టీఆర్ఎస్ ప్లీనరీ కేడర్‌లో జోష్ తీసుకొస్తే.. కొన్ని జిల్లాల్లో అసంతృప్త జ్వాలలను రాజేసింది. ఆహ్వానాల విషయంలో వివక్ష చూపించారని మంత్రిపై చింతనిప్పులు తొక్కుతున్నారు నేతలు. ఎవరా మంత్రి? ఏంటా జిల్లా?
ప్లీనరీ పాస్‌లపై మేడ్చల్ టీఆర్ఎస్‌లో రగడ..!
టీఆర్ఎస్ ప్లీనరీకి మేడ్చల్ జిల్లా నుంచి 200 మంది ముఖ్యనేతలకు పాసులు జారీ చేశారు తెలంగాణ భవన్ సిబ్బంది. జిల్లాలో పీర్జాదిగుడా, బోడుప్పల్, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. ప్లీనరీకి వార్డు కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు కూడా పాసులు ఇచ్చారు. పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులకు ఇవ్వలేదు. ఇందులో మంత్రి మల్లారెడ్డి హస్తం ఉందని టీఆర్ఎస్ నేతల ఆరోపణ. ప్లీనరీకి రాకుండా అడ్డుకోవడమే కాకుండా.. తమను అవమానించారని వారు రుసరుసలాడుతున్నారు. కుటుంబ సభ్యులకు, బంధువులకు ఇష్టానుసారంగా మంత్రి పాసులు ఇప్పించుకున్నారని ఆరోపిస్తున్నారు నేతలు. ఇదే ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.
మంత్రి సమక్షంలోనే నేతల కామెంట్స్..!
మేడ్చల్ టీఆర్ఎస్ నేతల విబేధాలు ఇటీవల కార్యకర్తల విస్తృతస్థాయి మీటింగ్‌లో బయట పడ్డాయి. తనను సంప్రదించకుండా ఎవరికి వారే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని పీర్జాదిగూడ టీఆర్ఎస్ అధ్యక్షుడు దర్గా దయాకర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. మంత్రి మల్లారెడ్డి, కార్పొరేషన్ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ బుర్ర శివకుమార్ గౌడ్ సమక్షంలోనే ఆయన ఈ కామెంట్స్ చేయడంతో వాతావరణం వేడెక్కింది. ప్లీనరీకి పాస్ కూడా ఇవ్వకుండా మరింత క్షోభ పెట్టారని ఆవేదన వ్యక్తంచేశారు. మంత్రి మల్లారెడ్డి వారించినా ఆయన ఆగలేదు. నోరు నొక్కాలంటే కుదరదు.. పార్టీలో ఉండమంటే ఉంటాం.. వొద్దంటే మీ కాళ్లు మొక్కి వెళ్లిపోతానని ముఖం మీదే చెప్పేశారట. అలిగి అక్కడ నుంచి వెళ్లిపోయారు.
మల్లారెడ్డి తీరుతో పార్టీకి దూరంగా నేతలు..!
మంత్రి మల్లారెడ్డి తీరు నచ్చక కొందరు నేతలు పార్టీకి దూరంగా ఉంటున్నారని టీఆర్ఎస్‌లో టాక్. అయితే టీఆర్ఎస్‌లో ఉంటూ ఇతర పార్టీలకు కోవర్టులుగా పని చేస్తున్న కొందరు.. మంత్రిని ఇరకాటంలో పెడుతున్నారని మల్లారెడ్డి అనుచరులు కౌంటర్ ఇస్తున్నారు. టీఆర్ఎస్‌ను వీడేందుకు సిద్ధమై.. ఇతర పార్టీల్లో కర్చీఫ్ వేసుకున్న వారే అసంతృప్తిగా ఉన్నారని వారి వాదన. అయితే పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలతో మంత్రి మల్లారెడ్డి చలి కాచుకుంటున్నారనే విమర్శలు పెరుగుతున్నాయి. మరి..ఈ రగడ పార్టీ పెద్దల దృష్టికి వెళ్లిందో లేదో చూడాలి.