ఆయనో సీనియర్ నేత. కొంతకాలం రాజకీయ జీవితానికి గ్రహణం పట్టినా.. మళ్లీ మంచిరోజులు వచ్చాయి. ఢిల్లీలో పెద్దలసభకు పంపింది అధికారపార్టీ. అదేంటో…! చేతిలో పెద్దపదవి ఉన్నా.. పొలిటికల్‌గా యాక్టివ్‌గా లేరట. దాంతో ఆయనకేమైంది అని చర్చించుకుంటున్నాయి పార్టీ శ్రేణులు. ఇంతకీ ఎవరా నాయకుడు?
రాజ్యసభ సభ్యుడు అయ్యాక మార్పు వచ్చిందా?
KR సురేష్‌రెడ్డి. టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు. గతంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాల్కొండ నుంచి ఎమ్మెల్యే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేరువయ్యారు. ఎమ్మెల్యేగా.. స్పీకర్‌గా ఉన్న సమయంలో బాల్కొండలో విస్తృతంగా పర్యటించేవారు. అలాంటి సురేష్‌రెడ్డికి రాజకీయంగా కొన్నాళ్లు అదృష్టం కలిసి రాలేదు. గులాబీ కండువా కప్పుకొన్న తర్వాత మంచిరోజులు వచ్చాయనే చెప్పాలి. అనూహ్యంగా రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది అధికారపార్టీ. ప్రజా ప్రతినిధిగా గతంలో సురేష్‌రెడ్డి ప్రదర్శించిన దూకుడును రాజ్యసభ సభ్యుడిగా మళ్లీ చూస్తామని ఆయన అనుచరులు.. పార్టీ కార్యకర్తలు అనుకున్నారట. కానీ.. గతానికి భిన్నంగా ఉన్న సురేష్‌రెడ్డి తీరును చూసి ఆశ్చర్యపోతున్నారు.
read also : ఈటల రాజేందర్ ది ఆత్మవంచన : కేటీఆర్
బాల్కొండకు వచ్చినా కొందరినే కలిసి వెళ్తున్నారా?
రాజ్యసభ సభ్యుడిగా సురేష్‌రెడ్డికి ప్రత్యేకమైన ప్రొటోకాల్ ఉంటుంది. అన్ని అధికారిక కార్యక్రమాలకు ఆయన ఆహ్వానం తప్పనిసరి. కానీ.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొన్ని నెలలుగా జరుగుతున్న అధికారిక కార్యక్రమాల్లో ఆయన పెద్దగా కనిపించడం లేదట. బాల్కొండకు వచ్చినా సెలెక్టెడ్‌గా కొందరినే కలిసి.. వెళ్లిపోతున్నారట. దీంతో సురేష్‌రెడ్డికి ఏమైందని ఆరా తీయడం మొదలుపెట్టారు అనుచరులు.
స్థానిక నేతలతో సమస్య రాకూడదనే పర్యటించడం లేదా?
ఇటీవల నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో అధికారికి కార్యక్రమాలు జరిగాయి. వాటిల్లో వేటికీ సురేష్‌రెడ్డి హాజరు కాలేదు. గతంలో ఒకసారి ఆర్మూర్ నుంచి కూడా ఆయన పోటీ చేశారు. బాల్కొండకు కాకపోయినా.. ఆర్మూర్‌లో అయినా ఎంపీ పర్యటిస్తారని లెక్కలేసుకున్నవారికి నిరాశ తప్పడం లేదట. కరోనా వల్ల ఆయన పెద్దగా బయటకు రావడం లేదని కొందరు భావిస్తుంటే.. నియోజకవర్గాల్లో పర్యటిస్తే స్థానిక సమస్యలతో కొత్త సమస్యలు వస్తాయని టూర్ చేయడం లేదంటూ ఇంకొందరు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి ఆయన కనిపించడం లేదనే ప్రచారం జరుగుతోంది.
రాజ్యసభలో మాట్లాడుతున్నారు సరే..!
పార్లమెంట్ వేదికగా సురేష్‌రెడ్డి తమ ప్రాంత వాయిస్ వినిపిస్తున్నారు కదా అని ఆయన అనుచరులు ప్రశ్నించేవారికి గట్టిగానే బదులిస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా.. ఎమ్మెల్యేగా.. స్పీకర్‌గా ఉన్న సురేష్‌రెడ్డికి.. ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సురేష్‌రెడ్డికి అస్సలు పొంతన లేదన్నది కేడర్ వాదన. ప్రజల్లోకి రాకపోవడం.. కేడర్‌కు దూరం కావడం సరికాదని.. రకరకాల ఊహాగానాలకు.. చర్చకు ఆస్కారం కల్పిస్తుందని అనుకుంటున్నారట. మరి.. సురేష్‌రెడ్డి ఆ విషయం గమనించారో లేదో..!