ఎన్నికల వరకు కలిసే ఉన్నారు. అన్నొస్తున్నాడంటే సందడి చేశారు. కానీ.. పార్టీ కమిటీల ప్రకటన వారి మధ్య గ్యాప్ తీసుకొచ్చేసింది. కత్తులు నూరుతున్నారట. గల్లీ గల్లీ గరంగరంగా మారినట్టు అధికారపార్టీ వర్గాల టాక్. ఇంతకీ ఏంటా పంచాయితీ?
ఎమ్మెల్యే కాలేరుపై కార్పొరేటర్లు, సొంత పార్టీ నేతల గుర్రు..!
కాలేరు వెంకటేష్. హైదరాబాద్ సిటీలో అంబర్‌పేట్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే. నియోజకవర్గంలోని GHMC కార్పొరేటర్లు, మాజీలు కాలేరు పేరు చెబితేనే ఒంటికాలిపై లేస్తున్నారట. నిన్న మొన్నటి వరకు తమ డివిజన్‌కు ఎమ్మెల్యే వస్తున్నారంటే.. కార్పొరేటర్లకు కాళ్లూ చేతులు ఆడేవి కావు. అలాంటిది సీన్ రివర్స్. స్వపక్షంలోనే విపక్షంగా మారిపోయారు. డివిజన్లలో టీఆర్‌ఎస్ సంస్థాగత కమిటీల ప్రకటనే వారి మధ్య నిప్పు రాజేసిందని టాక్.
ఎమ్మెల్యే అనుచరులతో కమిటీలను నింపేశారని నేతలు గరంగరం..!
తమ పదవీ కాలం పదికాలాలపాటు పదిలంగా ఉండాలని కార్పొరేటర్లు భావించడం కామన్. ఇందుకోసం పార్టీ కమిటీలలో అనుచరులకు ప్రాధాన్యం ఇస్తుంటారు. తమ అనుచరులకు ఆ కమిటీలలో చోటు కల్పించాలని అనుకున్నారట. కానీ.. కమిటీల ప్రకటనకు వచ్చే సరికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్.. స్థానిక పార్టీ కార్పొరేటర్లను లైట్ తీసుకున్నారట. నియోజకవర్గంలోని అన్ని కమిటీలలో తన అనచరులను నింపేశారని కార్పొరేటర్లు గుర్రుగా ఉన్నారు. పైగా.. ఆ కమిటీలపై చేసిన అర్ధరాత్రి ప్రకటనలు మరింత మంట పుట్టించాయట.
డివిజన్ల వారీగా కార్పొరేటర్లు.. మాజీలు సమావేశాలు..!
ప్రస్తుతం అంబర్‌పేట్‌లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం వచ్చేసిందట. రెండు వర్గాలు కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి లేదట. రోడ్డున పడి రచ్చ చేసుకునేలా ఉన్నాయట గొడవలు. ప్రస్తుతం కార్పొరేటర్లు.. మాజీ కార్పొరేటర్లు డివిజన్ల వారీగా అనుచరులతో పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తున్నారట. ఎమ్మెల్యే ఏకపక్షంగా కమిటీలను ప్రకటించారని.. వాటిని రద్దు చేసేలా టీఆర్ఎస్ పెద్దలపై ఒత్తిడి తేవాలని తీర్మానిస్తున్నట్టు టాక్.
కాలేరుపై పార్టీ పెద్దలకు కార్పొరేటర్ల ఫిర్యాదు?
అంబర్‌పేట్ నియోజకవర్గంలో ఐదు డివిజన్లు ఉంటే.. రెండుచోట్లే టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు గెలిచారు. వారిద్దరూ ఏకంగా టీఆర్ఎస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారట. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే.. కార్పొరేటర్లను, పార్టీ నేతలను పట్టించుకోకపోతే ఎలా అని ప్రశ్నలు సంధిస్తున్నారట. మరి.. ఈ గల్లీ సెగలను గులాబీ పెద్దలు ఎలా చల్లారుస్తారో చూడాలి.