విజయనగరం వైసీపీలో బీసీ నినాదం హోరెత్తుతోంది. వరుసగా గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగానే..ఈ సారి సీటు బీసీలకే అనే నినాదంతో వైసీపీ నతేలు చేస్తున్న డిమాండ్…హాట్‌టాపిక్‌గా మారింది. బీసీలు సీట్లు అడగటం మాములే కానీ బీసీలకే స్లోగన్ వెనుక పార్టీ సీనియర్ ఉండటమే ఇక్కడ హైలెట్.
విజయనగరం జిల్లాలో ప్రస్తుత రాజకీయాలు హాట్ హాట్‌గా ఉన్నాయట. విజయనగరం నియోజకవర్గ వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఆర్యవైశ్య వర్గానికి చెందిన ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి వర్సెస్ నియోజకవర్గ బిసి నేతలుగా వైసీపీ విడిపోయింది. తమ వర్గానికే వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే సీటును కేటాయించాలని గత మూడు నెలలుగా బిసి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏ కార్యక్రమం చేపట్టిన బిసి నినాదంతోనే చేస్తున్నారు. మాములుగా అయితే ఇదంతా రాజ్యాధికారం కోసం బీసీల డిమాండ్‌గా భావించవచ్చు. కానీ ఈ బీసీ నినాదానికి కర్త , కర్మ, క్రియగా వ్యవహరించేది మాత్రం జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ ప్రధాన అనుచరుడు కావడంతో నియోజకవర్గ వైసీపీ లో హాట్ టాపిక్ గా మారిందట. బొత్స అనుచరులు విజయకుమార్, అవనాపు విజయ్ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించడంతో నియోజకవర్గ వైసీపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయట. సొంతపార్టీకి చెందిన ఎమ్మెల్యేపై వ్యతిరేక గళం వినిపించడంతో తనకి ఎదురు లేదనుకున్న కోలగట్లకు బిసి స్లోగన్ తలపోటుగా మారిందట.
ఏ పదవి లేని వ్యక్తులే తనకు వ్యతిరేకంగా గళం విప్పి గందరగోళం చేస్తుంటే…తాను మాత్రం ఏమైనా తక్కువ అంటూ డిప్యూటీ స్పీకర్ హోదాలో కోలగట్ల ఎవరికి ఇవ్వాల్సిన కౌంటర్ వాళ్లకు ఇచ్చేస్తున్నారట. ఎవరు ఎన్ని కుప్పిగంతులు వేసినా నియోజకవర్గ వైసీపీ టికెట్ తనకేనంటూ బహిరంగానే చెప్తున్నారట. అది కూడా తనకు వ్యతిరేకంగా గళం వినిపించే అనుచరులకు…. బాస్ గా ఉన్న బొత్స ముందే సవాలు చేశారట. విజయనగరం సీటు తనదేనని, ఒకవేళ తాను కాకుంటే తన కుమార్తె కోలగట్ల శ్రావణిని రంగంలోకి దించుతానని వేరే వారికి ఛాన్స్ రానివ్వబోనని తెగేసి చెప్తున్నారట.
వైసీపీలో జరుగుతున్న పరిణామాలకు ఈ ప్లీనరీయే సరైన వేదిక అనుకున్నారేమో గాని అందరి ముందు వ్యతిరేక వర్గానికి ముందు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారట. బీసీ నినాదాన్ని తెర మీదకు తెచ్చిన వైసీపీ నేతలు…బొత్స అనుచరులు కావడంతో పనిలో పనిగా ఆయనకు కూడా తన వైఖరి ఏంటో అర్ధమయ్యేలా హెచ్చరికలు చేశారట. బిసి నినాదాన్ని మానుకోవాలని లేకపోతే ఒకప్పుడు తన వ్యతిరేక వర్గానికి పట్టిన గతే… తమకు పడుతుందంటూ వార్నింగ్ ఇచ్చారట.
బొత్స సత్యనారాయణ కోలగట్ల వీరభద్ర స్వామి మధ్య విభేదాలు…కాంగ్రెస్ హయాం నుంచే ఉండేవి.అయితే వైసీపీలో చేరాక…ఇద్దరు కలిసి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అయిష్ఠంగానో లేక పార్టీ ఆదేశాలు మేరకో గాని కలిసి ముందుకు సాగుతున్నారు. వీరి చూసి…వీళ్ల మధ్య పాతగొడవలు పోయాయని అంతా అనుకున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ బిసి నేతలకే టికెట్ కేటాయించాలని జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్న జ్యోతి రావు పూలే విగ్రహం వద్ద నిరసన తెలిపారు.
తమ వర్గానికి కాకుండా కోలగట్లకు టికెట్ ఇస్తే మాత్రం పార్టీ ని ఒడిస్తామని కూడా హెచ్చరించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు, బొత్స పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన బిసి నేతలు….కోలగట్లను మాత్రం వదలడం లేదు. ఇవే కాకుండా నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన ఏ కార్యక్రమం అయినా కోలగట్ల వర్సస్ బిసి నేతల అనే రెండు వర్గాలుగా విడిపోయి చేస్తున్నారు. విజయనగరం నియోజకవర్గం వైసీపీ లో బీసీ చిచ్చు రాజుకుంది.
ఓసీ వర్సెస్ బీసీ వర్గాలు…కోలగట్ల వర్సెస్ బొత్స వర్గపోరు కొనసాగడం కేడర్‌ను కలవర పెడుతోంది. చూస్తూ ఊరుకుంటే అసలుకే ఎసరు వస్తుందని అనుకున్నారేమో…కౌంటర్ స్టార్ట్ చేశారు కోలగట్ల.