హుజురాబాద్ ఉపఎన్నిక ప్రక్రియ ముగిశాక.. పాడి కౌశిక్‌రెడ్డికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ క్లియర్ అవుతుందా? టీఆర్ఎస్‌లో చేరినప్పటి నుంచి వెయిట్ చేస్తున్న ఆయన.. ఇంకా ఎదురు చూడాలా? పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి?
ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది.. తేలని కౌశిక్‌రెడ్డి పదవి..!
పాడి కౌశిక్‌రెడ్డి. 2018లో హుజురాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి. ప్రస్తుత ఉపఎన్నిక బ్యాక్‌డ్రాప్‌లో అనూహ్యంగా టీఆర్ఎస్‌లో చేరారు. గులాబీ కండువా కప్పుకొన్న రోజుల వ్యవధిలోనే ఎమ్మెల్సీని చేస్తున్నట్టు అధికారపార్టీ తీపి కబురు అందించింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కౌశిక్‌రెడ్డి పేరును రాష్ట్ర కేబినెట్‌లో ఆమోదించి రాజ్‌భవన్‌కు పంపించారు. ఈ నిర్ణయం అప్పట్లో పార్టీ వర్గాలతోపాటు.. పొలిటికల్ సర్కిళ్లలో చర్చకు దారితీసింది. అయితే రోజులు గడుస్తున్నా ఆ ఫైల్‌ను క్లియర్ చేయలేదు గవర్నర్. కేబినెట్ నిర్ణయం మేరకు కౌశిక్‌రెడ్డి పేరు క్లియర్ చేయాలని అడిగిన వారూ లేరు. ఉపఎన్నిక పోలింగ్‌కు ముందు ప్రకటన వస్తుందా రాదా అన్న చర్చ జరిగింది. ఇప్పుడు పోలింగ్ కూడా ముగిసింది.
ఉపఎన్నిక ఫలితం తర్వాత మోక్షం కలుగుతుందా?
విశేష సేవలు అందించిన వారికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని చేస్తారు. అలాంటి వారిని ఎంపిక చేయాలన్న చర్చ జరిగింది. ఇంతలో కౌశిక్‌రెడ్డి పేరు ప్రతిపాదించడంతో వాడీవేడీ చర్చకు దారితీసింది. ప్రస్తుతం కౌశిక్‌రెడ్డి ఫైల్ పరిశీలనలోనే ఆగిపోయింది. ఆ మధ్య గవర్నర్ సైతం అదే విషయాన్ని స్పష్టం చేశారు. నవంబర్ 2న హుజురాబాద్ ఫలితం వస్తుంది. ఆ తర్వాతైనా మోక్షం కలుగుతుందా లేదా అన్నది ఒక ప్రశ్న.
ఫలితం వచ్చాక కూడా దోబూచులాట తప్పదా?
హోరాహోరీగా సాగిన హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితం పాడి కౌశిక్‌రెడ్డి రాజకీయ భవిష్యత్‌ను తేల్చనుందని తాజాగా చర్చ మొదలైంది. ఆ ఫలితం ఆధారంగానే ఎమ్మెల్సీపైనా స్పష్టత రావొచ్చని టీఆర్ఎస్ వర్గాలు అనుకుంటున్నాయి. దాంతో బరిలో ఉన్న గెల్లు శ్రీనివాస్ కంటే.. ఎక్కువ టెన్షన్లో కౌశిక్‌రెడ్డి ఉన్నట్టు చెవులు కొరుక్కుంటున్నారు. హుజురాబాద్ ఫలితం వచ్చాక కూడా పదవి దోబూచులాడుతుందా లేక కొత్త పేరు తెరపైకి వస్తుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కొత్త వారికి ఛాన్స్ ఇస్తే కౌశిక్‌రెడ్డి సంగతి ఏంటన్నది చర్చే. మరి.. ఏం జరుగుతుందో.. కౌశిక్‌రెడ్డి పొలిటికల్ ఫేట్ ఎలా ఉందో కాలమే చెప్పాలి.