కొన్నిచోట్ల ఇంఛార్జుల కొరత… మరికొన్ని చోట్ల నేతల మధ్య సమన్వయ లోపం. ఒకప్పడు పార్టీకి కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లో ప్రస్తుతం టీడీపీ పరిస్థితి. రథసారథలు కావాలని కేడర్ కోరుతున్నా.. సైకిల్ హ్యాండిల్ పట్టుకోవడానికి నేతలు జంకుతున్నారట. ఇంతకీ ఏంటా ప్రాంతాలు? టీడీపీకి ఎందుకా దుస్థితి? లెట్స్ వాచ్..!
గత ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో టీడీపీ డీలా పడింది. దానికితోడు రాష్ట్రంలో అధికారం చేజారడంతో కేడర్ కంటే లీడర్లు ఎక్కువ డీలా పడ్డారు. అప్పటి వరకు ఎమ్మెల్యేలుగా.. మంత్రులుగా అధికారం చెలాయించిన నేతలు మూడేళ్లుగా కాగడా పట్టుకుని వెతికినా కనిపించడం లేదని కేడర్ గగ్గోలు పెడుతోంది. నాయకత్వ సమస్యతో తెలుగు తమ్ముళ్లు నియోజకవర్గాల్లో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇంఛార్జులను నియమిస్తే పార్టీ కార్యక్రమాల జోరు పెంచాలని కార్యకర్తలు చూస్తున్నారు. కానీ సారథ్య బాధ్యతలు చేపట్టడానికి నాయకులు ముందుకు రావడం లేదట.
ఇటీవల టీడీపీ అధినేత నియోజకవర్గాల వారీగా పార్టీ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ సమావేశాల్లో నిర్లిప్తత వీడి కేడర్‌లో కదలిక వస్తుందని శ్రేణులు భావించాయి. కానీ.. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, నిడదవోలు, కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం సెగ్మెంట్లలో ఇంఛార్జులు లేకుండా పోయారు. ఎస్సీ రిజర్వ్డు నియోజకవర్గాలైన పి. గన్నవరం, కొవ్వూరుల్లో నాయకుల మధ్య కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. పార్టీ పదవుల కోసం లోకల్ లీడర్లు తన్నుకుంటున్నారు. టీడీపీ కార్యక్రమాలు సైతం ఎవరికి వారుగా నిర్వహిస్తూ.. తమలోని అనైక్యతను ప్రజలకు పరిచయం చేస్తున్నారు నాయకులు.
కొవ్వూరులో టీడీపీ ఎప్పుడూ పెండ్యాల కృష్ణబాబు చేతిలో ఉండేది. ఆయన వైసీపీలోకి వెళ్లడంతో కృష్ణబాబు సోదరుడు అచ్చిబాబు టీడీపీ కేడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. 2014లో కొవ్వూరు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన KS జవహర్‌కు.. అచ్చిబాబుకు మధ్య అస్సలు పడటం లేదు. గత ఎన్నికల్లో జవహర్‌కు కొవ్వూరు టికెట్టే దక్కలేదు. కృష్ణాజిల్లా తిరువూరులో పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి కొవ్వూరుపై ఆశలు పెట్టుకుని రీఎంట్రీ ఇచ్చారు జవహర్. ఇంతలో మాజీ మంత్రికి తూర్పుగోదావరి జిల్లా టీడీపీ బాధ్యతలు అప్పగించింది పార్టీ. కానీ… జవహర్ మాత్రం కొవ్వూరు ఇంఛార్జ్ పదవి ఆశిస్తున్నారు. అచ్చిబాబుతో వచ్చిన గ్యాప్ ఇంకా పూడకపోవడంతో.. ఇంఛార్జ్ పదవికి గ్యారెంటీ లేదని చెబుతోంది కేడర్.
ఇక నిడదవోలులో టీడీపీ పరిస్థితి వేరు. ఇక్కడ రెండుసార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన బూరుగుపల్లి శేషారావు.. గత ఎన్నికల్లో ఓడిన తర్వాత పార్టీని పట్టించుకోవడం మానేశారు. ఇంత వరకు నియోజకవర్గంలో పార్టీ మండల కమిటీల నియామకం కూడా జరగలేదు. బాదుడే బాదుడు కార్యక్రమాలు సైతం నామ మాత్రంగానే నిర్వహిస్తున్నారట. ఇటీవల శేషారావు సడెన్‌గా తెరమీదకు వచ్చి టీడీపీ అధినేతను కలిసి మాట్లాడారు. ఆయనకు ఇంఛార్జ్‌గా బాధ్యతలు అప్పగిస్తారో లేదో కానీ.. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న కుందుల సత్యనారాయణ ఆ పదవి ఆశిస్తున్నారట. ఈ ఇద్దరిలో ఎవరికో ఒకరికి టికెట్ ఇస్తారని కేడర్ అనుకుంటున్నా.. పార్టీ కార్యక్రమాలను లీడ్ చేయడానికి మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదట. మొత్తంగా పార్టీకి కంచుకోటగా భావించిన చోట సైకిల్ హ్యాండిల్ పట్టుకోవడానికి లీడర్లు ఆసక్తి చూపకపోవడం తమ్ముళ్లను విస్మయ పరుస్తోంది.