బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజుకు కోపం వచ్చింది. రాజకీయాలను రాజకీయాలుగా చూడకుండా.. పాత విషయాలను పదేపదే ప్రస్తావించడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారా? అందుకే ఎన్నడూ లేనివిధంగా అధికారపార్టీపై విరుచుకుపడ్డారా? అయితే 2024 తర్వాత రాజకీయాలకు గుడ్‌బై కొట్టేస్తానని ఎందుకు చెప్పారు? ఇది ఆగ్రహమా..? అసహనమా..?
2024 తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటన..!
ప్రత్యర్థులను.. అందులోనూ టీడీపీని.. ఆ పార్టీ నేతలను విమర్శించడంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఫ్రంట్ లైనులో ఉంటారు. అలాంటిది అధికార పార్టీ వైసీపీపైనా.. ఆ పార్టీ నేతలపైనా.. వైసీపీ ప్రభుత్వంపైనా వీర్రాజు నిప్పులు చెరిగారు. ఫైర్ ఫైర్స్ ద ఫైర్ అన్న రేంజ్‌లో ఆయన మాటల దాడి సాగింది. అన్ని అంశాలను కలిపి కొట్టేశారు. అంతా బాగానే ఉంది కానీ.. ప్రెస్‌మీట్ మొదట్లో.. చివర్లో ఆయన ప్రస్తావించిన కొన్ని అంశాలే చర్చకు దారి తీస్తున్నాయి. తన సొంత వార్డులో కూడా గెలవలేకపోయారంటూ ప్రత్యర్థి పార్టీలు చేసే విమర్శలతోపాటు.. చివర్లో 2024 తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటాననే ప్రకటించారు. సడెనుగా వీర్రాజు ఈ నిర్ణయం తీసుకోవడం వెనక కారణం ఏంటి? ప్రత్యర్ధులు చేసే విమర్శలు భరించ లేకపోతున్నారా..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ట్రోలింగ్‌లకు విసిగిపోయి ఆ నిర్ణయం తీసుకున్నారా?
వీర్రాజును గేలి చేసేవాళ్లు ఎక్కువయ్యారా?
ఇటీవల కాలంలో సోము వీర్రాజు అధికారపార్టీ నేతలపై గట్టిగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ క్రమంలో సోషల్ మీడియాలో వీర్రాజును ట్రోలింగ్ చేసే పోస్టింగ్‌లు పెరిగాయి. గతంలోనూ టీడీపీ నుంచి సోషల్ మీడియాలో ఈ తరహా దాడి జరిగితే.. ఇప్పుడు ఎవరు చేస్తున్నారన్నది ప్రశ్న. దీంతో వీర్రాజు విసిగిపోయి ఈ నిర్ణయం తీసుకున్నారేమోనని చర్చ జరుగుతోంది. అందుకే తానేంటో.. బీజేపీకి తానేం చేశానో ఆయన బలంగా చెప్పే ప్రయత్నం చేసినట్టుగా విశ్లేషిస్తున్నారు. తాను ఎమ్మెల్యేలను.. ఎంపీలను గెలిపించానని.. తన కోసం టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరిని పక్కన పెట్టి రాజమండ్రి అర్బన్ సీటును బీజేపీకి కేటాయించినా.. ఆ ఆఫర్‌ను తనకోసం కాకుండా ఆకుల సత్యనారాయణకు ఇచ్చి.. గెలిపించుకున్నానని చెప్పుకొచ్చారు వీర్రాజు. 2014లో మంత్రి పదవి ఇస్తానన్నా వద్దని.. మాణిక్యాలరావుకు తానే ఇప్పించానని గతంలో చెప్పని చాలా విషయాలు వెల్లడించారాయన. ఇంత చేసినా.. తనను గేలి చేసేవాళ్లు ఎక్కువైపోవడంతో వీర్రాజు విసిగిపోయినట్టు ప్రచారం జరుగుతోంది.
అమిత్ షాతో భేటీ తర్వాత పార్టీలో కీలక పరిణామాలు..!
అయితే వీర్రాజు నైజం తెలిసిన వారు మాత్రం.. ఆయన చిన్న చిన్న విషయాలకు కుంగిపోయే వ్యక్తి కాదని అంటున్నారట. అలాంటప్పుడు రాజకీయాలకు గుడ్‌బై చెప్పేస్తాననే మాట సోము నోట ఎందుకొచ్చిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తిరుపతి భేటీ తర్వాత ఏపీ బీజేపీలో కొన్ని కీలక పరిణామాలు జరిగాయి. కోర్ కమిటీలో కొత్తవారికి చోటివ్వడంతోపాటు.. కో ఇంఛార్జ్‌గా ఉన్న సునీల్ దేవధర్‌ను కూడా మారుస్తారనే వాదన ఉంది. ఈ ప్రచారం వీర్రాజుకు మింగుడు పడడం లేదనేది టాక్. మరి.. వీర్రాజు మాటల మర్మం ఏంటో కాలమే చెప్పాలి.