BJP CM candidate : ఫ్లవర్ పార్టీలో ఫైరింగ్ ఎక్కువైందా? నేతల్లో ఫైర్.. దారి తప్పుతోందా? ఏ విషయం కొత్త చర్చకు.. రచ్చకు కారణం అవుతోంది? తాజాగా మరో నాయకుడిని జెండా ఎక్కించేశారా? అయ్యో.. బీజేపీలో అలాంటి సంస్కృతి లేదని వివరణ ఇచ్చినా బ్యాండ్ బాజా ఆగడం లేదా?
ఆలు లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిణామాలు ఉన్నాయి. ప్రస్తుతం బీజేపీకి ముగ్గురే ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఇద్దరు ఉపఎన్నికల్లో గెలిచిన వాళ్లే. 2018 ఎన్నికల్లో లింగు లిటుకుమంటూ ఒక్కచోటే గెలిచింది బీజేపీ. వందకు పైగా స్థానాల్లో డిపాజిట్ గల్లంతు. కానీ.. రెండేళ్లుగా రాష్ట్రంలో బీజేపీకి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయనేది కమలనాథుల మాట. GHMC ఎన్నికలు.. దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నిక సీన్ మార్చేసిందనే లెక్కల్లో ఉన్నారు. ఈ విషయంలో బీజేపీ అంచనాలు బీజేపీవే. వచ్చే ఎన్నికల్లో ఎన్నిచోట్ల బీజేపీ గెలుస్తుందో.. అధికారంలోకి వస్తుందో లేదో కాలమే చెప్పాలి. కానీ.. పార్టీలో అప్పుడే ముఖ్యమంత్రి ఎవరనే చర్చ జోరందుకుంది. గడికో మాటను.. పూటకో నేత పేరును చర్చల్లోకి పెట్టేస్తున్నారు కాషాయ శ్రేణులు.
అప్పట్లో సీఎం అభ్యర్థిగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేరు ఓ రేంజ్‌లో వినిపించేది. బీజేపీ నేతలు సైతం ఆయన్ని అదే కోణంలో చూసేవారు. బీజేపీ అధికారంలోకి వస్తే కిషన్‌రెడ్డి కాకుండా ఇంకెవరు సీఎం అవుతారు అనే స్వరాలు వినిపించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక కేడర్ టోన్ మారిపోయింది. కిషన్‌రెడ్డి కాదు.. బండి సంజయే బీజేపీ సీఎం అభ్యర్థి అని గొంతు సవరించుకున్నవాళ్లు ఎందరో. కిషన్‌రెడ్డిపైకానీ.. సంజయ్ విషయంలో కానీ.. సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. ఈ అంశంపై స్వయంగా ఇద్దరు నేతలు వివరణ ఇచ్చుకున్నప్పటికీ చర్చ ఆగలేదు.
బీజేపీలో సీఎం అభ్యర్థిపై జరుగుతున్న ప్రచారం ఇద్దరికే పరిమితం కాలేదు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేరునూ చర్చల్లోకి తీసుకొచ్చారు కొందరు. తాజాగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పేరు కాషాయ శిబిరంలో మార్మోగిపోతోంది. దీంతో బీజేపీ నేతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదట. సీఎం అభ్యర్థి అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఈటల ఖండించారు కూడా.
బీజేపీలో సీఎం అభ్యర్థి అనేది జాతీయ నాయకత్వం తేలుస్తుంది. అది రాష్ట్ర స్థాయిలో నిర్ణయం జరిగేది కాదు. ఆ సంగతి బీజేపీ నేతలకు స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ సీఎం అభ్యర్థి అంటూ జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడటం లేదు. ప్రచారంలో ఉన్న నేతలు ఖండిస్తున్నా.. చర్చ ఆగకపోవడమే సందేహాలకు తావిస్తోందట. పైకి ఒక మాట చెప్పి.. లోపల ఇంకేదైనా జరుగుతుందా అనే అనుమానాలు ఉన్నాయట. ఎవరైనా కావాలనే ఇలా చేస్తున్నారా? పోటీకి వచ్చే నేతలపై ప్రతికూల ప్రభావం పడేలా కుట్ర చేస్తున్నారా? ఢిల్లీకి ఎలాంటి సంకేతాలు పంపుతున్నారు? అధిష్ఠానం ఈ ప్రచారాన్ని ఎలా రిసీవ్ చూసుకుంటోంది? అనే ప్రశ్నలు బీజేపీ శిబిరాన్ని షేక్ చేస్తున్నాయి.
ఇప్పటికి నలుగురు పేర్లు చర్చల్లో పెట్టేశారు. తదుపరి ఎవరో.. ఏంటో తెలియదు కానీ.. ఇలాంటి ప్రచారాలతో బీజేపీకి మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుందని కమలనాథుల ఆందోళన. మరి.. ఈ రగడకు ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి.