Nene Vastunna Review: హీరో ధనుష్, అతని సోదరుడు సెల్వ రాఘవన్ కాంబినేషన్ లో ‘కాదల్ కొండెన్, పుదుపేట్టై, మయక్కం ఎన్న’ తర్వాత రూపుదిద్దుకున్న నాలుగో సినిమా ‘నానే వరువెన్’. కలైపులి ఎస్ థాను నిర్మించిన ఈ సినిమాలో ధనుష్ ద్విపాత్రాభినయం చేశాడు. ‘నేనే వస్తున్నా’ పేరుతో దీనిని తెలుగులో గీతా ఆర్ట్స్ సంస్థ గురువారం జనం ముందుకు తీసుకొచ్చింది.
కదిర్, ప్రభు (ధనుష్) కవల పిల్లలు. మొదటి నుండి కదిర్ కాస్తంత అబ్ నార్మల్ గా ప్రవర్తిస్తుంటాడు. అతని కారణంగా బోలడన్నీ గొడవలు వస్తుంటాయి. కొడుకులిద్దరూ కలిసి ఉంటే చిక్కులు తప్పవని గ్రహించిన తల్లి, కదిర్ ను దూరంగా వదిలేస్తుంది. ప్రభు పెరిగి పెద్దవాడై ఇంజినీర్ అవుతాడు. భార్య భువన, కూతురు సత్యతో హాయిగా జీవితాన్ని సాగిస్తుంటాడు. అలాంటి సమయంలోనే ఊహించని సమస్య ఎదురవుతుంది. హైస్కూల్ లో చదువుకునే కూతురు సత్య కంటికి కనిపించని వేరే ఎవరితోనో మాట్లాడుతోందని తెలిసి, సైక్రియాటిస్ట్ దగ్గరకు తీసుకెళతాడు. రకరకాల పరీక్షల తర్వాత ఆ పాప ఓ ఆత్మతో మాట్లాడుతోందనే విషయం బయటపడుతుంది. సోను అనే పిల్లాడి ఆత్మ సత్యను ఎందుకు ఆవహించింది? ఆ పాప ద్వారా ఏం కోరికను నెరవేర్చుకోవాలని అనుకుంది? ఆ ఆత్మ నేపథ్యం ఏమిటీ? చిన్నప్పుడే ఇంటి నుండి వెలివేయబడ్డ కదిర్ ఏమయ్యాడు? అనేది మిగతా కథ.
‘నేనే వస్తున్నా’ మూవీ ట్రైలర్ చూసిన వాళ్ళకు ఒకే వయసున్న రెండు భిన్నమైన పాత్రలను ధనుష్ చేశాడనేది అర్థమైంది. ఇదో యాక్షన్ థ్రిల్లర్ మూవీ అనీ తెలిసింది. కానీ థియేటర్ లోకి అడుగుపెట్టిన తర్వాత ప్రేక్షకులకు పూర్తి భిన్నమైన అనుభవాన్ని ఈ సినిమా కలిగించింది. ఇది హారర్ జానర్ మూవీ అని తెలిశాక దాన్ని జీర్ణించుకోవడానికి కాస్తంత టైమ్ పట్టింది. కవల పిల్లలు, వారిలో ఒకరు అబ్ నార్మల్ గా ప్రవర్తించడం, అందులో ఒకడిని గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చిన సెల్వ రాఘవన్ ఎత్తుకుపోవడం, తండ్రిని చంపిన ఆ కుర్రాడు ఎక్కడెక్కడో పెరగడం ఇవన్నీ అర్థం పర్థం లేనివిగానే అనిపిస్తాయి. పోనీ… పెద్దయ్యాక కూడా అతను అలానే ఉన్నాడా? అంటే అదీ లేదు. ఉత్తరప్రదేశ్ కు చేరి కాస్తంత మారి, అక్కడ తనకంటూ ఓ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. కానీ అతనిలోని రాక్షసుడు అలానే ఉండిపోవడం, ఫ్యామిలీ రిలేషన్స్ సైతం అతనిలో మార్పును తీసుకురాకపోవడం అనేది అంత సబబుగా అనిపించదు. అతనిలోని అమానవీయ కోణాన్ని చూసి కుటుంబ సభ్యులు భయపడటం, దూరంగా పారిపోవాలని అనుకోవడం, దాంతో అతను అతిగా ప్రవర్తించడం ఇవన్నీ కన్వెన్సింగ్ గా లేవు. ఇల్లాజికల్ సీన్స్ తో ప్రేక్షకులను థ్రిల్ కు గురిచేయాలని మాత్రమే దర్శకుడు సెల్వ రాఘవన్ భావించాడు. అతని సినిమాలలో కొంత అతి ఉండేది వాస్తవమే అయినా… ఇందులోని కొన్ని సన్నివేశాలు మరీ బేస్ లెస్ గా ఉన్నాయి. దెయ్యాలను, భూతాలను చూపించే సినిమాలలో లాజిక్స్ గురించి ఆలోచించకూడదంటే చేసేది ఏమీలేదు!
నటీనటుల విషయానికి వస్తే… ధనుష్ మొదటి నుండి ఇమేజ్ చట్రంలో ఇరుక్కునే ప్రయత్నం చేయలేదు. పాత్రోచితంగా అభినయించడానికే ప్రాధాన్యం ఇస్తూ వచ్చాడు. ఇందులోనూ ప్రభు పాత్రకు చక్కని న్యాయం చేకూర్చాడు. కానీ కదిర్ గా అతని నుండి మరింత భిన్నమైన నటనను ప్రేక్షకులు ఆశిస్తారు. అది వాళ్ళకు లభించలేదు. ప్రభు భార్యగా ఇందుజా రవిచంద్రన్, కదిర్ భార్య, మూగమ్మాయిగా ఎల్లి అవ్రామ్ నటించారు. నటి తులసి ఒక్క సీన్ కే పరిమితమైంది. యోగిబాబు హీరో కొలిగ్ గా నటించాడు కానీ అతని పాత్ర ద్వారా ప్రేక్షకులకు ఎలాంటి వినోదాన్ని అందించే ప్రయత్నం దర్శకుడు చేయలేదు. సైకియాటిస్ట్ గా ప్రభు కీలక పాత్ర పోషించాడు. పైన చెప్పినట్టు సెల్వ రాఘవన్ ఇందులో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చాడు. ఊటీ లో దాదాపు సినిమాను తీసేశారు. దాంతో పెద్దంత బడ్జెట్ పెట్టాల్సి అవసరం కూడా నిర్మాత కలైపులి ఎస్ థానుకు కలగలేదు. చెప్పుకోదగ్గ యాక్షన్ సీన్స్ కూడా ఏమీ లేవు. రెండు మూడు పాటలున్నా అవి నేపథ్య గీతాలే. అయితే యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఓంప్రకాశ్ ఫోటోగ్రఫీ ఓకే!
ఎంత సైకో థ్రిల్లర్ హారర్ మూవీ అయినా కన్న కొడుకే తండ్రిని చంపడం, అలానే కన్న కొడుకునే తండ్రి చంపేయడం లాంటి యాంటీ సెంటిమెంట్ సినిమాలను చూసి జనం తట్టుకోవడం కష్టమే. ఈ యేడాది ఇప్పటికే ధనుష్ నటించిన ‘మారన్’, ‘ది గ్రే మ్యాన్’ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాగా, ‘తిరు’ థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాలేవీ అతని అభిమానులను కూడా మెప్పించలేకపోయాయి. ఇది అదే దారి పట్టింది. మరి ఈ యేడాది చివరిలో వచ్చే ‘సర్’తో అయినా ధనుష్ ప్రేక్షకులలో జోష్ నింపుతాడేమో చూడాలి.
రేటింగ్: 2.25 / 5
ప్లస్ పాయింట్స్
ధనుష్ ద్విపాత్రాభినయం
యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం
మైనెస్ పాయింట్స్
ఆసక్తి కలిగించని కథ
సహనానికి పరీక్షపెట్టే కథనం
ట్యాగ్ లైన్: రానవసరం లేదు!