Off The Record: ఉత్తరాంధ్రలో వైసీపీ కొత్త వ్యూహం అమలు చేయబోతోందా? పోగొట్టుకున్న చోటే వెతుక్కోవడానికి పక్కా స్కెచ్ రెడీ చేస్తోందా? ఎవరికి వారు ఆందోళనలు చేయకుండా మూకుమ్మడి కార్యక్రమాలతో ప్రభుత్వం మీద వత్తిడి పెంచడంతోపాటు తమ సత్తా కూడా చూపాలనుకుంటోందా? అసలు వైసీపీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? అక్కడే ఎందుకు స్పెషల్ ఫోకస్ పెడుతోంది?
Read Also: Trump: హమాస్‌కు ట్రంప్ కొత్త డెడ్‌లైన్.. లేదంటే ఆదివారం నరకం చూస్తారని హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరైపోయింది. రాష్ట్ర స్థాయి పరిపాలన మీద ప్రజాభిప్రాయం ఎలా వున్నా.. లోకల్‌గా చాలా మంది ఎమ్మెల్యేల పనితీరుపై వ్యతిరేకత చాపకింద నీరులా విస్తరిస్తోందన్న అభిప్రాయం పెరుగుతోంది. చాలా చోట్ల అవినీతి వ్యవస్ధీకృతం అవుతోందన్న ఆరోపణలు ఎక్కువ అవుతున్నాయి. మరోవైపు కొన్ని చోట్ల టీడీపీ-జనసేన మధ్య సర్దుబాటు ఇబ్బందులు ఉన్నట్టు ఆయా పార్టీల నేతలే అంగీకరిస్తున్నారు. సరిగ్గా ఇక్కడే ప్రతిపక్షం వైసీపీ కొత్త వ్యూహాలకు పదును పెడుతోందట. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచే కొత్త ఆపరేషన్ మొదలు పెట్టాలనుకుంటున్నట్టు సమాచారం. ఓటమి తర్వాత నాయకులు కొందరు పక్కచూపులు చూశారేమోగానీ.. ద్వితీయ శ్రేణి నుంచి గ్రామాల వరకు కింది స్థాయిలో ఎక్కడా వెనక్కు తగ్గలేదన్నది వైసీపీ అధిష్టానం దగ్గరున్న ఫీడ్ బ్యాక్. ఘోరమైన ఓటమి కంటే.. ఆ తర్వాత నేతల నిశ్శబ్దమే ప్రమాదకరమని గుర్తించిన వైసీపీ పెద్దలు ఉత్తరాంధ్ర నుంచి ఆపరేషన్ సైలెన్స్ బ్రేక్‌ను మొదలుపెట్టాలనుకుంటున్నట్టు సమాచారం.
Read Also: Off The Record: భూమా అఖిల ప్రియా, ఎస్వీ జగన్ మధ్య స్కాం పంచాయితీ ఏంటి?
ఈ ప్రాంతంలో మొత్తం 34 ఎమ్మెల్యే, ఐదు ఎంపీ సీట్లు ఉన్నాయి. మొదటి నుంచి ఇది టీడీపీకి కంచుకోట. అలాంటి ఏరియాను 2019లో తన వైపు తిప్పుకోగలిగింది వైసీపీ. అప్పుడు ఆరు ఎమ్మెల్యే, ఒక ఎంపీ మినహా మొత్తం సీట్లన్నీ కొల్లగొట్టింది. ఇక 2024లో రాష్ట్రం అంతటా ఫలితాలు ఒక ఎత్తైతే వైసీపీని ఎక్కువ నిరాశ పరిచింది ఉత్తరాంధ్రేనన్న అభిప్రాయం ఉంది. 2019 ఎన్నికల్లో టీడీపీకి ఊపిరి ఆడకుండా చేసేసిన స్ధాయి నుంచి ఇప్పుడు ఒక ఎంపీ, రెండు ఎమ్మెల్యేల సీట్లకు పరిమితమైంది. పైగా, వైసీపీ గెలిచిన అరకు, పాడేరు నియోజకవర్గాలోల విన్నింగ్ పాలిటిక్స్ మీద టీడీపీకి పెద్దగా ఆశలు కూడా లేవంటారు. దీంతో… ఈ రెండు మినహాయిస్తే.. ఈ ఏరియాలో చేజారిన మిగతా స్ధానాల్లో బలోపేతం అయ్యేందుకు వైసీపీ కార్యాచరణ సిద్ధం చేస్తోందట. ఉత్తరాంధ్రలో మొదటి నుంచి పార్టీ పెద్దలకు దగ్గరగానూ… కేడర్‌కు దూరంగా వున్న వాళ్ళకు ఛాన్స్ ఇస్తూ వచ్చింది వైసీపీ అధిష్టానం. గత ఎన్నికల్లో వైఫల్యాలకు పొరుగు నేతలే కారణమన్న అభిప్రాయం స్థానిక పార్టీ వర్గాల్లో బలంగా ఉంది. ఇదే విషయాన్ని కొందరు నాయకులు అధిష్టానం చెవిన కూడా వేశారట. దాంతో దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.
Read Also: Off The Record: వైసీపీతో కలిసి కొందరు టీడీపీ నేతలు దోస్త్ మేర దోస్త్ అంటున్నారా?
ప్రస్తుతం ఉత్తరాంధ్రలో ప్రతిపక్షానికి ఒక లోక్‌సభ, ఒక రాజ్యసభ ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు…నలుగురు ఎమ్మెల్సీల బలం వుంది. జిల్లా పరిషత్ ఛైర్మన్స్ ఆపార్టీకి చెందిన వాళ్ళే. అయినాసరే…ఇక్కడ పార్టీని నిస్సత్తువ ఆవహించిందన్న విశ్లేషణలున్నాయి. ప్రస్తుతం మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పెద్ద దిక్కుగా మారారు. ఇక, కీలకమైన ఉమ్మడి విశాఖ జిల్లాలో మాజీమంత్రి అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి, ఉమాశంకర్ గణేష్, సిట్టింగ్ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు వంటి వారి చుట్టూనే పార్టీ వ్యవహారాలు తిరుగుతున్నాయి. ఒకప్పుడు ఇక్కడ బలంగా పనిచేసిన మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఇతర కీలక పదవులు చేపట్టిన నేతలు ఎవరూ ఇప్పుడు గళం విప్పడం లేదు. ఆ విషయంలో ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. అదే సమయంలో మరోసారి పట్టు జారకుండా కూటమి పార్టీలు గట్టి ప్రయత్నాల్లో ఉన్నాయట. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఉత్తరాంధ్ర చుట్టూ ఎక్కువగా తిరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ అయితే… ఏజెన్సీ ఏరియా మీద ప్రత్యేకంగా ద్రుష్టిసారించారు.
Read Also: Delhi Liquor Policy: ఢిల్లీలో కొత్త లిక్కర్ పాలసీకి ప్లాన్!.. 25 ఏళ్ల వయసు తగ్గించే యోచన
ఈ పరిస్థితుల్లో.. తాము అలర్ట్ అవకుంటే కష్టమన్న అభిప్రాయానికి వచ్చిందట వైసీపీ అధిష్టానం. ఆ క్రమంలోనే…త్వరలో ఉత్తరాంధ్ర రీజియన్ పరిధిలో మాజీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జులతో కీలక సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది. పార్టీ పటిష్టతకు సంబంధించి ఆ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర సమస్యల మీద మూకుమ్మడి పోరాటం చేసే దిశగా ప్రణాళికలు ఉండవచ్చంటున్నారు. ఏ నియోజకవర్గంలో సమస్య వున్నా.. మొత్తం 34 మంది కలిసి వెళ్ళడం, సమష్టిగా ఎదుర్కోవడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం లాంటి ప్రోగ్రామ్స్ ఉండవచ్చని చెప్పుకుంటున్నారు. ఇటీవల ఎక్కడికక్కడ స్ధానిక నాయకత్వాలు రోడ్డెక్కుతున్నాయే తప్ప సమష్టి పోరాటం కనిపించడం లేదు. అందుకే వ్యూహం మార్చి అన్ని నియోజకవర్గాల నేతలు సమస్య ఉన్న చోట ఒకేసారి మోహరిస్తే.. గ్యారంటీగా ఫలితం ఉంటుందని భావిస్తున్న పార్టీ పెద్దలు ఆ దిశగా పచ్చజెండా ఊపబోతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో వైసీపీ నిర్వహించబోతున్న ప్రాంతీయ సమావేశం మీద ఆసక్తి పెరుగుతోంది.