ఒక్కోసారి మనం చేసే ప్రయత్నాలకంటే.. ప్రత్యర్థులు చర్యలే మనకు కలిసి వస్తాయి. ప్రస్తుతం ఆ నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జికి అదే కలిసి వస్తోందా..? తమ నాయకుడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ శ్రేణులు వైసీపీ ఆఫీస్‌పై దాడి చేసి.. ఎదుటి వారికి అవకాశం ఇచ్చారా? మొన్నటి వరకు సెగ్మెంట్ అంతా కూడా తెలియనివారిని…స్టేట్ మొత్తం తెలిసేలా చేశారా?, నందమూరి బాలకృష్ణ నియోజకవర్గంలో మొన్న జరిగిన ఘటనలు ఎవరికి కలిసివచ్చాయి?.
వైసిపి గ్రాఫ్ ఎలా పెంచుకోవాలని… కొన్ని నియోజకవర్గాల్లో నాయకులు ప్రయత్నాలు చేస్తుంటే.. అక్కడ ప్రత్యర్ధులే వారికి అవకాశాలిస్తున్నారు. పైగా లేని ఇమేజ్ ని తెచ్చిపెడుతున్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ హిందూపురం నియోజకవర్గం. ఇక్కడ తెలుగుదేశం ఎంత బలంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీ ఆవిర్భావం నుంచి హిందూపురంలో ఓటమనేది ఎరుగదు. పైగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించారు. ఇక వైసిపి ఇక్కడ గెలవకపోవడానికి ప్రధానమైన కారణం … వైసిపిలో ఉన్న లోపాలు, విభేదాలు. ఇక్కడ తరచూ ఇన్చార్జీలను మారుస్తుండటం, వర్గ విభేదాల రగడ బాలకృష్ణకు కలిసి వస్తున్నాయి. కానీ కొన్ని రోజులుగా హిందూపురంలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆ ట్రెండ్‌కు బెండ్ తీసేలా వున్నాయి.
హిందూపురం నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ ఇన్చార్జిగా కురుబ దీపిక ఉన్నారు. ఆమె రాజకీయాలకు కొత్త. కానీ ఆమె భర్త వేణు రెడ్డి మాత్రం సుదీర్ఘకాలంగా వైసీపీలో ఉంటున్నారు. 2024 ఎన్నికలకు దాదాపు పది నెలల ముందే దీపికకు ఇక్కడ ఇన్చార్జి బాధ్యతలు అప్పజెప్పారు. గతంలో ఇక్కడున్న మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ నాయకత్వాన్ని లోకల్ నాయకులు వ్యతిరేకించడంతో ఆయనను తప్పించి దీపికకు పగ్గాలు ఇచ్చారు. అయితే అప్పటికే ఇక్కడ నవీన్ నిశ్చల్ తో పాటు కొండూరు వేణుగోపాల్ రెడ్డి, మధుమతి వర్గాలు చాలా బలంగా ఉన్నాయి. వీరందరినీ కాదని దీపికను తీసుకురావడంపై మొదటి నుంచి వ్యతిరేకత కనిపిస్తూనే ఉంది. 2024 ఎన్నికల్లో కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. అయితే ఓటమి తర్వాత కూడా ఈ పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు రాలేదు. ఇక్కడ బాలకృష్ణను ఓడించాలంటే ప్రజల్లో తమ బలం పెంచుకోవడమే కాదు ముందుగా ఐకమత్యంగా ఉండాలన్న ఆలోచన వైసిపి నాయకులు ఏ మాత్రం చేయలేదు. ఓటమి తర్వాత కూడా దీపికను నవీన్ నిశ్చల్ తో పాటు వేణుగోపాల్ రెడ్డి వ్యతిరేకిస్తుండటం, కొన్ని కార్యక్రమాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో వైసీపీ అధిష్టానం ఆగ్రహించి వారిని సస్పెండ్ చేసింది. అయితే అప్పటి నుంచి వైసీపీలో వైషమ్యాలు మరింత పెరిగాయి. ఇలాంటి సమయంలో తమ బలాన్ని పెంచుకోవాలని దీపికతో పాటు ఆమె భర్త చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గతంలో రాజకీయాల్ని పార్ట్ టైంగా చూసే వీరు.. ఇటీవల ఫుల్ టైం పాలిటిక్స్ చూసుకుంటూ హిందూపురంలో బలపడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో వేణు రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
ఈసారి బాలకృష్ణపై ఏకంగా వేణు రెడ్డి చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై టిడిపి నాయకులు ఆగ్రహించారు. పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. దీనిపై వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన , నిరసనలు చేపట్టింది. అనంతపురం జిల్లాకు చెందిన నాయకులంతా హిందూపురం వెళుతుండగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పైగా రాష్ట్రవ్యాప్తంగా కూడా నిరసన వ్యక్తం చేస్తుండటంతో మొత్తం అంతా హిందూపురం వైపు చూశారు. అయితే బాలకృష్ణ దీనిపై ఏమాత్రం స్పందించకపోయినా వైసిపి నిరసన వ్యక్తం చేయడంతో హిందూపురంలో ఏం జరుగుతోందా అని అందరూ ఒకసారి చూసే పరిస్థితి వచ్చింది. పైగా వేణు రెడ్డి, దీపికలు ఈ దాడి తర్వాత మరింత దూకుడుగా వ్యవహరిస్తూ ముందుకెళ్తున్నారు. మొన్నటి వరకు కొందరికే తెలిసిన వేణురెడ్డి, దీపికలు హిందూపురంను దాటి రాష్ట్రమంతా తెలిసేలా చేసింది టీడీపీ నేతల తీరు.
బాలకృష్ణపై చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత జరిగిన తమ పార్టీ ఆఫీసుపై దాడిని వైసీపీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకోవడంలో సక్సెస్ అయ్యారన్న ప్రచారం సాగుతోంది. ఈ అంశాన్ని ఇంకా ఎంత దూరం తీసుకెళ్తారు అన్న చర్చ నడుస్తోంది.