శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. ఆ మున్సిపల్ కార్పొరేషన్‌లోని అధికారులు దీన్ని బాగా వంటబట్టించుకున్నారు. ఏసీబీ ఎంట్రీ ఇవ్వడంతో ఎవరికివారు జాగ్రత్త పడుతున్నారట. తప్పించుకునే మార్గాల అన్వేషనలో క్షణం తీరిక లేకుండా ఉన్నట్టు టాక్. వారెవరో ఇప్పుడు చూద్దాం.
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌లోని పెద్ద పనోళ్లపై చర్చ!
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్. గత దశాబ్దకాలంగా అక్రమ కట్టడాలకు అడ్డదిడ్డంగా అనుమతి ఇచ్చేశారు అధికారులు. ఇప్పుడా అక్రమాలను తవ్వి తీసే పనిలో పడింది ప్రభుత్వం. దాంతో ఆ అవినీతితో సంబంధం ఉన్నవారంతా ఎప్పుడు ACB ఎంట్రీ ఇస్తుందో అని టెన్షన్ పడుతున్నట్టు సమాచారం. రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న మున్సిపల్ కార్పొరేషన్ కావడంతో.. ఇక్కడి వ్యవహారాలపై సిబ్బందితోపాటు బయటవాళ్లకు కూడా ఆసక్తి ఎక్కువ. ఇప్పుడా ఆసక్తే గుంటూరులోని పెద్ద పనోళ్ల గురించి చర్చించేలా చేస్తోంది.
ఏసీబీ ప్రశ్నలకు డొంక తిరుగుడు సమాధానాలు?
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వందల సంఖ్యలో పరిమితికి మించి ఫ్లోర్లు కట్టారు. వీటిపై ప్రభుత్వం దృష్టి పెట్టిన వెంటనే పెద్దసంఖ్యలో ఫిర్యాదులు అందాయి. వీటిపై సమగ్ర విచారణ చేయాలని ఏసీబీని ఆదేశించింది ప్రభుత్వం. ఏసీబీ ప్రశ్నిస్తే డొంక తిరుగుడు సమాధానాలు ఇస్తున్నారట అధికారులు. అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వానికి నివేదికిస్తామని ఏసీబీ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.
లాంగ్ లీవ్‌లో వెళ్లిపోతున్న అధికారులు?
వాస్తవానికి అక్రమ కట్టడాలు కట్టేటప్పుడు భవన యాజమానుల దగ్గర లక్షల్లో లంచాలు మింగేసిన అధికారులు.. ఇప్పుడు ఆ భవనాలను కూల్చే పరిస్థితి లేదు. కూల్చడానికి వెళ్తే భవన యజమాని ఊరుకోడు. చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం కొరడా ఝులిపిస్తుంది. దీంతో ఏం చేయాలో తెలియక కొందరు అధికారులు .. జీతం రాకపోయినా ఫర్వాలేదని దీర్ఘకాలిక సెలవు పెట్టేశారట. మరికొందరు డిప్యుటేషన్‌పై వెళ్లిపోతున్నారట. ఇప్పటికే ఓ మహిళా అధికారి జరుగుతున్న పరిణామాలకు భయపడి శాఖ మార్పించుకుని వెళ్లిపోయారట. ఆమెకు ముందు కూడా కీలక బాధ్యతల్లో ఉన్న పలువురు సైతం ట్రాన్స్‌ఫర్లు పెట్టుకుని జారుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఇంటినే ఆఫీస్‌గా మార్చిన ఓ అధికారి?
కార్పొరేషన్‌లో చక్రం తిప్పుతున్న అధికారుల కాల్ డేటాను ఏసీబీ సేకరించిందట. వారికి నోటీసులు పంపినట్టు చెబుతున్నారు. అయితే తేలు కుట్టిన దొంగల్లా కామ్‌గా ఉండిపోతున్నారట. పైకి మాత్రం మాకేం నోటీసులు రాలేదని ఎవరికి వారు సెల్ఫ్ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారు. ఇదే సమయంలో విజిలెన్స్ అధికారులు రహస్య దర్యాప్తు చేస్తున్నారని సమాచారం అందటంతో పాత గుంటూరుకు చెందిన ఓ అధికారి తన ఇంటినే కార్యాలయంగా మార్చుకున్నారట.
మొత్తానికి ఏసీబీ వల నుంచి బయట పడేందుకు ఉన్నతాధికారులు కొందరు రాజకీయ నాయకులతోనూ లాబీయింగ్ చేస్తున్నారట. మరి.. గుంటూరులోని అవినీతి జలగలు ఏసీబీ వలకు పక్కాగా చిక్కుతాయో.. నేతల అండతో ఒడ్డున పడతాయో చూడాలి.