తెలంగాణ శాసన మండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్, చీఫ్‌విప్ పోస్టులను ఒకేసారి భర్తీ చేస్తారని ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ.. గుత్తా సుఖేందర్‌రెడ్డి ఒక్కరినే మరోసారి ఛైర్మన్‌గా చేసి సరిపెట్టేశారు. డిప్యూటీ ఛైర్మన్, చీఫ్‌విప్ పదవుల ఉసే లేదు. శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ పోస్టు బీసీ సామాజికవర్గానికి దక్కుతుందని అప్పట్లో టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరిగింది. రేపో మాపో పేరు ప్రకటిస్తారని అనుకుంటూనే ఉన్నారు కానీ.. కొలిక్కి రావడం లేదు. దీంతో ఎందుకు భర్తీ చేయడం లేదు? పేరును ఎందుకు ప్రకటించడం లేదు? అనే ప్రశ్నలు చర్చగా మారాయి.
అధికార టీఆర్ఎస్‌కు తెలంగాణ శాసనమండలిలో ఏకపక్ష బలం ఉంది. మొత్తం 40 మంది ఎమ్మెల్సీలలో టీఆర్‌ఎస్ సభ్యులే 35 మంది. మిత్రపక్షం MIMకు ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఆ మధ్య గుత్తా పదవీకాలం పూర్తయిన తర్వాత ఇద్దరు ఎమ్మెల్సీలు శాసనమండలి ప్రొటెం ఛైర్మన్లుగా పనిచేశారు. వారిలో ఒకరు MIM ఎమ్మెల్సీ. గుత్తా మరోసారి ఎమ్మెల్సీ అయ్యాక తిరిగి అదే పోస్టులోకి వచ్చేశారు. ఆ తర్వాతే డిప్యూటీ ఛైర్మన్ పీఠంపై పీటముడి పడినట్టు చెబుతున్నారు. డిప్యూటీ ఛైర్మన్ పోస్టును MIM ఆశించిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ మేరకు అధికార టీఆర్‌ఎస్‌కు సంకేతాలు కూడా పంపినట్టు సమాచారం. అయితే అధికారపార్టీ సానుకూలంగా స్పందించలేదని తెలుస్తోంది. ఆ వ్యవహారం అంతటితో ఆగిపోయిందని చెబుతున్నా.. మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవి భర్తీ విషయంలో జాప్యానికి ఇంకేదో బలమైన కారణం ఉందని గులాబీ శిబిరంలో చెవులు కొరుకుడు ఎక్కువైంది. అదేంటన్నదే ప్రస్తుతం పార్టీ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఆ మధ్య రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాష్‌ను సడెన్‌గా ఎంపీ పదవికి రాజీనామా చేయించి ఎమ్మెల్సీని చేశారు. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన ఆయన్ని కేబినెట్‌లోకి తీసుకుంటారని ప్రచారం సాగింది. తర్వాత శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌ను చేస్తారని బలంగా ప్రచారం సాగింది. గుత్తాతోపాటే ఆయన పేరును ప్రకటిస్తారని.. ఇద్దరూ ఒకేసారి ప్రమాణ స్వీకారం చేసేస్తారని అనుకున్నారు. కానీ.. బండ ప్రకాష్ ఎమ్మెల్సీగానే మిగిలిపోయారు. అటు మిత్రపక్షం MIM కోరికను మన్నించక.. ఇటు ప్రచారంలో నలిగిన బండ ప్రకాష్ పేరును ప్రకటించక.. ఎందుకు జాప్యం చేస్తున్నారన్నదే ప్రశ్న. మరి.. ఆ కారణం ఏంటో… కాలమే చెప్పాలి.