వరసగా ఏసీబీ దాడులు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ అన్నట్టుగా విమర్శలు. వీటికి చెక్ పెట్టే పనిలో పడింది తెలంగాణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ. ఏకంగా సబ్ రిజిస్ట్రార్లకే కౌన్సిలింగ్ ఇచ్చే పనిలో ఉన్నట్టు సమాచారం. ఈ సందర్భంగా ప్రత్యేకంగా నిఘా పెట్టారని ప్రచారం జరుగుతోంది. అందుకే నీడ కనిపించినా ఉలిక్కి పడుతున్నారట అధికారులు, సిబ్బంది.
నెల రోజుల వ్యవధిలోనే ఏసీబీకి చిక్కిన ముగ్గురు అధికారులు..!
మామూళ్లు ఇస్తే కానీ.. సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో పనులు జరగవనే ఆరోపణలు ఉన్నాయి. లేఖర్లు మొదలుకొని.. ఎస్‌ఆర్వోలు, క్రిందిస్థాయి సిబ్బంది ఒక జట్టుగా ఉండి.. రిజిస్ట్రేషన్లకు వచ్చేవారిని పిండేస్తారని కథలు కథలుగా చెప్పుకొంటారు. ఈ అవినీతికి చెక్ పెట్టేందుకు ఇటీవల కాలంలో ACB వరసగా మెరుపు దాడులు చేస్తోంది. నెల రోజుల వ్యవధిలోనే ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లు లంచం తీసుకుంటూ ACBకి దొరికిపోయారు. యాదగిరిగుట్ట, బాలానగర్, రాజేంద్రనగర్ పరిధిలో జరిగిన ACB దాడుల్లో డాక్యుమెంట్ రైటర్లు మిడిల్ మ్యాన్లుగా ఉన్నట్టు గుర్తించారు.
అధికారులు, సిబ్బందికి ఐజీ వార్నింగ్..!
భువనగిరి, మంచిర్యాల, లక్సెట్టిపేట పరిధిలో అర్ధరాత్రి వరకు నిబంధనలకు విరుద్ధంగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు చేయడంతో అక్కడి సబ్ రిజిస్ట్రార్లు సస్పెండ్ అయ్యారు. ఈ వ్యవహారాలపై రిజిస్ట్రేషన్ శాఖ సీరియస్‌గా ఉంది. అధికారులు తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని రిజిస్ట్రేషన్ శాఖ IG శేషాద్రి వార్నింగ్ ఇచ్చారట. SROలు, DIGల జూమ్ సమావేశంలో గట్టిగానే క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. పనిచేయకపోయినా.. పని చేతకాకపోతే లీవ్‌లో వెళ్లాలని IG వార్నింగ్ ఇచ్చారట. ప్రస్తుతం ట్రాన్స్‌ఫర్లు బ్యాన్ చేయడంతో ఆరోపణలు వచ్చిన అధికారులను నాన్ ఫోకల్ పాయింట్లలోకి మారుస్తామని హెచ్చరించారు.
నీడను చూసి భయపడుతున్నారా?
డాక్యుమెంట్ రైటర్లను ప్రోత్సహించొద్దని.. ఒకే చోట సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న సబ్ రిజిస్ట్రార్లు, ఆఫీస్ స్టాప్‌పై ప్రత్యేక నిఘా పెడతామని హెచ్చరించారట IG. అంతేకాదు.. ప్రతి వారం డిస్ట్రిక్ట్ రిజిస్టర్లు, డీఐజీలు.. సబ్ రిజిస్టర్ కార్యాలయాలను విజిట్ చేసి.. రిపోర్ట్ పంపాలని ఆయన ఆదేశించారు. ఈ చర్యలు ఫలించాయో లేక అధికారులు ఆందోళన చెందుతున్నారో కానీ.. నీడను కూడా చూసి భయపడుతున్నట్టు సమాచారం. అవినీతి ఆరోపణలు ఉన్న అధికారుల జాబితా ఐజీ దగ్గరకు వెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో ఎప్పుడు ఎవరిపై వేటు పడుతుందోనని టెన్షన్ పడుతున్నారట. కొత్త వారు కనిపిస్తే ఉలిక్కి పడుతున్నట్టు తెలుస్తోంది. అవినీతికి అలవాటు పడిన అధికారులు ఎన్నాళ్లిలా కట్టడితో ఉంటారో.. నిజంగానే IG చర్యలు చేపడతారో చూడాలి.