YCP gave a shock to TDP in Kuppam.. ?
ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డెడ్ అన్నట్టుగా ఆ కీలక మున్సిపాలిటీలో వైసీపీ పరిస్థితి ఉందట. రాష్ట్రవ్యాప్తంగా చర్చగా మారినచోట గ్రూపుల కుప్పగా తయారై తన్నుకుంటున్నారట నాయకులు. పదవులు చేపట్టాక పరిస్థితి మారిపోయిందనేది కేడర్ చెప్పేమాట. అదెక్కడో ఈ స్టోరీలో చూద్దాం.
కుప్పంలో సార్వత్రిక ఎన్నికల నుంచి పంచాయితీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల వరకు పక్కాగా గేమ్ ప్లాన్ రచించింది వైసీపీ. ఆ వ్యూహాలకు అనుగుణంగా ఫలితాలు సాధించింది. కుప్పంలో జరిగిన తొలి మున్సిపల్ ఎన్నికల్లో 25 వార్డులకుగాను 19 చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలిచారు. ఈ విజయం టీడీపీకి పెద్ద షాక్ ఇచ్చింది. 2024లో ఎమ్మెల్యే సీటే లక్ష్యంగా అధికారపార్టీ పావులు కదుపుతున్న వేళ.. కొత్త రగడ చర్చగా మారింది. మున్సిపల్ ఎన్నికలు జరిగి ఏడాది తిరక్కుండానే నేతలు తన్నులాటలు పరిస్థితిని మార్చేసిందట.
మున్సిపల్ కౌన్సిలర్లు అంతా ఎవరికి వారు యమునా తీరే అన్నట్టుగా ఉంటున్నారట. లోకల్ కేడర్‌కు కూడా అందుబాటులో ఉండటం లేదని ఆరోపిస్తున్నారు. సమస్యలపై చెప్పుకొందామన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని.. ఎవరికి చెప్పాలో కూడా తెలియడం లేదని వాపోతున్నారట పార్టీ కేడర్. మున్సిపల్ ఛైర్మన్‌గా డాక్టర్ సుధీర్ ఉన్నారంటే ఉన్నట్టు అని చెప్పుకోవాల్సి వస్తోందట. ఆయన్ని ఉత్సవ విగ్రహంగా కూర్చోబెట్టి మొత్తం వ్యవహారాలన్నీ వైస్ ఛైర్మన్ మునుస్వామి నడిపిస్తున్నారనేది పార్టీలో వర్గం ఆరోపణ. ఇది సుధీర్ వర్గానికి అసలు రుచించడం లేదట. ఇంతలో 19 కౌన్సిలర్లలో 11 మంది ఛైర్మన్ సుధీర్‌పై మంత్రి పెద్దిరెడ్డికి ఫిర్యాదు చేశారట.
ఛైర్మన్ పట్టించుకోకపోవడం వల్ల వార్డుల్లో ఎలాంటి పనులు చేయలేకపోతున్నామని కౌన్సిలర్లు మంత్రికి చెప్పినట్టు తెలుస్తోంది. ఇదే కాదు.. మున్న 19 మందిలో కొందరు సుధీర్ వెంట.. కొందరు ఎమ్మెల్సీ భరత్ వెంట.. ఇంకొందరు మంత్రి శిబిరంలో కొనసాగుతున్నారు. ఈ గ్రూపుల గోల చూశాక.. కుప్పంలో గెలిచామన్న సంతోషం కూడా ఆవిరవుతోందని శ్రేణులు వాపోతున్నాయట. మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి కోసం 67 కోట్ల పనులు ప్రతిపాదనలు పంపినా.. వాటి గురించి పట్టించుకునే వారే లేరట. ఈ నిర్లక్ష్యం రానున్న రోజుల్లో తమ సీటుకు.. పార్టీకి ప్రతికూలంగా మారే ప్రమాదం ఉందనేది కొందరు కౌన్సిలర్ల ఆందోళన.
టీడీపీ నుంచి గెలిచిన కౌన్సిలర్ హఫీజ్‌ను మరో వైస్‌ఛైర్మన్ చేయడం వైసీపీ కౌన్సిలర్లు జీర్ణించుకోలేకపోతున్నారట. పార్టీ కోసం తాము కష్ట పడితే.. పార్టీ మారిన వారికి పదవులు ఎలా కట్టబెడతారని ఇప్పటికీ ప్రశ్నలు సంధిస్తున్నారు. కుప్పం వైసీపీ ఇంఛార్జ్‌గా ఉన్న ఎమ్మెల్సీ భరత్, మంత్రి పెద్దిరెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నా.. గ్రూప్‌వార్ పీక్స్‌కు చేరుకోవడం కేడర్‌కు మింగుడు పడటం లేదు. కలిసి సాగకపోతే 2024 నాటికి పార్టీ బలపడేది ఎలా అనేది కొందరి ప్రశ్న. ఇప్పటికే పలుమార్లు స్థానిక నేతలకు పార్టీ పెద్దలు క్లాస్ తీసుకున్నా.. ఏదో ఒక సమస్య తెరపైకి వస్తోంది. అయితే కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ నేతల మధ్య తలెత్తిన గొడవలు మాత్రం ఓ రేంజ్‌లో ఉన్నాయి. మరి.. వీటిని పార్టీ పెద్దలు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.