సత్తెనపల్లి టీడీపీ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయా? కోడెల శివరామ్‌కు టికెట్ ఇచ్చేది లేదని పార్టీ అధిష్ఠానం తేల్చి చెప్పేసిందా? బరిలో ఉండాలని ఉవ్విళ్లూరుతున్న శివరాం ఇప్పుడేం చేస్తారు? లెట్స్ వాచ్..!
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం టీడీపీలో గతంలో ఎన్నడూ లేనంత రాజకీయం ఇప్పుడు జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేయాలని దివంగత కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరాం కోటి ఆశలు పెట్టుకున్నారు. తండ్రి మరణం తర్వాత సత్తెనపల్లి కేంద్రంగా.. అనేక కార్యక్రమాలు చేస్తున్నారు కూడా. టీడీపీ టికెట్ విషయంలో పార్టీ నేతల ద్వారా లాబీయింగ్ చేస్తున్నారు. అయితే శివరాంపై స్థానికంగా టీడీపీ నేతల్లో వ్యతిరేకత ఉంది. కోడెల శివప్రసాద్ ఉన్న సమయంలో వచ్చిన ఆరోపణలు శివరామ్‌కు ప్రతికూలంగా మారాయి. కొంతకాలంగా వాటిని అధిగమించి.. మంచి మార్కులు కొట్టే ప్రయత్నంలో కోడెల తనయుడు ఉన్నారు. అయితే అవేమీ వర్కవుట్ కావడం లేదని తాజా పరిణామాల ద్వారా తెలుస్తోంది.
ఈ మధ్యే సత్తెనపల్లి టీడీపీ టికెట్ తనకే అని శివరాం ప్రచారం చేసుకున్నారు. పార్టీ శ్రేణులకు సంకేతాలు పంపేశారు. శివరామ్‌కు పోటీగా టీడీపీలో మరోవర్గం కూడా పావులు కదడపంతో సమస్య శ్రుతి మించింది. చివరకు టీడీపీ అధిష్ఠానం జోక్యం చేసుకోక తప్పలేదు. టికెట్ ఆశిస్తున్న శివరామ్‌కు చావు కబురు చల్లగా చెప్పారట పార్టీ పెద్దలు. సత్తెనపల్లి అన్న క్యాంటీన్ వివాదంపై శివరాం వివరణ కోరిన టీడీపీ.. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని కుండబద్దలు కొట్టేసిందట. అంతేకాదు.. పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఈ అంశమే ప్రస్తుతం సత్తెనపల్లి టీడీపీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది.
టీడీపీ అధిష్ఠానం సమాధానం విన్న తర్వాత కోడెల శివరాం ఏం చేస్తారన్నది ప్రస్తుతం ఆసక్తి కలిగిస్తోంది. ఈ ఏడాది కోడెల శివప్రసాద్ వర్ధంతిని పెద్ద ఎత్తున చేయాలని ఆయన భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అధిష్ఠానం నుంచి ఎవరు వస్తారు? వచ్చినవాళ్లు శివరామ్‌ను బుజ్జగిస్తారా? లేక శివరామే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారా అనేది ప్రశ్నగా ఉంది. ఈ దఫా కోడెల తనయుడికి టికెట్ ఇవ్వకూడదని పార్టీ నిర్ణయించిందంటే.. ఆయన్ని పక్కన పెట్టినట్టేనా అనే అనుమానాలు కేడర్‌లో ఉన్నాయట. ఒకప్పుడు గుంటూరు జిల్లా టీడీపీలో కోడెల అంటే తెలుగుదేశం పార్టీ.. టీడీపీ అంటే కోడెల అన్నట్టు ఉండేది. అలాంటిది పెద్దాయన మరణం తర్వాత పరిస్థితి మారిపోయింది. గత ఎన్నికల మాదిరే ఈసారీ కోడెల తనయుడిని దూరం పెడతారని అనుకుంటున్నారట.
తాజా పరిణామాలపై శివరాం ఎక్కడా స్పందిచకపోయినా.. ఆయన మనసులో ఏముందన్నది ప్రశ్న. రెబల్‌గా బరిలో ఉంటారా? లేక పార్టీ మారి పోటీ చేస్తారా అనే చర్చ సాగుతోంది. కొంత కాలంగా సత్తెనపల్లి కేంద్రంగా ఆయన చేస్తున్న కార్యక్రమాలే ఈ ప్రచారానికి బాట వేస్తున్నాయి. ఇంకోవైపు – సత్తెనపల్లి టికెట్‌ను పొత్తులో భాగంగా టీడీపీ వదులు కుంటుందనే టాక్ నడుస్తోంది. మరి.. తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు శివరాం కీలక ప్రకటన చేస్తారో.. లేక పార్టీ పెద్దలు చెప్పినట్టు టీడీపీ ఇచ్చే బాధ్యతలతో సరిపెట్టుకుంటారో చూడాలి.