ఆయన సైకిల్ దిగి కమలదళంలో చేరారు. అక్కడా ఇమడలేక బయటకొచ్చేశారు ఆ మాజీ ఎమ్మెల్యే. కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమైనా.. ఎవరో అడ్డుపుల్ల వేశారట. ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఆయన్ని అడ్డుకుంటోంది ఎవరు?
12న కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు?
మరాఠి చంద్రశేఖర్ అలియాస్ ఎర్ర శేఖర్. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే. మహబూబ్‌నగర్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు. బీజేపీకి గుడ్‌బై చెప్పాక.. కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 12న మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగే నిరుద్యోగ జంగ్ సైరన్ సభావేదికపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొనేందుకు నిర్ణయించారట. అయితే ఎర్ర శేఖర్ చేరికపై అభ్యంతరం చెబుతూ.. రాహుల్‌గాంధీతోపాటు, పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్‌కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారట. దాంతో ఈ ఎపిసోడ్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
గతంలోనే రేవంత్‌ను కలిసి సమ్మతి తెలిపారు..!
ఎర్ర శేఖర్ గతంలో టీడీపీ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో జడ్చర్ల, మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల వరకు టీడీపీని అంటిపెట్టుకుని ఉన్న ఆయన.. తర్వాత బీజేపీలో చేరారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీలోని ఇతర నేతలతో పడక గుడ్‌బై చెప్పేశారు. పీసీసీ చీఫ్‌గా రేవంత్ పగ్గాలు చేపట్టాక.. ఆయనతో భేటీ అయ్యి కాంగ్రెస్‌లో చేరతానని ప్రకటించారు కూడా.
సడెన్‌గా తెరపైకి ఎంపీ కోమటిరెడ్డి లేఖపై చర్చ..!
ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న తరుణంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ విషయం బయటకొచ్చింది. లేఖలోని అంశాలను అటుంచితే.. అసలు లెటర్ రాయాల్సిన అవసరం ఎంపీ కోమటిరెడ్డికి ఏమొచ్చింది అని ఆరా తీస్తున్నారట. పాలమూరు జిల్లా రాజకీయాలకు సంబంధించి వేరే జిల్లా నేత అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడం ఒక ఎత్తు అయితే.. ఈ ఎపిసోడ్‌లో స్థానిక నేతల పాత్రపై కూపీ లాగుతోందట ఎర్రశేఖర్ శిబిరం.
జడ్చర్ల కాంగ్రెస్ నేత ఒకరు ఎంపీ కోమటిరెడ్డికి సన్నిహితం..!
జడ్చర్లలో మొదటి నుంచి మల్లు రవి కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్నారు. ఈసారి నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సీటుపై దృష్టి పెట్టి.. రేవంత్ వెంటే ఉంటున్నారు. ప్రస్తుతం జడ్చర్లలో కాంగ్రెస్ వ్యవహారాలను పార్టీ నేత అనిరుధ్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జడ్చర్ల కాంగ్రెస్ టికెట్ తనదే అన్న ధీమాతో ఆయన ఉన్నారట. ఈ సమయంలో ఎర్రశేఖర్ చేరిక అనిరుద్‌రెడ్డి వర్గానికి మింగుడు పడటం లేదని సమాచారం. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, పార్టీ నేత అనిరుధ్‌రెడ్డికి మంచి సంబంధాలే ఉన్నాయట. కోమటిరెడ్డి పాలమూరు జిల్లాకు వచ్చిన సమయంలో రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడలోని అనిరుధ్‌రెడ్డి ఇంటికి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఒక దశలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పీసీసీ చీఫ్ అయితే తన రాజకీయ భవిష్యత్‌కు ఢోకా ఉండబోదని ఆయన అనుకున్నారట. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ హైకమాండ్‌కు ఫిర్యాదు వెనక అనిరుధ్‌రెడ్డి ఉన్నట్టు ఎర్రశేఖర్ శిబిరం అనుమానిస్తోందట.
జడ్చర్ల, మహబూబ్‌నగర్‌లో ఏది కేటాయిస్తారో క్లారిటీ లేదు..!
ఎర్ర శేఖర్ కాంగ్రెస్‌లో చేరితే జడ్చర్ల.. మహబూబ్‌నగర్‌లలో ఏ ప్లేస్ కేటాయిస్తారో స్పష్టత లేదు. ఈ రెండు చోట్లా.. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నవారితోపాటు.. టికెట్ ఆశిస్తున్నవారు ఎక్కువగానే ఉన్నారు. ఇప్పుడు వారందరినీ పక్కన పెట్టి ఎర్ర శేఖర్‌కు ప్రాధాన్యం ఇస్తారా? అన్నది ప్రశ్న. ఎర్ర శేఖర్ కాంగ్రెస్‌లో చేరిక జిల్లా రాజకీయాలపై ఎంత మేరకు ప్రభావం చూపిస్తుందో ఏమో కానీ.. తాజా ఎపిసోడ్ మాత్రం చర్చగా మారింది.