ఈ మధ్య నాగచైతన్య హీరోగా నటించిన ‘తండేల్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ సాధించింది. దాదాపు అదే కథాంశంతో సత్యదేవ్ హీరోగా, ఆనంది హీరోయిన్‌గా ఒక వెబ్ సిరీస్ రూపొందించారు. ‘అరేబియా కడలి’ పేరుతో ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. చింతకింది శ్రీనివాసరావు కథ అందించిన ఈ సిరీస్‌కి క్రిష్ రైటర్‌గా వ్యవహరించారు. సూర్య కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ ప్రమోషనల్ కంటెంట్ దాదాపు ‘తండేల్’ సినిమాను గుర్తుకు తెచ్చింది. “అదేంటి, ఇప్పటికే ఒక సినిమా వచ్చేసింది కదా, అదే కంటెంట్‌తో సిరీస్ ఏంటి?” అని అందరూ ఆశ్చర్యపోయారు. మరి ఆ సిరీస్ ఎట్టకేలకు అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
అరేబియా కడలి కథ:
ఆంధ్ర సముద్ర తీరంలో చేపలవాడ, మత్స్యవాడ అనే రెండు గ్రామాల మధ్య విపరీతమైన పోటీ కారణంగా ఎప్పుడూ గొడవలు జరుగుతుంటాయి. ఇక్కడ వేట లేనప్పుడు గుజరాత్‌కు వేటకు వెళ్తుంటారు. చేపలవాడ గ్రామానికి చెందిన బద్రి (సత్యదేవ్) మత్స్యవాడ గ్రామానికి చెందిన గంగ (ఆనంది)తో ప్రేమలో ఉంటాడు. అది ఇష్టం లేని గంగ తండ్రి, లిక్కర్ షాపులు నడిపే శేఖర్ (వంశీ కృష్ణ)కు ఇచ్చి పెళ్లి చేసేందుకు సిద్ధమవుతాడు. గుజరాత్ వరకు చేపల వేటకు వెళ్లడం బద్రికి నచ్చదు. దీంతో మన సముద్రంలోనే జెట్టి ఏర్పాటు చేయించాలని ప్లాన్ చేస్తుంటాడు. కానీ బ్రతుకు తెరువు కోసం బద్రి అండ్ బ్యాచ్ గుజరాత్‌కు చేరుకున్నా, ఆలస్యం కావడంతో బోట్‌లన్నీ సముద్రంలోకి వేటకు వెళ్లిపోతాయి. సేట్ కాళ్లా వేళ్లా పడి వేరే బోట్ తెచ్చుకున్నా, పాత బోట్ కావడంతో ఇబ్బందులు మొదలవుతాయి. ఒకే బోట్‌లో రెండు ఊర్ల జాలర్లు వెళ్లడంతో తరచూ గొడవలు జరుగుతుంటాయి. అనుకోకుండా బోర్డర్ దాటి వెళ్లి పాకిస్థాన్ కోస్ట్ గార్డ్స్‌కి దొరికిపోతారు. అందరినీ అరెస్ట్ చేసి పాకిస్థాన్ జైల్లో పెడతారు. అయితే వీరు పాకిస్థాన్ జైల్లో ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? అక్కడి నుంచి ఎలా బయటపడ్డారనేది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ:
ఈ వెబ్ సిరీస్ చూడడం మొదలు పెట్టగానే ‘తండేల్’ గుర్తుకు రావడం పక్కా. ఎందుకంటే ఈ రెండూ దాదాపు ఒకే కథతో రూపొందించబడ్డాయి. కథ ఒకటే అయినా, ఆకట్టుకునేలా, ఎమోషనల్‌గా చెప్పితే అది వర్కౌట్ అవుతుంది. ఆ విషయంలో టీమ్ కొంతవరకు సక్సెస్ అయ్యింది. వెబ్ సిరీస్ చూస్తున్నంత సేపు ఆ సినిమా గుర్తొచ్చినా, ప్రతి సీన్ ఎంగేజ్ చేసేలా తీయడంతో సిరీస్ చూసే వారు కూడా పెద్దగా ఇబ్బంది పడరు. సినిమా కట్టే కొట్టే తెచ్చే అని చూపించిన విషయాలను అన్నింటినీ చాలా డెప్త్‌గా, అసలు ఏం జరిగింది? జాలర్లు ఎలాంటి ఇబ్బందులు పడ్డారనేది రియాలిటీకి దగ్గరగా చూపించారు. ప్రతి ఎమోషన్‌ని క్యాప్చర్ చేస్తూ అసలు ఏం జరిగిందనేది ఎంగేజింగ్‌గా చూపించారు. ఇది రియల్‌గా జరిగిన కథ కాబట్టి, ఆ విషయంలో చాలా రీసెర్చ్ చేసి సిరీస్ చేసిన ఫీలింగ్ కలిగింది. రియాలిటీకి దగ్గరగా కథను చూపిస్తూ వెబ్ సిరీస్‌ని రన్ చేశారు. సముద్రంలోని సంఘటనలు ప్రేక్షకులలో ఆసక్తి క్రియేట్ చేసేలా ఉన్నాయి. పాకిస్థాన్ పోలీసులకు దొరికిపోయి అక్కడ ఇబ్బందులు పడుతున్న వారిని చూస్తే ‘అయ్యో పాపం’ అనే ఫీలింగ్ కలుగుతుంది. అదే డైరెక్టర్ గొప్పతనం అని చెప్పొచ్చు. నిజానికి సినిమాల్లో ఎంత పెద్ద కథనైనా రెండున్నర, మూడు గంటల్లోనే చెప్పాలి. అదే వెబ్ సిరీస్‌లో నిడివి బెనిఫిట్ ఉంటుంది. తెలిసిన కథే కావడంతో కిక్ కొంత మిస్ అయిన ఫీలింగ్ కలిగినా, నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకు ఈజీగా అర్థమైపోతుంది. అయితే కథను ఎంగేజింగ్‌గా చెప్పడంలో మాత్రం సక్సెస్ అయ్యారు. స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్ చేశారు.
నటీనటుల విషయానికి వస్తే, బద్రి పాత్రలో సత్యదేవ్ జీవించాడు. మనకు ఎక్కడా సత్యదేవ్ కనిపించడు, అక్కడ పాత్రే కనిపిస్తుంది. అలాగే గంగ పాత్రలో ఆనంది సైతం జీవించింది. ఇక వంశీ కృష్ణతో పాటు రోషన్ సహా ఇతర పాత్రధారులు తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, టెక్నికల్‌గా సిరీస్ చాలా బాగుంది. విద్యాసాగర్ సంగీతం మంచి ప్లస్ పాయింట్. బీజీఎం కూడా బాగుంది. అలాగే సమీర్ రెడ్డి కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలకు కొదవ లేదు. సినిమా క్వాలిటీతో తెరకెక్కించారు.
ఫైనల్‌గా: ఎంగేజ్ చేసే ‘అరేబియా కడలి’.