ఒకరు కాదు.. ఇద్దరు కాదు… ఇప్పటికి ఐదుగురు కలెక్టర్లను బదిలీ చేసి పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ జాబితాలో ఇంకెంత మంది చేరతారో ఏమో? ప్రస్తుతం తెలంగాణ IAS వర్గాల్లో ఈ అంశంపైనే చర్చ జరుగుతోంది. ఎందుకు బదిలీ చేశారు? ఎందుకు పోస్టింగ్ ఇవ్వలేదన్నదే అధికారుల్లో చర్చగా మారింది. ఇంతకీ IASలను బదిలీ చేసి ఎందుకు పోస్టింగ్‌లు ఇవ్వడం లేదు? లెట్స్ వాచ్!
గత ఏడాది నవంబర్ నుంచి ఐదుగురు కలెక్టర్లు బదిలీ.. నో పోస్టింగ్!
IAS అంటే ఎంతో గొప్పగా చూస్తారు. కలెక్టర్లు అంటే ఇంకెంతో గౌరవం.. హోదా.. అధికారాలు ఉంటాయి. IAS అయినవారు జిల్లా కలెక్టర్లుగా విధులు నిర్వహించడం.. పదోన్నతులపై ఇంకా పైస్థాయికి వెళ్లడం కామన్. కొందరు ఐఏఎస్‌లు తమ సర్వీసులో ఒకటి కంటే ఎక్కువ జిల్లాల్లో కలెక్టర్లుగా విధులు నిర్వహిస్తారు. ప్రమోషన్ దక్కే వరకు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు కలెక్టర్ల బదిలీ సాధారణం. తెలంగాణలో కలెక్టర్లు బదిలీ అయితే మాత్రం ఇంకోచోట పోస్టింగ్ వస్తుందో రాదో అన్న అనుమానాలు ఉన్నాయి. గత ఏడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు బదిలీ అయిన ఐదుగురు కలెక్టర్ల ఉదంతాలనే అధికారవర్గాలు ఇందుకు ఉదాహరణగా చెబుతున్నాయి.
పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న జాబితాలో చేరిన శశాంక!
కారణాలేవైనా కలెక్టర్‌ను ఒకచోట నుంచి బదిలీ చేశాక.. ఇంకోచోట పోస్టింగ్ ఇవ్వడం రివాజు. వేకెన్సీ లేకపోతే ఒకటి రెండు రోజులు ఆగి పోస్టింగ్ ఇస్తారు. కానీ.. ఆ ఐదుగురు కలెక్టర్లు మాత్రం నెలల తరబడి ‘పని’కోసం ఎదురు చూస్తోన్న పరిస్థితి. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న సందీప్‌కుమార్ ఝా, జయశంకర్ భూపాల్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న అబ్దుల్ అజీమ్‌లను గత ఏడాది నవంబర్ 8న బదిలీ చేశారు. ఇప్పటి వరకు వారికి ఎక్కడా విధులు అప్పగించలేదు. మేడ్చల్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న వాసం వెంకటేశ్వర్లు, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్‌ల దుస్థితి ఇదే. ఇప్పుడీ జాబితాలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక చేరారు.
ఏ ఇద్దరు ఐఏఎస్‌లు కలిసినా బదిలీలపైనే చర్చ!
ఐఏఎస్ హోదాలో చేతిలో పనిలేక ఖాళీగా ఉండటం వల్ల కొందరు అధికారులు మానసిక వేదన చెందుతున్నారట. తమకు పనిష్మెంట్ ఇచ్చారో లేదో కూడా వారికి తెలియడం లేదట. చేసిన తప్పేంటో కూడా అర్థం కావడం లేదట. ఈ వైఖరి.. తోటి కలెక్టర్లను ఆందోళనలోకి నెడుతున్నట్టు చెబుతున్నారు. ఈ ఐదుగురి జాబితాలో ఇంకా ఎంత మంది చేరతారు? నెక్ట్స్ ఎవరు? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏ ఇద్దరు ఐఏఎస్‌లు కలిసినా ఈ టాపిక్‌పైనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొందరు సీనియర్ ఐఏఎస్‌లు లూప్‌లైన్‌లో ఉన్నారు. సచివాలయ ఉద్యోగులు చేయాల్సిన బాధ్యతల్లో వారు పనిచేస్తున్నారు.
తదుపరి ఎవరి వంతోనని కలెక్టర్లలో ఆందోళన!
వాస్తవానికి బదిలీ అయ్యి పోస్టింగ్ దక్కని ఐదుగురు కలెక్టర్లలో కొందరు ప్రభుత్వానికి విధేయులుగా ముద్రపడ్డ వారు కూడా ఉన్నారు. అలాంటి వారికి కూడా పోస్టింగ్ ఇవ్వకపోవడమే ఐఏఎస్ వర్గాలను ఆశ్చర్య పరుస్తోందట. ప్రభుత్వ విధేయులకే ఈ గతి పడితే.. రేపు తమ పరిస్థితి ఏంటి? అని మరికొందరు కలెక్టర్లు కలవర పడుతున్నట్టు సమాచారం. రేపటి రోజున తమ వంతు రావొచ్చని గాబరా చెందుతున్నట్టు తెలుస్తోంది. దీంతో బదిలీ అన్న మాట వినిపిస్తే చాలు అధికారులు ఉలిక్కి పడుతున్నారట. మరి.. ఐఏఎస్‌లలో నెలకొన్న ఈ భయాన్ని ప్రభుత్వం ఏ విధంగా తొలిగిస్తుందో చూడాలి.