తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నతాధికారుల బదిలీలపై ఆరోపణలు వస్తున్నాయి. ప్రక్షాళన పేరుతో అనర్హులను అందలం ఎక్కించారని మండిపడుతున్నారు వైద్యాధికారులు. ఏళ్లుగా పని చేయకుండా ఉన్న సీనియర్లను తప్పించేందుకు ఆకస్మిక బదిలీలు చేపట్టారనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్రంలో ముగ్గురు జిల్లా వైద్యాధికారులను బదిలీ చేసింది. మేడ్చల్ జిల్లా DMHO డాక్టర్ మల్లికార్జున్‌ను యాదాద్రి భువనగిరి జిల్లాకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో డిప్యూటీ సివిల్ సర్జన్‌గా పనిజేస్తున్న డాక్టర్ పుట్ల శ్రీనివాసుకు DMHOగా పోస్టింగ్ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా DMHO డాక్టర్ సాంబశివరావును హన్మకొండ జిల్లాకు బదిలీ చేశారు. అక్కడున్న లలితాదేవిని తప్పించారు. వీటిల్లో మేడ్చల్ DMHO బదిలీ వెనక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. పుట్ల శ్రీనివాస్‌కు అర్హత లేకపోయినా పోస్టింగ్ ఇచ్చారని చెబుతున్నారు. నిబంధనల ప్రకారం సివిల్ సర్జన్స్‌కు మాత్రమే DMHOగా బాధ్యతలు అప్పగించాలి. శ్రీనివాస్ డిప్యూటీ సివిల్ సర్జన్‌గానే ఉన్నారు.
ఇక యాదాద్రి DMHO సాంబశివరావు చేసుకున్న విజ్ఞప్తి మేరకే బదిలీ జరిగినట్టు తెలుస్తోంది. అలాగే పని ఒత్తిడి వల్ల ఆ బాధ్యతల నుంచి తప్పించాలని లలితాదేవి కోరినట్టు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా వైద్యాధికారిగా పనిచేస్తున్న వెంకటికి అర్హతలు లేకపోయినా ఓ సీనియర్ IAS రెఫరెన్స్‌తో వచ్చారని వైద్యవర్గాల వాదన. జనగామ, ఖమ్మం, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల వైద్యాధికారుల పరిస్థితి కూడా ఇలాంటిదేనట. న్యాయంగా తమకు రావాల్సిన ప్రమోషన్ ఇవ్వకుండా జూనియర్లకు ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట సీనియర్లు. 2017 నుంచి ఇదే తంతు జరుగుతోందని.. ఈ విషయంలో కొందరు IASలు ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
త్వరలో మరో నాలుగైదు జిల్లాల DMHOలను మారుస్తారని టాక్. ఏళ్లుగా జిల్లాల్లో పాతుకుపోయి.. ఒక్క పనీ చేయని వారికి చెక్ పెడతారని అనుకుంటున్నారు. బాగా పనిచేసే ఒకరిద్దరిని రాష్ట్ర స్థాయిలో జాతీయ ఆరోగ్య మిషన్ ప్రోగ్రామ్ ఆఫీసర్లుగా నియమిస్తారట. కాకపోతే చాలా జిల్లాల్లో జూనియర్లకు పట్టం కట్టడమే వైద్యవర్గాల్లో కలకలం రేపుతోంది. హైదరాబాద్, సంగారెడ్డి, నల్లగొండ, జనగామ, నిర్మల్, భూపాలపల్లి, ఆసిఫాబాద్ జిల్లాల పోస్టింగ్‌లను ఉదహరిస్తున్నారు. ముఖ్యంగా వైద్యశాఖలో కీలకంగా ఉన్న ఒక వ్యక్తి తన అనుచరులను అందలం ఎక్కిస్తున్నారని చెవులు కొరుక్కుంటున్నారు. తాజా బదిలీలు.. పోస్టింగ్‌లతో వైద్యశాఖలో సీనియర్లు, జూనియర్ల మధ్య స్పష్టమైన విభజన వచ్చేసింది. ఎవరు ఎలా నిచ్చెన ఎక్కేస్తారో తెలియడం లేదు. అందుకే ఈ అంశంపై గుర్రుగా ఉన్న సీనియర్లు న్యాయం కోసం ఏం చేయాలా అని సమాలోచనలు చేస్తున్నారట. ప్రక్షాళన అంటే సీనియర్లను తొక్కేయడమేనా అనేది సీనియర్ల ప్రశ్న. మరి.. ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం సూచిస్తారో చూడాలి.
Watch Here : https://youtu.be/iSt-lx2XPEU