Popcorn Movie Review: పాప్ కార్న్ రివ్యూ
దశాబ్దం క్రితం ‘ఉయ్యాలా జంపాలా’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ‘బాలికా వధు’ ఫేమ్ అవికా గోర్. ఆ తర్వాత కూడా కొన్ని సక్సెస్ ఫుల్ మూవీస్ లో యాక్ట్ చేసింది. లాస్ట్ ఇయర్ ఆమె కీ రోల్ ప్లే చేసిన ‘టెన్త్ క్లాస్ డైరీస్’, ‘ధ్యాంక్యూ’ మూవీస్ రిలీజ్ అయ్యాయి. విశేషం ఏమంటే… దాదాపు పదిహేను నెలల క్రితమే అవికా గోర్, సాయి రోనక్ నటించిన ‘హ్యాష్ ట్యాగ్ బ్రో’ అనే మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. ఆ జంట ఇప్పుడు ‘పాప్ కార్న్’తో థియేట్రికల్ రిలీజ్ కు వచ్చింది. యాడ్ ఫిల్మ్ మేకర్ గంథం శ్రీనివాస్ ను డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేస్తూ భోగేంద్ర గుప్తా నిర్మించిన ‘పాప్ కార్న్’ ఎలా ఉందో చూద్దాం. అన్నట్లు ఈ మూవీతో ఫస్ట్ టైమ్ అవికా గోర్ ఫిల్మ్ ప్రొడక్షన్ లోకీ అడుగుపెట్టింది.
సింగిల్ మదర్ (నిత్యాదాస్) డాటర్ సమీరన (అవికా గోర్). చిన్నప్పటి నుండి ఆస్తమాతో బాధపడుతూ ఉంటుంది. దాంతో సింగర్ కావాలనే ఆమె కోరిక నెరవేరదు. అలానే తల్లిదండ్రులను కోల్పోయిన పవన్ (సాయి రోనక్) కు తాతయ్య (చారు హాసన్) అంటే ప్రాణం. ఆయన ఓ మ్యూజిక్ కంపెనీని నిర్వహిస్తుంటాడు. పవన్ కు మ్యూజిక్ డైరెక్టర్ కావాలన్నది కోరిక. అందుకోసం ఇన్ స్ట్యుమెంట్స్ ప్లే చేస్తూ, కుర్రాళ్ళుకు నేర్పుతుంటాడు. ఫారిన్ లో జాబ్ అపార్చునిటీ వచ్చినా… తాతయ్యను, అక్కను వదిలి వెళ్ళడం ఇష్టం లేక ఇక్కడే ఉండిపోతాడు. ఈ పవన్, ఆ సమీరన షాపింగ్ కోసం ఓ మాల్ లోకి వెళతారు. అక్కడ వీళ్ళిద్దరూ లిఫ్ట్ లో ఉండగా బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. దాంతో ఈ వీళ్ళు లిఫ్ట్ లో ఇరుక్కుపోతారు. అందులోంచి వీరిద్దరూ ఎలా బయటకు వచ్చారు? ఒకరి పట్ల ఒకరికి ఏర్పడిన అపార్థాలను ఎలా తొలగించుకున్నారు? ఆస్తమా ప్రాబ్లమ్ ఉన్న సమీరనకు పవన్ ఎలాంటి హెల్ప్ చేశాడు? అనేదే మిగతా కథ.
సినిమా ప్రారంభంలోనూ, ముగింపు లోనూ ఓ పది నిమిషాలు ఈ రెండు పాత్రలతో పాటు మరికొన్ని పాత్రలు మనకు తెర మీద కనిపిస్తాయి. మిగిలిన రెండు గంటల కథ ఈ రెండు పాత్రలతోనే సాగుతుంది. అందులోనే మూడు, నాలుగు పాటలూ ఉంటాయి. దర్శకుడు తీసుకున్న పాయింట్ ఆసక్తికరమైనదే అయినా… రెండు పాత్రల చుట్టూనే ఈ సినిమాను నడపడం వల్ల పట్టు సడలిపోయింది. డైరెక్టర్ మురళి బేసికల్ గా యాడ్ ఫిల్మ్ మేకర్ కావడం కొంత ప్లస్ అయ్యింది. ప్రతి ఫేమ్ ను అందంగా, కలర్ ఫుల్ గా చూపించే ప్రయత్నం చేశాడు. ప్రతి పాటకూ ఓ థీమ్ ను తీసుకున్నాడు. అందువల్ల సాంగ్స్ పిక్చరైజేషన్ మనకు ఆడ్ గా అనిపించదు. ఫస్ట హాఫ్ లో హీరోయిన్ను హీరో అపార్థం చేసుకుంటే… సెకండ్ హాఫ్ లో హీరోను హీరోయిన్ అపార్థం చేసుకుంటుంది. సో… చెల్లుకు చెల్లు!! మొత్తం మీద లిఫ్ట్ లో గడిపే రెండు గంటల సమయంలో ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడంలో ఆల్ ఈజ్ వెల్ అన్నట్టుగా సాగిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ కు ఆస్తమా ప్రాబ్లమ్ రావడంతో క్లయిమాక్స్ లో హీట్ జనరేట్ అవుతుంది. అప్పటి వరకూ నత్త నడక సాగిన సినిమా అక్కడ నుండి కొంత వేగం పుంజుకుంది. కానీ హైదరాబాద్ లాంటి మెట్రో సిటీలోని పెద్ద షాపింగ్ మాల్ లో టెర్రరిస్టులు బాంబ్ బ్లాస్ట్ కు పాల్పడినప్పుడు పర్యావసానాలు ఎలా ఉంటాయి అనే అంశానికి దర్శకుడు ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. అదే అసలు డ్రా బ్యాక్. ఈ లవ్ స్టోరీతో పాటే… టెర్రరిస్ట్ అటాక్, దాని కౌంటర్ ఇన్సిడెంట్స్ ను కూడా చూపించి ఉంటే బాగుండేది. కనీసం దీనికి కారణమైన సస్సెక్ట్స్ ను అరెస్ట్ చేసినట్టో, ఎంక్వయిరీస్ చేస్తున్నట్లో కూడా చూపించలేదు. అంత పెద్ద షాపింగ్ మాల్ లో బాంబ్ బ్లాస్ట్ జరిగే, ఎవరైనా ఎక్కడైనా చిక్కుకు పోయారేమోననే అనుమానం కూడా రాన్నట్టుగా చూపడం దారుణం. అలానే హీరో లిఫ్ట్ నుండి బయటకు రావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం సబబుగా అనిపించదు.
నటీనటుల విషయానికి వస్తే… అవికా గోర్ దూకుడు ప్రదర్శించే ఈ కాలం అమ్మాయి లక్షణాలను బాగానే తెరపై ప్రెజెంట్ చేసింది. ఇంతవరకూ చేసిన పాత్రలలో సాయిరోనక్ కు ఇది బెస్ట్ క్యారెక్టర్. అతను మంచి డాన్సర్ అనే విషయం పాటల్లో తెలుస్తోంది. అవికా గోర్ తల్లి పాత్రను మలయాళీ నటి నిత్యాదాస్ పోషించింది. గతంలోనూ ఆమె ఓ తెలుగు సినిమాలో హీరోయిన్ గా చేసింది. కమల్ హాసన్ సోదరుడు చారుహాసన్ గత యేడాది ‘గమనం’ సినిమాలో ఓ కీ-రోల్ ప్లే చేశారు. ఇందులో అంధుడైన మ్యూజిక్ డైరెక్టర్ గా నటించారు. సాయిరోనక్ అక్క పాత్రను శ్రుతి నందన్ చేసింది. ఇంతకు మించి పెద్దగా చెప్పుకోనే పాత్రలేవీ లేవు. శ్రవణ్ భరద్వాజ్ నేపథ్య సంగీతం బాగుంది. సినిమా మొత్తం లిఫ్ట్ లోనే సాగడంతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్టు అయ్యింది. క్లయిమాక్స్ కాస్తంత ఆసక్తికరంగా ఉన్నా అదేమీ పెద్ద సేవ్ చేస్ అంశం కాదు. ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ ఓటీటీకి ఓకే కానీ పని కట్టుకుని థియేటర్లకు వెళ్ళే ప్రేక్షకులను మెప్పించలేవు. ఇది వాలెంటైన్స్ వీక్ కాబట్టి యూత్ అట్రాక్ట్ అవుతారేమో చూడాలి.
రేటింగ్: 2.5/ 5
ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న థీమ్
కలర్ ఫుల్ టేకింగ్
మేకింగ్ వాల్యూస్
మైనెస్ పాయింట్స్
మెయిన్ క్యారెక్టర్స్ రెండే కావడం
బోర్ కొట్టే ద్వితీయార్థం
ట్యాగ్ లైన్: లవ్ పాప్!