆలోచించకుండా బండి లాగించేశారు. సినిమా మొదలైనప్పటి నుంచి సినిమా మీద ప్రేక్షకులలో ఏమాత్రం ఆసక్తి కలగకుండా కథ నడిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. నిజానికి ఇదే దర్శకుడు గతంలో చేసిన బట్టల రామస్వామి బయోపిక్ చూసిన తర్వాత ఈ దర్శకుడు దగ్గర విషయం ఉంది అని భావించి ఈ సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి అయితే ఆ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయాడు ఏమో అనిపించింది. సాధారణంగా మనం జోక్స్ లో వింటూ ఉంటాం, కొన్ని రోజులపాటు బ్యూటీ పార్లర్లు మూసేస్తే ఆడవాళ్ళ అసలు స్వరూపాలు బయటకు వస్తాయని. అలాగే ఈ మధ్యకాలంలో మీమ్స్ లో బాగా కొన్ని మేకప్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. నల్లగా అంద విహీనంగా ఉన్న అమ్మాయిలను కూడా మేకప్ మహిమతో అద్భుతంగా హీరోయిన్ లుక్ లోకి తీసుకు వస్తున్న వీడియోలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా కథ రాసుకున్నారు ఏమో అనిపిస్తుంది. పోనీ అలా రాసుకుని ఉన్నా ఎక్కడ సీరియస్ నెస్ లేకుండా ఎలాంటి ఎమోషన్స్ లేకుండా కథ నడిపించారు. కామెడీ కూడా ఇరికించినట్లు అడల్ట్ కామెడీతో బండి నడిపించాలని అనుకున్నారు కానీ అది చాలా చోట్ల క్రింజ్ అనిపించడమే కాదు కొన్ని చోట్ల ఇదేంట్రా నాయనా అనిపించే ఫీలింగ్ కూడా కలుగుతుంది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఏమాత్రం ఆకట్టుకోకుండా సినిమా ఉండడం సినిమాకి పూర్తిస్థాయిలో మైనస్ అయ్యే అంశం. ఫస్ట్ హాఫ్ లో హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్, అతను లేడీ గెటప్ వేసుకోవడానికి తీసుకునే లీడ్స్ కనిపించాయి. హీరో లేడీ గెటప్ వేసుకున్నాక పూర్తిస్థాయి అడల్ట్ కామెడీ సినిమా లాగా అనిపిస్తుంది. ఫ్యామిలీస్ తో కలిసి చూడదగ్గ సినిమా అయితే కాదు. నిజానికి ఎమోషన్స్ తో కూడుకున్న కథ ఉన్నా ఎందుకో ఎమోషన్స్ క్యారీ చేసే విషయంలో మాత్రం కేర్ తీసుకున్నట్టు అనిపించలేదు. ఒకానొక దశలో ఈ సినిమా సునీషిత్ అనే ఒక సోషల్ మీడియా స్టార్ ఎంట్రీ కోసం సిద్ధం చేసిన సినిమానా అనే అనుమానాలు కూడా కలిగితే అది మీ తప్పు కాదు.
నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో విశ్వక్సేన రెండు భిన్నమైన పార్శ్యాలు ఉన్న పాత్రలలో కనిపించాడు. ఒకటి తనకి ఎప్పుడూ కలిసి వచ్చే సోను మోడల్ అనే ఒక పాతబస్తీ కుర్రాడిగా అదరగొట్టాడు. అందులో కొత్తదనం లేకపోయినా లుక్స్ విషయంలో అలాగే కాస్ట్యూమ్స్ విషయంలో ఆకట్టుకున్నాడు. అయితే లైలా విషయానికి వచ్చేసరికి అందంగా కనిపించినా సరే ఎందుకు పూర్తిస్థాయిలో ఆ పాత్రను క్యారీ చేయడంలో తడబడిన ఫీలింగ్ కలుగుతుంది. హీరోయిన్ అయితే పూర్తిగా అందాల ఆరబోతకే పరిమితమైంది. అభిమన్యు సింగ్ గత సీరియస్ పాత్రల కంటే ఈ సినిమాలో సరదా సరదాగా ఓ భగ్న ప్రేమికుడిగా కనిపించాడు. ఇక మిగతా పాత్రధారులు అందరూ తమ తమ పాత్రలు పరిధి మేరకు నటించారు ఎవరికీ పెద్దగా చెప్పుకోదగ్గ పాత్రలు అయితే పడలేదు. టెక్నికల్ టీం విషయానికొస్తే ఈ సినిమాలో దర్శకుడు పనితనం పూర్తిస్థాయిలో సినిమాని నిలబెట్టడంలో సక్సెస్ కాలేదు. సినిమాలో రాసిన చాలా డైలాగులు ఎబ్బెట్టుగాగా ఉండటమే కాదు ఫ్యామిలీతో కలిసి అసలు చూడలేనట్టుగా ఉన్నాయి. సాంగ్స్ వినడానికి బాగానే ఉన్నాయి స్క్రీన్ మీద కూడా బాగున్నాయి. కానీ కాస్త గ్లామర్ డోస్ ఎక్కువైంది. ఇక సినిమాటోగ్రాఫర్ మాత్రం సినిమాని రిచ్ గా కలర్ ఫుల్ గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు.. ఎడిటింగ్ టేబుల్ మీద గట్టిగానే కట్ చేసి పంపించారు. అది కొంత అది సినిమాకి కలిసి వచ్చింది. విశ్వక్సేన్ కాస్ట్యూమ్స్ విషయంలో తీసుకున్న కేర్ కూడా చాలా ఫ్రేమ్స్ లో కనిపించింది.
ఫైనల్లీ: ఈ లైలా.. కష్టమే