‘అబ్బే.. అదేం లేదు. ఆ విషయంలో నాకెలాంటి సంబంధం లేదు’. ఈ మధ్య పదేపదే ఇదే మంత్రం వల్లె వేస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యే. ప్రతీసారీ ఆ సందర్భాన్ని తెరమీదకు తేవడం.. విషయాన్ని డైవర్ట్ చేయడమే పని. ఇదంతా డ్యామేజ్ కంట్రోల్ కోసమే అనేది కేడర్ మాట. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.
పొన్నాడ సతీష్. ముమ్మడివరం ఎమ్మెల్యే. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కూడా. 2009లో తొలిసారి ముమ్మిడివరం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికల ముందు నియోజకవర్గ ఇంఛార్జిని కాదని ఆయనను పార్టీలోకి ఆహ్వానించి టికెట్ ఇచ్చింది వైసీపీ. ఇదంతా బాగానే ఉన్నా… కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు ప్రతిపాదించిన సమయంలో అమలాపురంలో అల్లర్లు జరిగాయి. అప్పుడు మంత్రి విశ్వరూప్‌తోపాటు ఎమ్మెల్యే సతీష్ ఇంటిని కూడా ఆందోళనకారులు తగులబెట్టారు. దీంతో ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చారు సతీష్.
మత్స్యకార సభ కోసం సీఎం జగన్ ముమ్మిడివరం వచ్చిన సమయంలో జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని కొందరు వినతిపత్రం ఇచ్చారు. ఆ సమయంలో ఎమ్మెల్యే సతీష్ కాస్త చొరవ తీసుకున్నారన్నది ఆందోళనకారుల వాదన. అందుకే అమలాపురం అల్లర్లలో ఎమ్మెల్యే ఇంటిని కూడా టార్గెట్ చేశారనే చర్చ ఉంది. అల్లర్లలో అన్ని పార్టీల వారూ ఉన్నారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేయడం.. కొందరిని అరెస్ట్ చేయడం చకచకా జరిగాయి. ఆ ఎసిపోడ్ మొత్తం క్లోజ్ అయిందని అనుకుంటున్నా.. ఎమ్మెల్యే సతీష్ మాత్రం దాని నుంచి బయటకు రాలేకపోతున్నారట. ఏ కార్యక్రమంలో పాల్గొన్నా.. ఏం మాట్లాడాలని అనుకున్నా.. తిరిగి తిరిగి అక్కడికే వస్తున్నారట. ఆ విషయంలో నా తప్పేమీ లేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారట.
ఇటీవల జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పొన్నాడ సతీష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చగా మారాయి. కోనసీమ ప్రజలకు ఆవేశం.. ఆనందం రెండూ ఎక్కువే. ఆనందం వస్తే నెత్తిన పెట్టుకుంటారు. ఆవేశం వస్తే ఇల్లు తగలబెట్టేస్తారు అని వ్యాఖ్యానించారు పొన్నాడ. అయితే రాజకీయంగా తన భవిష్యత్ డ్యామేజీ కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారని అభిప్రాయపడేవాళ్లూ ఉన్నారు. అమలాపురం అల్లర్ల తర్వాత అమలాపురంలో మంత్రి విశ్వరూప్‌కు నిరసన సెగ తగిలింది. నాయకులు పార్టీల వారీగా కాకుండా సామాజికవర్గాల వారీగా విడిపోయారు. అలాంటి పరిస్థితి తనకు ఎదురవుతుందేమోనని ఎమ్మెల్యే సతీష్ టెన్షన్ పడుతున్నారట. దీనికితోడు ముమ్మిడివరంలో కూడా కొందరు ద్వితీయశ్రేణి నాయకులు ఎమ్మెల్యేతో గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారట. తమ వాళ్లు జైళ్లో మగ్గడానికి ఎమ్మెల్యే సతీష్ కూడా ఒక కారణమని ఓపెన్‌గానే కామెంట్స్ చేస్తున్నారట. అది తెలిసినప్పటి నుంచి రూటు మార్చేశారన్నది స్థానికంగా వినిపిస్తున్న టాక్.
ప్రస్తుతం సమస్యను సున్నితంగా డీల్ చేసే పనిలో పడ్డారు ఎమ్మెల్యే సతీష్. రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా కొత్త ఫార్ములా అప్లయ్ చేస్తూ.. సెంటిమెంట్‌కు ఆయింట్మెంట్ రాసే పనిలో పడ్డారు. తరచూ దానిపైనే చర్చ చేసి.. అందులో ఇన్వాల్వ్ అయిపోయి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు ఎమ్మెల్యే. మరి.. ఈ ఎత్తుగడ ఆయనకు వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.