కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం. టీడీపీ అంచనాలకు అందని సెగ్మెంట్లలో ఇదొకటి. ఎక్కువసార్లు కాంగ్రెస్ గెలిస్తే. తర్వాత వైసీపీ పాగా వేసింది. గతంలో టీడీపీ నుంచి బసప్ప, రంగయ్య, మసాలా ఈరన్నలు ఎమ్మెల్యేలుగా చేశారు. 2009 వరకు ఆలూరు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. అప్పట్లో కోట్ల విజయభాస్కర్‌రెడ్డికి బాగా పట్టు ఉండేది. దాంతో టీడీపీ ఎత్తులు పారేవి కాదు. కాంగ్రెస్ బలహీన పడినా టీడీపీలో గ్రూపు రాజకీయాలు సైకిల్‌ను ఎదగనివ్వలేదు.
2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన వీరభద్రగౌడ్ 18 వందల 36 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం చేతిలో ఓడిపోయారు. అప్పుడు కూడా పార్టీ ఓటమికి టీడీపీలో గొడవలే కారణమని చెబుతారు. ఆ సమయంలో టీడీపీ నేతలు వీరభద్రగౌడ్, మసాల పద్మజ, వైకుంఠం శివప్రసాద్, వైకుంఠం మల్లికార్జున్‌కు అస్సలు పడేది కాదు. పైగా వీరభద్రగౌడ్‌కు వ్యతిరేకంగా వైసీపీతో చేతులు కలిపారు వైకుంఠం శివప్రసాద్. ఇదే శివప్రసాద్ తర్వాత టీడీపీలోకి తిరిగొచ్చేశారు. 2019లో కోట్ల సుజాతమ్మ టీడీపీ నుంచి పోటీ చేసి ఏకంగా 40వేల ఓట్ల తేడాతో అదే గుమ్మనూరు జయరామ్ చేతిలో ఓడిపోయారు. అప్పుడు కూడా టీడీపీ నేతలు కలిసి సాగలేదనే విమర్శలు ఉన్నాయి.
ఆలూరు టీడీపీలో గ్రూపుల గోల గురించి తెలిసినా.. వాటిని చక్కదిద్దే చొరవ తీసుకోవడం లేదు నాయకత్వం. ప్రస్తుతం ఇక్కడ టీడీపీలో నాలుగు గ్రూపులు ఉన్నాయి. కోట్ల సుజాత, వీరభద్రగౌడ్, వైకుంఠం శివప్రసాద్, వైకుంఠం మల్లికార్జున్‌లు ఎవరికి వారుగా పనిచేస్తున్నారు. కోట్ల సుజాతను మిగిలిన మూడు గ్రూపులు వ్యతిరేకిస్తున్నాయి. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ వ్యతిరేక ప్రోగ్రామ్స్ వేర్వేరుగా నిర్వహిస్తుండటంతో క్యాడర్ అయోమయంలో పడుతోంది. చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు నాలుగు గ్రూపులు నాలుగు ప్రాంతాల్లో నిర్వహించాయి. అలాగే టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కూడా. కోట్ల సుజాత కలుపుకొని వెళ్లడం లేదని మిగిలిన వర్గాలు ఆరోపిస్తుంటే.. పిలిచినా వాళ్లే రావడం లేదని సుజాత వర్గం ఎదురుదాడి చేస్తోంది. జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టినా గ్రూపులు కలవలేదు.
గమ్మత్తు ఏంటంటే.. రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఒక్కొక్కరు ఆలూరులోని ఒక్కొక్క వర్గానికి మద్దతుగా ఉండటం. పార్టీ అధిష్ఠానం ఇప్పటికైనా ఆలూరు టీడీపీకి చికిత్స చేస్తుందా లేక ఎలాగూ గెలవలేం కదా.. ఎఫర్ట్ పెట్టడం వేస్ట్ అనుకుంటుందో అనే చర్చ కేడర్‌లో ఉందట. దీంతో నేతల మధ్య తమ్ముళ్లు నలిగిపోతున్నారట. మరి.. ఆలూరుపై టీడీపీ ఆలోచన ఏంటో చూడాలి.