మేడ్చల్ జిల్లా టీఆర్‌ఎస్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మంత్రి మల్లారెడ్డి పేరు చెబితేనే పార్టీ శ్రేణులు విరుచుకుపడుతున్నాయి. మల్లారెడ్డి ఇలాకాలోనే కొందరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కలిపి మొత్తం 8 మంది టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పేశారు. వారి రాజీనామాల అంశం ఇప్పుడు స్థానికంగా సెగలు రేపుతోంది.
మంత్రి అవమానిస్తున్నారని ఆరోపణలు..!
జిల్లాలోని కీసర టీఆర్ఎస్‌లో నేతల మధ్య ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి. అవి తాజాగా భగ్గుమనడంతో రాజీనామాల వరకు వెళ్లింది. యాదర్‌పల్లి ఉప సర్పంచ్ సహా 8మంది వార్డు సభ్యులు టీఆర్‌ఎస్‌కు రిజైన్ చేశారు. దీంతో అక్కడేం జరుగుతుంది అని అంతా ఆరా తీస్తున్నారట. కీసరలో ఎలాంటి కార్యక్రమాలు జరిగినా పార్టీ నుంచి సమాచారం ఇవ్వడం లేదన్నది రాజీనామా చేసిన వారి ఆరోపణ. తమ ప్రాంతానికి మంత్రి వస్తున్నా చెప్పడం లేదని.. ఇది రాజకీయంగా తమను అవమానించడమేనని వారి వాదన.
మండల స్థాయిలో గ్రూపులను ప్రోత్సహిస్తున్నారట..!
జిల్లా టీఆర్‌ఎస్‌లో రెండు, మూడు గ్రూపులను మంత్రి మల్లారెడ్డే ప్రోత్సహిస్తున్నారని పార్టీ వర్గాలు మండిపడుతున్నాయి. ఇది కేవలం కీసర మండలానికే పరిమితం కాలేదని.. జిల్లాలోని మెజారిటీ మండలాల్లో టీఆర్‌ఎస్‌లో వర్గపోరు ఉందని చెబుతున్నారు. స్థానిక నాయకులను గ్రూపులుగా విభజించి రాజకీయాలు చేస్తున్నట్టు కొందరు గుర్రుగా ఉన్నారు. ఈ పరిణామాల వల్ల ప్రత్యర్థి పార్టీల ముందు చులకన అవుతున్నామని అధికారపార్టీ కేడర్ ఆవేదన. కిందిస్థాయి కార్యకర్త కూడా నేరుగా తనతోనే టచ్‌లో ఉండాలని మంత్రి మల్లారెడ్డి ఈ విధంగా విభజించి పాలిస్తున్నారని ఫైర్ అవుతున్నారు నాయకులు.
మరికొందరు మంత్రిపై ఫైర్ కావడానికి సిద్ధంగా ఉన్నారా?
ప్రస్తుతం 8 మందే బయటపడినా.. మరికొందరు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నట్టు చెబుతున్నారు. వాళ్లంతా సరైన టైమ్ కోసం ఎదురు చూస్తున్నారట. ఒకవైపు జిల్లాలో కాంగ్రెస్, బీజేపీలు యాక్టివిటీస్ జోరు పెంచిన క్రమంలో పార్టీ కేడర్‌ను మంత్రి మల్లారెడ్డి నిర్వీర్యం చేస్తే ఎలా అన్నది గులాబీ శ్రేణుల ప్రశ్న. ఇప్పటికే జిల్లాలో జరుగుతున్న వ్యవహారాలను కొందరు పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారట. అక్కడ నుంచి స్పందన లేకపోవడంతో.. కేడర్ రాజీనామాల దిశగా కదులుతున్నట్టు సమాచారం. మంత్రి మల్లారెడ్డి బృందం మాత్రం జరుగుతున్న పరిణామాలను లైట్ తీసుకుంటోందట. వ్యతిరేకవర్గమే పార్టీని వీడి బయటకెళ్లిపోతోందని.. పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారట. మరి.. రానున్న రోజుల్లో మేడ్చల్ జిల్లా టీఆర్‌ఎస్ రాజకీయాలు ఇంకెలా బరస్ట్ అవుతాయో చూడాలి.