ఆయనో కేంద్ర మాజీ మంత్రి. 30 ఏళ్ల రాజకీయ అనుభవం. అలాంటి పెద్దాయన ‘మనసు…గాయపడింది. తాడేపేడో తేల్చేయాలని నిర్ణయించుకున్నారట. రూట్ మార్చి లేఖల యుద్ధం ప్రారంభించారు. ఇంతకీ ఆయన ‘పోరాటం’ ఫలిస్తుందా!?
ఇప్పుడు రోజూ వార్తల్లో వ్యక్తి అయ్యారు!
అశోక్ గజపతిరాజు. టీడీపీ సీనియర్ నేత. పార్టీలో కూడా ఆయన్ను రాజుగానే ట్రీట్ చేసేశారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన ప్రముఖంగా కనిపించేవారు. అది కూడా అధికారిక కార్యక్రమాల్లో మాత్రమే. కేంద్రం, రాష్ట్రంలో ఎక్కడైనా సరే మంత్రిగా ఉన్నా తన పని తాను చూసుకుని వెళ్లేవారు. పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్లిందంటే రాజుగారు కంటికి కూడా కనిపించేవారు కాదు. ఎక్కడ ఉంటారో కూడా ఎవరికీ తెలియదు. అలాంటి రాజుగారు ఇప్పుడు రోజూ వార్తల్లో వ్యక్తి అయ్యారు.
అశోక్‌పైనే పోలీసులకు మాన్సాస్ ఈవో ఫిర్యాదు!
ధర్మకర్త వివాదం తర్వాత సింహాచలం ఆలయం రాష్ట్రస్ధాయిలో చర్చగా మారింది. ఛైర్మన్ బాధ్యతల నుంచి అశోక్ గజపతిరాజును అప్పట్లో తొలగించి సంచయితకు పట్టం కట్టింది ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేసి.. తిరిగి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించినా వివాదం చల్లారలేదు. సింహాచలం, మాన్సాస్ ట్రస్ట్ అధికారుల సహాయ నిరాకరణతో ఛైర్మన్ వర్సెస్ అడ్మినిస్ట్రేషన్ మధ్య పెద్ద అంతరం ఏర్పడింది. మాన్సాస్ విద్యాసంస్ధల ఉద్యోగులు జీతాలకోసం ఆందోళన చేపట్టగా అశోక్ గజపతిరాజు వారిని సమర్ధించారు. ఈ వివాదంలో ధర్మకర్తపైనే ఈవో వెంకటేశ్వరరావ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ధర్మకర్త హోదాలో వ్యూహాలకు పదును పెట్టారా?
సింహాచలం ఆలయ భూముల వివాదం విజిలెన్స్ విచారణలో ఉంది. 2016-17కాలంలో సుమారు 864 ఎకరాలను ప్రాపర్టీ రిజిస్టర్ నుంచి తొలగించారనేది అభియోగం. ఈ ఆస్తుల విలువ వేలకోట్లగా అంచనా. ఈ అవకతవకలకు బాధ్యుల్ని చేస్తూ అప్పటి ఈవో, అసిస్టెంట్ కమిషనర్లపై వేటు పడింది. ఈ మొత్తం వ్యవహారం వెనక సూత్రధారులను బయటపెడతామని అధికారపార్టీ నేతలు ప్రకటిస్తున్నారు. మరోవైపు చైర్మన్‌గా తనను తొలగించడం.. అధికారపార్టీ నేతల కామెంట్స్ అశోక్ గజపతిరాజు మనసును గాయపరిచాయనేది ఆయన మాటలను బట్టి అర్ధమవుతోంది. దేవస్ధానం చైర్మన్ కోసం కేటాయించిన కారును సైతం తిరస్కరించిన ఆయన.. ధర్మకర్త హోదాలో వ్యూహాలకు పదును పెట్టినట్టు కనిపిస్తోంది.
అప్పట్లో సంచయిత పీఏ కార్తీక్‌కు డాక్యుమెంట్లు అప్పగించారా?
ఆలయ వ్యవహారాలపై పట్టు బిగించేలా అశోక్ కీలక చర్యలకు ఉపక్రమిస్తున్నట్టు సమాచారం. చైర్మన్ వ్యవహారశైలి అందుకు ఊతం ఇస్తోంది కూడా. సంచయిత గజపతిరాజు చైర్మన్‌గా ఉన్న సమయంలో పాలకమండలి తీసుకున్న నిర్ణయాలను పునః సమీక్షించబోతున్నారట. సంచయిత గజపతిరాజు పీఏగా చెలామణి అయిన కార్తీక్ అనే యువకుడు చాలాకాలం దేవస్ధానం కాటేజ్‌లోనే బసచేశారు. ఆ సమయంలో ఆలయానికి చెందిన ఫైళ్లను డాక్యుమెంట్లను కార్తీక్‌కు అప్పగించారనే విమర్శలు బహిరంగంగానే వినిపించాయి. సుమారు ఏడాదిన్నరపాటు సంచయిత చైర్మన్‌గా ఉన్నారు. ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసుకుంటున్నారట అశోక్. ఈ దిశగా అశోక్ సంధిస్తున్న లేఖలు ఉద్యోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టు సమాచారం. రాతపూర్వకంగా సమాధానాలు కోరుతున్నారట.
సంచయిత హయాంలో జరిగిన బోర్డు మీటింగ్ వివరాలు కోరిన అశోక్!
సర్టిఫైడ్ కాపీలు కోరిన అశోక్!
ఇటీవల తగిలిన ఎదురు దెబ్బల తర్వాత అశోక్ గజపతిరాజు దూరదృష్టిని ప్రదర్శిస్తున్నారట. దీంతో సింహాచలం ఈవో వెర్సస్ ఛైర్మన్ మధ్య మళ్లీ లేఖల యుద్ధం మొదలైంది. సంచయిత ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రస్ట్ బోర్డు సమావేశాల అజెండా, వాటిపై జరిగిన చర్చ, తీసుకున్న నిర్ణయాలను వెల్లడించాలని తాజాగా లేఖలో కోరారు. చైర్మన్ లేఖకు స్పందించిన ఈవో ఈ ఏడాది మార్చి 4న, జూన్ 14, అదే నెల 21న ట్రస్ట్ బోర్డు సమావేశాలు నిర్వహించామని, 11అంశాలను చర్చకు పెట్టామని సమాధానం ఇచ్చారు. ఆ వివరాలను పొందు పరిచినప్పటికీ అసమగ్రంగా ఉండటంపై చైర్మన్ అభ్యంతరం తెలిపారట. ప్రస్తుత పరిస్ధితుల్లో అన్నింటినీ అనుమానించాల్సి వస్తున్నందున ట్రస్ట్ బోర్డు తీసుకున్న నిర్ణయాల సర్టిఫైడ్ కాపీ కావాలని కోరుతున్నారట అశోక్.
పూర్తిస్థాయిలో బదులివ్వడానికి ఈవో వెనకాడుతున్నారా?
అజెండాలోని అంశాలు, వాటిపై చర్చ, తీసుకున్న నిర్ణయాలు, తీర్మానాల కాపీలు కావాలని అశోక్ అడిగారు. పూర్తి వివరాలు సమర్పిస్తే ఏం జరిగిందో తనకు తెలుస్తుందని, పొడిపొడి పదాలతో వాటిని ఎలా అర్ధం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు ఛైర్మన్. తీర్మానం కాపీని ఇవ్వడానికి అభ్యంతరం ఏంటనేది ఆయన వాదన. చైర్మన్ అడిగే ప్రశ్నలకు పూర్తిస్ధాయిలో బదులు ఇవ్వడానికి ఈవో ఎందుకు వెనకాడుతున్నారనేది ఇప్పుడు ఆలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాతపూర్వక సమాధానం ఇచ్చిన తర్వాత ట్రస్ట్ బోర్డ్ సమావేశం నిర్వహించి అటోఇటో తేల్చేయాలని అశోక్ భావిస్తున్నారట. అదే జరిగితే సభ్యులు ఎలా స్పందిస్తారు? ధర్మకర్త నిర్ణయాలే ఫైనల్ అవుతాయా? అన్నది ప్రశ్నగా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.