తెలంగాణలో మరో ఉప ఎన్నిక కోసం బీఆర్‌ఎస్ ఇప్పట్నుంచే అభ్యర్థిని సిద్ధం చేస్తోందా? జూబ్లీహిల్స్‌లో తగిలిన దెబ్బ పునరావృతం అవకుండా ఇప్పటి నుంచి జాగ్రత్తపడుతోందా? ఒకవేళ ఉప ఎన్నిక జరిగితే….అభ్యర్థి ఎవరో ఆల్రెడీ డిసైడ్ చేసేసిందా? బైపోల్ గ్యారంటీ అనుకుంటున్న ఆ నియోజకవర్గం ఏది? ఇంత ముందుగానే పార్టీ అధిష్టానం దృష్టిలో పడ్డ ఆ నాయకుడు ఎవరు?.
జూబ్లీహిల్స్ తర్వాత తెలంగాణలో ఉప ఎన్నిక జరగడానికి గట్టి అవకాశాలున్న వాటిలో ఖైరతాబాద్ ముందు వరుసలో ఉంది. 2023లో ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరపున గెలిచిన దానం నాగేందర్ తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అంతకు మించి ఆ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారాయన. ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండానే మరో పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడంతో ఫిరాయింపుల చట్టం ప్రకారం దానం నాగేందర్ మీద కచ్చితంగా అనర్హత వేటు పడుతుందన్న అంచనాలున్నాయి. అటు దానం కూడా వేటుకంటే ముందే రాజీనామా చేసి ఉప ఎన్నికను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన వేరే నియోజకవర్గాల సంగతి ఎలా ఉన్నా… ఖైరతాబాద్‌లో మాత్రం కచ్చితంగా ఉప ఎన్నిక జరుగుతుందని అంటున్నారు. ఈ క్రమంలోనే… జూబ్లీహిల్స్‌లో దారుణంగా దెబ్బతిని సిట్టింగ్ సీటు కోల్పోయిన బీఆర్‌ఎస్… ఖైరతాబాద్ మీద ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. అందుకోసం ఉమ్మడి ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన విష్ణువర్ధన్ రెడ్డి వైపు గులాబీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.
Also Read: IND vs SA: రెండో టెస్ట్‌కు శుభ్‌మాన్ గిల్ దూరమైతే.. నంబర్ 4 స్థానంలో ఎవరు ఆడతారు?
ఖైరతాబాద్ కాంగ్రెస్‌లో ప్రస్తుతం దానం నాగేందర్ స్ట్రాంగ్ లీడర్‌గా ఉన్నారు. ఉప ఎన్నిక జరిగినా… పార్టీ ఆయనకే టిక్కెట్ ఇస్తుందనడంలో డౌట్ లేదు. అందుకే ఆయన్ని దీటుగా ఎదుర్కొనే నేతకు టికెట్ ఇవ్వాలని భావిస్తోందట బీఆర్ఎస్. ఆ క్రమంలోనే పీజేఆర్ కొడుకు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి పేరు ఫైనల్ కావచ్చని అంటున్నారు. గతంలో పీజేఆర్ ఉమ్మడి ఖైరతాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నారు. ఇక్కడ ఇప్పటికీ ఆయన అభిమానులున్నారు. పీజేఆర్ చనిపోయాక అదే ఉమ్మడి ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు విష్ణువర్ధన్ రెడ్డి. మొన్నటి 2023 ఎన్నికలకు ముందు వరకు కాంగ్రెస్‌లో ఉన్నా చివరి నిమిషంలో బీఆర్ఎస్ గూటికి చేరారు విష్ణు. అంతకు ముందు 2009 నుంచి 2014 వరకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి. దీంతో మొన్నటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆయన కూడా టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. ఇప్పుడు అన్నిటినీ బేరీజు వేసుకుని ఖైరతాబాద్ ఉప ఎన్నిక జరిగితే… తమ అభ్యర్థిగా విష్ణువర్ధన్‌రెడ్డినే బరిలో దింపాలని కారు పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. పీజెఆర్ వారసత్వం, నియోజకవర్గం మీద కొంత పట్టు ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి అయితేనే ఖైరతాబాద్‌లో దానం నాగేందర్‌ని గట్టిగా ఎదుర్కొంటారని బీఆర్‌ఎస్ అధిష్టానం గట్టిగా భావిస్తున్నట్టు తెలుస్తోంది.