హైదరాబాద్ పర్యటనలో ఆ జాతీయ పార్టీ ఇంఛార్జ్ ఏం చేశారు? రహస్యంగా ఎవరైనా కలిసి మాట్లాడారా? రాష్ట్ర పార్టీ నేతలకు కూడా తెలియకుండా చేయాల్సిన అంత సీక్రెట్ వ్యవహారాలేంటి? ఇంతకీ ఆయన ఎవరు? హైదరాబాద్‌లో రహస్యంగా ఏం చేశారు? లెట్స్ వాచ్…!
మాణిక్యం ఠాగూర్. AICC తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్. హైదరాబాద్‌కు వచ్చుడే తక్కువ. అలాంటిది తాజా పర్యటనలో పెద్ద రాజకీయ చర్చకు తెరతీశారు. ఆదివారం ఉదయం పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. రాజకీయ వ్యూహకర్త సునీల్‌తో కలిసి బయటకు వెళ్లారు ఠాగూర్. ఎక్కడికి వెళ్లారు? ఎవరితో భేటీ అయ్యారు అనేది రహస్యంగా ఉంచారట. దాంతో ఆ సీక్రెట్ ఏంటనే ఉత్కంఠ గాంధీభవన్ వర్గాల్లో పెరిగిపోతోంది.
కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్. ఇప్పటికే రెండు దఫాలుగా పార్టీ పరిస్థితిపై నియోజకవర్గాల వారీగా సర్వేలు చేస్తున్నారు. ఈ విషయంలో ఆయన ఓ అడుగు ముందుకేసి… ఏ నియోజకవర్గంలో ప్రత్యర్ధి పార్టీలలో బలమైన నాయకులు ఎవరనే లిస్ట్ తయారు చేశారట. ఆ జాబితాను రాహుల్ గాంధీకి అందజేసినట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే ఠాగూర్, రేవంత్ అడుగులు వేస్తున్నట్టు చెబుతున్నారు. అందుకే ఠాగూర్ పర్యటనల్లో సీక్రెట్ మీటింగ్‌లకు కొంత స్పేస్ ఇచ్చారట.
గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అలా ప్రచారంలో ఉన్న కొందరిని ఠాగూర్, రేవంత్‌లు రహస్యంగా కలిసి మాట్లాడినట్టు టాక్. అధికారపార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారట. వారిలో ఒకరు సిటీ ఎమ్మెల్యే కాగా.. ఇంకొకరు ఖమ్మం జిల్లాకు చెందిన శాసనసభ్యుడిగా తెలుస్తోంది. అధికార TRS నుంచి నాయకులు బయటకు రావడం మొదలుపెట్టారు అనే చర్చ తేవడంలో వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని చూస్తుంది కాంగ్రెస్. దాంట్లో భాగంగానే TRSకి చెందిన మేయర్‌లు.. ZP ఛైర్మన్లకు కాంగ్రెస్ కండువా కప్పేస్తోంది. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టినట్టు సందేహిస్తున్నారు.
టీఆర్ఎస్‌ని ఇరకాటంలోకి నెట్టడంతోపాటు.. బీజేపీని కూడా రాజకీయంగా దెబ్బతీయాలనే ప్లాన్‌లో ఉంది కాంగ్రెస్. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారితో కాంగ్రెస్ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. బీజేపీలో అసంతృప్తితో ఉన్న ఒకరిద్దరు నాయకులు కాంగ్రెస్‌తో టచ్‌లోకి వెళ్లినట్టు చెబుతున్నారు. ఠాగూర్ రహస్య భేటీలో ఒక బీజేపీ సీనియర్ నేతతో సమావేశమైనట్టు ప్రచారం జరుగుతోంది. వివరాలు ఎక్కడా లీక్ కాకుండా కాంగ్రెస్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. విషయం బయటకు వస్తే చేరికలు ఆగిపోతాయని ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణలో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే స్థాయి నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకోవాల్సి ఉన్నా.. భారీ వర్షాలతో బ్రేక్ పడింది. ఈ సమయంలో చేర్చుకుంటే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆగినట్టు సమాచారం. మరి.. ఠాగూర్ రహస్య సమావేశాలు పార్టీకి ఏ మేరకు వర్కవుట్ అవుతాయో.. ఎంతమంది కాంగ్రెస్ కండువా కప్పుకొంటారో చూడాలి.