ఇటీవల అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలోనూ అస్సాం నిలబెట్టుకోవడం తప్ప మరెక్కడా గెలవలేకపోవడం, మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌పై ఎంతగా కేంద్రీకరించినా మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించడం బిజెపి దూకుడుకు పగ్గాలు వేసింది. ఇదే సమయంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విస్తరించడం, వాక్సిన్ సరఫరాలో తీవ్ర కొరత కూడా కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై అసంతృప్తి పెరగడానికి కారణమైనాయి. మోడీ పాలన ఏడో వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలన్న బిజెపి ఆలోచనలు అమలు కాకపోగా పెరిగిన అసంతృప్తిని అదుపు చేయడానికి ఆరెస్సెస్ అధినేతలతో సహా రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలో వచ్చే ఏడాది రానున్న యుపి ఎన్నికలు బిజెపికి పెద్ద సంకటంగా తయారైనాయి. యుపిలోకోవిడ్ తాకిడి తీవ్రంగా వుండటమే గాక గంగానదిలో శవాలు తేలడం వంటి వార్తలు మరింత ఇబ్బందికరంగా మారాయి. యుపిలో నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు మరణించారు. రెవెన్యూ పశ్చిమ లక్నో ఎమ్మెల్యే సురేష్ శ్రీవాత్సవ, రాయ్ బరేలి ఎమ్మెల్యే దల్‌బహుదూర్ కోరి, అరూలియా ఎమ్మెల్యే రమేష్ దినకర్, బరైలీ ఎమ్మెల్సీ కేర్‌సింగ్ ఇలా వరుసపెట్టి కోవిడ్‌కు బలైపోయారు. తనే పాజిటివ్‌కు గురైన ఫిరోజాబాద్ ఎమ్మెల్యే పప్పులోధి భార్యను చేర్పించాలంటే ఆస్పత్రి దొరక్క మూడు గంటలు నిరీక్షించవలసి వచ్చిందట. వీరంతా ఎందుకు? కేంద్ర మంత్రి సంతోష్‌గ్యాంగ్‌వర్ తన నియోజకవర్గమైన బరైలీలో కోవిడ్ సదుపాయాలే లేవని ముఖ్యమంత్రియోగికి లేఖ రాయాల్సి వచ్చింది. రాష్ట్ర మంత్రులు కూడా ఇలాగే మొరపెట్టుకున్నారు. ఒకవైపున ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చాలా సమర్థంగా కోవిడ్‌ను ఎదుర్కొన్నారని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారికి కూడా సహాయం అందించారని అనుకూలులు ప్రశంసలు కురిపిస్తుంటే ఈ భయానకమైన వాస్తవాలు దాగని సత్యాలుగా తయారైనాయి. పంచాయితీ ఎన్నికల్లోనూ పాలకపక్షం బాగా నష్టపోయింది. ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహించే వారణాసి ప్రాంతంలోనూ సమాజ్‌వాది పార్టీ అత్యధిక విజయాలు సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో యుపిని నిలబెట్టుకుంటే తప్ప పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఎదురుదెబ్బ తప్పదని బిజెపి ఆరెస్సెస్ నాయకత్వం నిర్ధారణకు వచ్చింది. అప్పటి నుంచి యుపిలోవరుసగా సమీక్షలు అంచనాలు పెరిగాయి.
మోడీ సమర్థనకు ఆరెస్సెస్ అధినేత భగవత్ రంగంలోకి దిగినట్టే ఆయన తర్వాతి స్థానంలో సర్‌కార్యవాప్‌గా వున్న దత్తాత్రేయ హొసబ్లే ఆదిత్యనాథ్‌కు అండగా రావాల్సి వచ్చింది. ఆయన యుపిలో పర్యటించి సూచనలు చేసి వెళ్లారు, తర్వాత బిజెపికీ కేంద్రానికి నాయకత్వం వహిస్తున్న అగ్రనేతలతో సమావేశమైనారు. తర్వాత ఆ పార్టీ సంస్థాగతవ్యవహారాల కార్యదర్శి సంతోష్‌సింగ్ లక్నో వచ్చి మంత్రులు స్పీకర్‌లతో సమావేశమైనారు. ఆ తర్వాత దశలో బిజెపి యుపి ఇన్‌ఛార్జి రాధామోహన్ సింగ్ పర్యటించి గవర్నర్ ఆనందీబెన్‌తోనూ భేటీ అయ్యారు. ప్రధాని మోడీ సూచించిన అరవింద్ శర్మను ఎంఎల్‌సిని చేయడానికి అంగీకరించారు గాని మంత్రిని ఉప ముఖ్యమంత్రిని చేయడానికి యోగి ఒప్పుకోవడం లేదని కూడా కథనాలున్నాయి. ఇప్పటికే రాజేంద్రశర్మ, గోయోల్ అని ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా వున్నారు. వారిలో గోయెల్ స్థానంలో అరవింద్‌శర్మను తీసుకోవాలన్నది మోడీ ఆలోచన కాగా సామాజిక సమీకరణల రీత్యా కావాలంటే ఒక శర్మను తప్పించి మరో శర్మను తీసుకుంటాననియోగి అంటున్నారట. మిగిలిన సమస్యలతోపాటు ఈ విభేదాలు కూడా ఇంతమంది జాతీయ నాయకుల యుపి పర్యటనలకు కారణమనిభావిస్తున్నారు. గవర్నర్‌ను కలిసిన రాధామోహన్‌సింగ్‌ను మంత్రివర్గంలో మార్పులేమైనా వుంటాయా అని అడిగితే ఆ ప్రస్తావనలేదని దాటేశారు. అయితే వీరంతా కూడా యోగి నాయకత్వంలో యుపి ప్రభుత్వం గొప్పగా పనిచేస్తుందని పొగిడి వెళ్లారు.
యోగిని మార్చే ఆలోచన ఆరెస్సెస్ నేతలకు లేకపోగా మోడీపైన అసంతృప్తిపెరిగితే పరిశీలనకు వచ్చే పేర్లలో ఆయన ముఖ్యుడని భావిస్తున్నారు. చాలా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు బిజెపిని రాకుండాచేస్తున్నప్పటికీ హిందీ రాష్ట్రాల్లో మాత్రం ఆ పరిస్థితిరాదని వారి అంచనాగా వుంది. పార్లమెంటు ఎన్నికల్లోనూ ఆ పార్టీకి ఎక్కువ స్థానాలు ఇక్కడ నుంచే వచ్చాయి. అందులోనూ దేశంలో పెద్ద రాష్ట్రమైన యుపిలో ముస్లింలు పెద్ద సంఖ్యలో వున్నా అయోధ్య వివాదం తర్వాత హిందూత్వ రాజకీయం పెరుగుతూ వచ్చింది, యోగి నాయకత్వంలో ఇది మరింత బలోపేతమైందనీ, రామమందిర నిర్మాణానికి సుప్రీం తీర్పుతో జరుగుతున్న సన్నాహాలు బిజెపికి ఎన్నికల్లో మేలు చేస్తాయని కూడా వారు భావిస్తున్నారు. రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలైన సమాజ్‌వాది, బీఎస్పీలు కలసి పోటీచేసే అవకాశం లేదు గనక బెంగాల్, ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు, ఒరిస్సా వంటి రాష్ట్రాల పరిస్థితికి యూపీ భిన్నంగా వుంటుందని సంఘ పరివార్ వ్యూహకర్తలు ఆశపడుతున్నారు. ఆ క్రమంలో సాగుతున్న ఈ పర్యటనలూ పరిణామ క్రమం ఎలా ముగిసేది తొందరలోనే స్పష్టమవుతుంది. కాని ఎన్నికల సన్నివేశం ఎలా వుండేది అప్పుడే చెప్పడం కష్టం.