పదవుల పందేరంలో వారికి మరోసారి రెన్యువల్ దక్కలేదు. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి? రాజకీయంగా గ్రహణం పట్టిందా.. లేక భవిష్యత్‌లో ఇంకేదైనా పదవీయోగం ఉంటుందా? అధికార టీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి?
ఆశలు ఎక్కడ తేడా కొట్టాయి..?
పదవి గ్యారెంటీ అనుకున్నారు. కానీ.. కొందరు మాజీగానే మిగిలిపోతే.. ఇంకొందరు జనవరిలో మాజీలు కాబోతున్నారు. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి? రెన్యువల్ ఖాయమని భావించిన వారి ఆశలు ఎక్కడ తేడా కొట్టాయి? అధికార టీఆర్ఎస్ వర్గాల్లో ప్రస్తుతం ఇదే గరం గరం టాపిక్. ఒకటి కాదు.. రెండు కాదు.. ఒకేసారి 19 ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసింది టీఆర్ఎస్. వీటిలో ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు కాగా.. 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు.. మరొకటి గవర్నర్ కోటా. ఎమ్మెల్యే కోటాలో నలుగురు.. స్థానిక సంస్థల్లో ఐదుగురికి రెన్యువల్ దక్కలేదు.
ఎమ్మెల్యే కోటాలో నలుగురికి నిరాశ..!
ఎమ్మెల్యే కోటాలో పదవీకాలం పూర్తయిన డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ మంత్రి ఫరీదుద్దీన్, ఆకుల లలిత, బోడకుంటి వెంకటేశ్వర్లు మాజీలయ్యారు. మరోదఫా శాసనమండలిలో అడుగుపెట్టేందుకు ఈ నలుగురు శతవిధాలా ప్రయత్నించారు. అయితే వారు ఉంటోన్న జిల్లాల్లోని టీఆర్ఎస్ పరిస్థితులు.. సామాజిక సమీకరణాలు.. భవిష్యత్ రాజకీయ అవసరాలు మైనస్‌గా మారినట్టు టాక్. వీరి ప్లేస్‌లో కొత్తవారు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలు అయ్యారు.
స్థానిక సంస్థల కోటాలో ఐదుగురు రీప్లేస్..!
ఇక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో ఖాళీ అయిన 12లో ఏడుగురు మాత్రమే మళ్లీ రెన్యువల్ సాధించారు. ఐదుగురు సిట్టింగ్‌లకు నిరాశ తప్పలేదు. ఆదిలాబాద్‌లో పురాణం సతీష్.. కరీంనగర్‌లో నారదాసు లక్ష్మణరావు, మెదక్ జిల్లాలో భూపాల్‌రెడ్డి, నల్లగొండ జిల్లాలో తేరా చిన్నపరెడ్డి, ఖమ్మం జిల్లాలో బాలసాని లక్ష్మీనారాయణల ప్లేస్‌లో కొత్తవారికి అవకాశం ఇచ్చింది పార్టీ. స్థానిక సంస్థల కోటాలో ఆకుల లలిత పేరు ప్రచారంలోకి వచ్చినా.. చివరి నిమిషంలో జాబితాలో చోటు దక్కలేదు. గవర్నర్ కోటాలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి పేరును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.
భవిష్యత్ పదవుల భర్తీలో పరిగణనలోకి తీసుకుంటారా?
తాజా పదవుల పందేరంలో టీఆర్ఎస్ ఫ్రేమ్‌లో పట్టని 9 మంది రాజకీయ భవిష్యత్‌పై రకరకాలుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి గ్రహణం పట్టినా.. భవిష్యత్‌లో పదవుల భర్తీలో వీళ్లను పరిగణనలోకి తీసుకుంటారా? లేదా పార్టీలో పదవులేమైనా ఇస్తారా అన్నది ఒక చర్చ జరుగుతోంది. ప్రస్తుతం వీళ్లంతా పైకి నవ్వుతూ ఉన్నా.. రెన్యువల్ దక్కక ఒకింత అసంతృప్తిలో ఉన్నారన్నది అనుచరుల మాట. ఎవరూ కిక్కురుమనడం లేదు. తాజా మాజీల సేవలను పార్టీ ఎలా ఉపయోగించుకుంటుందో ఏమో.. అప్పటి వరకు వీళ్లపై చర్చ తప్పేలా లేదు.