OTR: అధికారంలోకి వచ్చామన్న ఆనందమే లేకుండాపోయిందని ఉమ్మడి కృష్ణాజిల్లా కొందరు తమ్ముళ్లు తెగ బాధపడిపోతున్నారు. జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో 13 చోట్ల టిడిపి గెలిచింది. మిగతా మూడు స్థానాలైన విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ, కైకలూరు నియోజకవర్గాల్లో మూడు చోట్ల కూటమి అభ్యర్థులు గెలుపొందారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ఈ మూడు నియోజకవర్గాల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిలను ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. దీంతో అటు ఎమ్మెల్యే పదవి లేక, ఇటు ఇంఛార్జీ పోస్టు లేక అసహనంతో రగిలిపోతున్నారు వారంతా.
READ ALSO: Off The Record: హిందూపురం తమ్ముళ్ల అంతర్మథనం.. అనుకూలంగా మలచుకునే ప్రయత్నంలో వైసీపీ?
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి గెలిచారు. ఇక్కడ టీడీపీకి మొదటి నుంచి గ్రూపుల కుంపట్లు ఉన్నాయి. దీంతో పార్టీ అధిష్టానం ఇన్చార్జి పదవిని ఇవ్వటానికి మొదటి నుంచి ఇష్టపడలేదనేది లోకల్ టాక్. స్థానికంగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, నామినేటెడ్ పదవులు పొందిన నాగుల్ మీరా, డూండీ రాకేష్ లలో ఎవరికి ఇంచార్జి పదవి ఇచ్చిన మిగతావారితో రచ్చ తప్పదని….ఇంఛార్జీగా ఎవరిని నియమించడం లేదు. ఇక అవనిగడ్డలోనూ అంతే. జనసేన నుంచి మండలి బుద్దప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో ఆయన టీడీపీ నుంచి కూడా ఎమ్మెల్యే అయ్యారు. అవనిగడ్డలోనూ తెలుగుదేశం నేతలెవరికీ ఇంఛార్జీ బాధ్యతలు అప్పగించలేదు. ఇక్కడ టిడిపి వారికి జనసేన ఎమ్మెల్యేతో పడటం లేదు. అందుకే టిడిపి నేతలకు పెద్దగా పదవులు దక్కటం లేదని కేడర్ నిరాశలో ఉంది.
ఇక కైకలూరు నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్. గతంలో టిడిపి ఎమ్మెల్సీగానూ వ్యవహరించారు. ఆ తర్వాత ప్రజారాజ్యంలో చేరి 2014లో బిజెపి తరఫున కైకలూరు నుంచి గెలిచారు. 2024లో కూడా బిజెపి నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఇక్కడ ఇక్కడ ఇన్చార్జిని నియమించలేదు టీడీపీ. ఇవేకాదు స్థానికంగా ఉన్న మార్కెట్ కమిటీల చైర్మన్లు, ఆలయ చైర్మన్లు, ఇతర నామినేటెడ్ పదవులు కూడా టీడీపీ వారికి దక్కటం లేదు. దీంతో వారంతా అసహనంతో రగిలిపోతున్నారు. ఇలా విజయవాడ వెస్ట్, కైకలూరు, అవనిగడ్డలోనూ తెలుగుదేశం నేతలు అసంతృప్తిగా వున్నారు. ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడుస్తున్నా…ఇన్చార్జి లేకపోవడం వల్ల స్థానికంగా టిడిపి క్యాడర్ ఎటువంటి పనులు చేయించుకోలేక అసంతృప్తికి గురవుతోందనేది తెలుగు తమ్ముళ్ల మాట. ఇలాగే ఇన్చార్జిలను కేటాయించకపోతే కేడర్ పక్క చూపులు చూసే చూసే ప్రమాదం వుందన్న చర్చ జరుగుతోంది.
READ ALSO: OTR: కేటీఆర్ వ్యాఖ్యల వెనుక మర్మమేంటి..?