Off The Record: అక్కడ టీడీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ లీడర్స్ దోస్త్ మేరా దోస్త్ అంటున్నారా? రాష్ట్ర స్థాయి రాజకీయం ఎలాఉంటే మాకెందుకు? ఎవడెలా పోతే… మాకేంటి? లోకల్‌గా దందాలు సాఫీగా చేసుకున్నామాస లేదా అన్నదే ముఖ్యం అంటున్నారా? తమ అక్రమాల గురించి బయటికి మాట్లాడకుండా వైసీపీ లీడర్స్‌కు నెలవారీ మామూళ్ళు ఇస్తున్నారంటున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు? ఎక్కడ జరుగుతోందా తంతు?
Read Also: Kerala: కేరళ ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. సమస్యలు పట్టించుకోవడం లేదని చొక్కాలాగిన మహిళలు
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కొందరు అడ్డగోలు సంపాదనకు అలవాటు పడి ముందూ వెనకా ఆలోచించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బులొస్తాయంటే చాలు… ఎంతకైనా దిగజారుతున్నారన్న చర్చలు గట్టిగానే జరుగుతున్నాయి ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో. దందాలకు అలవాటుపడ్డ కొందమంది శాసనసభ్యులు వైసీపీ నేతలతో మిలాఖత్ అయిపోయి దోస్త్ మేరా దోస్త్ అంటున్నారని, ఇద్దరూ కలిసే కమీషన్లు, వ్యాపారాలను పంచుకుంటున్నారన్న ప్రచారం సైతం జరుగుతోంది. ఎన్నికల్లో గెలవడానికి కోట్లు ఖర్చు పెట్టిన నేతలు… అధికారంలోకి రాగానే… తమ పెట్టుబడికి ఐదారు రెట్లు సంపాదించాలన్న తాపత్రయంతో విలువలకు తిలోదకాలిస్తున్నారన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ ట్రెండ్‌ని బాగా ఫాలో అవుతున్నారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. తమ అడ్డగోలు సంపాదన కోసం ఎవరితోనైనా రాజీపడేందుకు సై అంటున్నారట ఆ ఇద్దరూ. ముఖ్యంగా… పల్నాడు జిల్లాలో అక్రమ మైనింగ్‌కు కేరాఫ్‌గా మారిన ఓ నియోజకవర్గంలో ఇప్పుుడిదే జరుగుతోందట. తాను ఎంత అడ్డదిడ్డంగా మైనింగ్ చేసినా.. నిబంధనల్ని అస్సలు పట్టించుకోకపోయినా… అసలు అటువైపే చూడకుండా ఉండేందుకు ఆ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత నోటిని నోట్ల కట్టలతో మూుయిస్తున్నారట సదరు శాసనసభ్యుడు.
Read Also: Delhi Liquor Policy: ఢిల్లీలో కొత్త లిక్కర్ పాలసీకి ప్లాన్!.. 25 ఏళ్ల వయసు తగ్గించే యోచన
ఇప్పుడు ఎవరైతే… వైసీపీ నేత కమీషన్లు దండుకుంటున్నారో…. అదే నాయకుడు గతంలో ఆ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్రమ మైనింగ్ చేశారట. అలాగే అక్రమ వసూళ్ళకు పాల్పడ్డారని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ ఎక్స్‌పీరియెన్స్‌తో… ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాసరే… ఎక్కడెక్కడ అక్రమాలు జరుగుతాయి, లూప్‌హోల్స్ ఎక్కడెక్కడ ఉంటాయో ప్రతీ విషయం తెలుసు కాబట్టి…ఆ నాయకుడి నోరు మూయించేందుకు… పల్నాడు మైనింగ్ ఎమ్మెల్యే…నెలకు ఇంతని రేటు ఫిక్స్ చేశారట. అందుకే ఇప్పుడు సదరు వైసీపీ నేత… కూటమి ప్రభుత్వానికి సంబంధించిన మిగతా విషయాల గురించి అనర్గళంగా మాట్లాడుతున్నారు తప్ప…సొంత నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ గురించి మాత్రం నోరు మెదపడం లేదంటున్నారు. ఇక గుంటూరుకు దగ్గరలో ఉన్న మరో నియోజకవర్గం మట్టి, గ్రావెల్ మాఫియాకు కేరాఫ్ అడ్రస్. జిల్లాలో మట్టి, గ్రావెల్ ఎవరికి అవసరమైనా ఇక్కడి నుంచే వెళ్తుంది. ఇందుకోసం ఐదారు చోట్ల అక్రమంగా మట్టి తవ్వకాలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. వీటి మీద మాట్లాడకుండా ఉండేందుకు ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతకు నెలకు 5 లక్షల చొప్పున ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారట స్థానిక ఎమ్మెల్యే. అందుకే ఆ వైసీపీ నాయకుడు టీడీపీ మీద విమర్శలు చేస్తారేగానీ.. కళ్ళ ముందు నడుస్తున్న మాఫియా గురించి పల్లెత్తు మాట అనడం లేదట.
Read Also: Trump: గాజాపై ట్రంప్ ప్లాన్‌ను స్వాగతించిన పాక్.. మండిపడుతున్న స్వదేశీయులు
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. గతంలో పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇచ్చేవారని, ఇప్పుడు తాము చేసే అక్రమాలను బయటకి తెలియకుండా ఉండేందుకు… ప్రత్యర్థులతో కలిసిపోయి తమ నోట మట్టి కొడుతున్నారని వాపోతున్నారట తెలుగుదేశం కార్యకర్తలు. పైకి మాత్రం పరస్పర ఆరోపణలతో హోరెత్తించుకుంటూ… లోలోపల మామూళ్ళ రాజకీయం నడిపిస్తున్నారని, ఇలాంటి రాజీ వ్యవహారాలతో పార్టీ సర్వనాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తోందట టీడీపీ కేడర్. టీడీపీ, వైసీపీ నేతల మిలాఖత్ అలా ఉంటే… ఓ నియోజకవర్గానికి సంబంధించిన అక్రమ ఇసుక క్వారీయింగ్‌పై… అధికారులకు ఫిర్యాదు చేశారట జనసేన నాయకులు. ప్రభుత్వంలో తాము కూడా భాగస్వాములమైనా… టీడీపీ లీడర్స్ తమను పట్టించుకోవడం లేదన్నది వాళ్ళ బాధగా తెలుస్తోంది. ఈ లాలూచీ దందాల కారణంగానే… జిల్లాలో కూటమి నేతల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తుతున్నట్టు తెలుస్తోంది.