కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం వైసిపి సంక్షోభంలో పడింది. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు వైసిపిలో ప్రాధాన్యత ఇవ్వడం, నియోజకవర్గ వైసిపి శ్రేణులకు మింగుడు పడటంలేదు. వైసిపికి రాజోలు నియోజకవర్గంలో కో – ఆర్డినేటర్ గా పెదపాటి అమ్మాజీ, మాజీ కో – ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు లను ప్రక్కన పెట్టి ఎమ్మెల్యే రాపాకకు ప్రాధాన్యత ఇచ్చారు. దీనితో వైసిపి ఆవిర్భావం నుంచి ఉన్న నేతలు డీలా పడ్డారు. ఇటీవల అమలాపురంలో జరిగిన కోనసీమ జిల్లా వైసిపి సమీక్షా సమావేశానికి ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు ఒక్కరికే ఆహ్వానం పంపారు. అమ్మాజీ, బొంతు రాజేశ్వరరావులను పక్కన పెట్టారు. ఈ పరిణామం వైసిపి శ్రేణులకు ఆగ్రహం తెప్పించింది. ఎప్పటి నుండో మూడు స్థంభాలాటలా జరుగుతున్న రాజోలు వైసిపిలో, తాజా పరిణామాలు కార్యకర్తలను అయోమయంలో పడేశాయి. మూడు ముక్కలుగా విడిపోయిన రాజోలు వైసీపీ ఏకతాటిపైకి రావడానికి చేసిన పరిణామాలు బెడిసికొట్టాయి.
అందుకే రాజోలు రాజకీయాలు ఎప్పుడూ డిఫరెంట్ గా ఉంటాయి. పార్టీల కంటే సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి పట్టం కడతారు. ఎస్.సి. రిజర్వు స్థానం అయినప్పటికీ, ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేసేదిగా, అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన కాపు సామాజిక వర్గానిదే పైచేయి. అందుకే గడిచిన 2018 ఎన్నికల్లో, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలోనే జనసేన పార్టీ గెలిచింది. అనంతరం మారిన రాజకీయ పరిణామాలతో ఎమ్మెల్యే రాపాక, జనసేన పార్టీకి దూరమయ్యారు. రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం లో జనసేన పార్టీ నుంచి గెలుపొందిన రాపాక వర ప్రసాద రావుకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యతనిస్తూ, ఇంతవరకూ పార్టీని నడిపించిన నాయకులను పక్కన పెట్టడం పట్ల నియోజకవర్గ వైసీపీ కేడర్ లో అసంత్రుప్తి వ్యక్తమవుతోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినప్పటి నుంచి నియోజకవర్గ కో ఆర్డినేటర్ గా ఉన్న పంచాయతీరాజ్ రిటైర్డ్ ENC బొంతు రాజేశ్వరరావు, అసెంబ్లీకి, ఆ పార్టీ అభ్యర్థిగా రెండుసార్లు పోటీ ఓడిపోయారు. ఇక రాజకీయాల్లో గెలవడం అసాధ్యం అనుకున్నారేమో గానీ, ఆయనను పక్కనపెట్టేశారు. పార్టీ పటిష్ఠత కోసం అనంతరం ఎస్సీ మాల కార్పొరేషన్ ఛైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీకి రాజోలు నియోజకవర్గ కో ఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించగా, రెండేళ్లుగా ఆమె పార్టీ కేడర్ ను నడిపించారు. ఇటీవల కాలంలో వీరిద్దర్నీ పక్కన పెట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో జత కట్టిన రాపాక వర ప్రసాద్ కు పార్టీలోను, ప్రభుత్వ కార్యక్రమాలలోను ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది వైసిపి అసలైన కార్యకర్తలకు మింగుడు పడటం లేదు.
అమలాపురం లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్న కోనసీమ జిల్లా వైఎస్సార్సీపీ సమీక్షా సమావేశానికి రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ ను పిలిచారు. గతం నుంచి పార్టీని నడిపించిన కోఆర్డినేటర్లు బొంతు రాజేశ్వరరావు, పెదపాటి అమ్మాజీలను సమీక్షా సమావేశంలోకి ప్రవేశం లేకపోవడంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో నియోజకవర్గంలోని వైఎస్సార్ కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలని నాయకులు మధన పడుతున్నారు. ఇంతవరకు బొంతు రాజేశ్వరరావు, పెదపాటి అమ్మాజీల మధ్య ఆధిపత్య పోరు నడవగా… ఇపుడు జనసేన ఎమ్మెల్యే రాకతో పార్టీ కార్యకర్తలలో నిరాశ నిస్పృహ ఏర్పడింది. ఇపుడు మంత్రులు సైతం వేరే పార్టీ నుండి గెలిచిన వ్యక్తికి ప్రాధాన్యతనిస్తూ స్వంత పార్టీ నాయకులను పట్టించుకోకపోవడం పట్ల కార్యకర్తల్లో నిరసన వ్యక్తమవుతోంది.
మూడు గ్రూపులుగా విడిపోయిన వైసిపిని, సమిష్టపర్చాల్సిన అధినాయకత్వం చర్యలు, పార్టీలో విభేదాలు సృష్టిస్తోంది. తాజా పరిణామాలతో వైసిపి ఆవిర్భావం నుంచి ఉన్న పార్టీ శ్రేణులు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో జనసేనకు వ్యతిరేకంగా పని చేసిన తాము, ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేతో కలిసి పని చేయలేమని అంటున్నారు. దీనితో రాజోలు వైసిపిలో సంక్షోభంలో పడింది. ఈ పరిణామాలు రానున్న రెండేళ్లలో ఎటువంటి పరిస్థితులకు దారీ తీస్తాయోనని వైసిపి శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.